డైరెక్షన్‌ మారుతోంది | special story is tollywood hero's tamil directors | Sakshi
Sakshi News home page

డైరెక్షన్‌ మారుతోంది

Published Sun, Dec 9 2018 12:40 AM | Last Updated on Sun, Dec 9 2018 5:15 AM

special story is tollywood hero's tamil directors - Sakshi

నాని, తమన్నా, సమంత, అల్లు అర్జున్‌

టాలీవుడ్‌కి దిగుమతి జోరు పెరిగింది. బాలీవుడ్‌ హీరోయిన్లు, విలన్లు ఇక్కడ హల్‌చల్‌ చేస్తున్నారు. హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్స్‌ కూడా వస్తున్నారు. ఈ ఏడాది డైరెక్టర్లు కూడా వచ్చారు. గతంలోనూ పరభాషల దర్శకులు తెలుగు సినిమాలు చేశారు కదా? అనుకోవచ్చు. అయితే ఒకే ఏడాదిలో నలుగురైదుగురు వేరే భాషల దర్శకులు వచ్చిన దాఖలాలు తక్కువ. ఈ ఏడాది ఇప్పటివరకూ ముగ్గురు నలు గురు  పరభాష దర్శకులు వస్తే వచ్చే ఏడాది కూడా ఆ నంబర్‌ కంటిన్యూ కానుంది. చెప్పాలంటే ఎక్కువ అయ్యే అవకాశమే కనిపిస్తోంది. సొంత భాష నుంచి పరభాషకు డైరె క్షన్‌ మార్చుతున్న ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం...

అట్లీ ఖాయం
‘రాజా రాణి, తేరి (తెలుగులో పోలీసోడు) మెర్సెల్‌ (తెలుగులో అదిరింది) చిత్రాలు సూపర్‌ హిట్‌. ఈ మూడు హిట్స్‌తో తమిళ దర్శకుడు అట్లీ స్టార్‌ డైరెక్టర్‌ అయ్యారు. ఇప్పుడీయన మళ్లీ విజయ్‌తోనే ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘మెర్సెల్‌’ బంపర్‌ హిట్‌ కాబట్టి తాజా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది. వచ్చే ఏడాది అట్లీ మన తెలుగు ఇండస్ట్రీకి వస్తారు. ఎన్టీఆర్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందని టాక్‌.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా షూటింగ్‌ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు ఎన్టీఆర్‌.  ఆ మధ్య ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ తెలిపారు. అట్లీతో కూడా ఓ సినిమా ఉందన్నారాయన. దీంతో ఎన్టీఆర్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న ప్రచారం ఊపందుకుంది. ఎన్టీఆర్‌ ఒక కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కూడా వచ్చే ఏడాది చివరికి ఓ కొలిక్కి వస్తుంది కాబట్టి 2020 స్టార్టింగ్‌లో ఎన్టీఆర్‌–అట్లీ–అశ్వనీదత్‌ సినిమా స్టార్ట్‌ అవుతుందని ఊహించవచ్చు. ఒకవేళ ఎన్టీఆర్‌ సినిమాకి అట్లీ దర్శకుడు కాకపోతే ఎలానూ నిర్మాత అశ్వనీదత్‌ ఈ దర్శకుడితో ఓ సినిమా అన్నారు కాబట్టి అట్లీ రావడం ఖాయం.

కోలీ అర్జున్‌
హీరో అల్లు అర్జున్‌ నెక్ట్స్‌ సినిమా ఏంటి? ఈ ప్రశ్నకు ఇంకా సరైన సమాధానం దొరకలేదు. త్రివిక్రమ్, విక్రమ్‌ కె. కుమార్‌ ఇలా కొంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇంకా అధికారికంగా ఏ దర్శకుడి పేరు ఫిక్స్‌ కాలేదు. అయితే తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఓ సినిమా రూపొందనుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. తమిళంలో ‘వేదాలం, వీరమ్, వివేగమ్‌’ వంటి సినిమాలను తెరకెక్కించిన శివ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఓ సినిమా రూపొందనుందని ఇటీవల కొన్ని గాసిప్‌లు వినిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది. అల్లు అర్జున్‌ నెక్ట్స్‌ చిత్రానికి లింగుస్వామి దర్శకుడని చెప్పలేం కానీ ఫ్యూచర్‌లో వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని ఊహించవచ్చు. లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ‘పందెంకోడి’ సినిమా ఇక్కడ ఎంత పెద్ద సక్సెస్‌ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కేరళలో అల్లు అర్జున్‌కి మంచి ఫాలోయింగ్‌ ఉంది. మల్లూ అర్జున్‌ అంటారు. ఇప్పుడు కోలీవుడ్‌ దర్శకుడితో చేసి, ‘కోలీ అర్జున్‌’ అని కూడా అనిపించుకుంటారేమో.

రానా రౌండప్‌
‘బాహుబలి’ సినిమా తర్వాత రానా క్రేజ్‌ డబుల్‌ ట్రిపుల్‌ అయ్యింది. అందుకే పరభాష డైరెక్టర్లు ఆయనతో సినిమాలు చేయడానికి ఉత్సాహపడుతున్నారు. కోలీవుడ్‌ డైరెక్టర్స్‌ సత్యశివ, ప్రభు సాల్మన్‌ దర్శకత్వాల్లో రూపొందుతున్న ‘మడైతిరందు, కాడన్‌’ సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు రానా. మలయాళ దర్శకుడు కె.మధు దర్శకత్వంలో ఆయన హీరోగా ‘అంజామ్‌ తిరునాళ్‌ మార్తాండ వర్మ’ అనే సినిమా రూపొందనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో ఫర్హాద్‌ సామ్జీ దర్శకత్వంలో రూపొందిన ‘హౌస్‌ఫుల్‌ 4 సినిమాలో రానా ఓ కీ రోల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇలా అన్ని ఇండస్ట్రీల సినిమాలతో రానా ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. ఇలా అన్ని భాషల దర్శకులు రానాని రౌండప్‌ చేస్తున్నారు. అన్నట్లు రానా పరభాషల్లో నటిస్తున్న చిత్రాల్లో ఏకకాలంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్నవి ఉన్నాయి. ఆ రకంగా ఆ దర్శకులు మన భాషకు వస్తున్నట్లే కదా.

కోలీ అసోసియేట్‌.. టాలీలో డైరెక్టర్‌
ఈ ఏడాది జూలైలో విడుదలైన ‘పంతం’ సినిమాతో పాతిక చిత్రాలను కంప్లీట్‌ చేశారు గోపీచంద్‌. ఇప్పుడాయన నెక్ట్స్‌ సినిమాను బిన్ను సుబ్రహ్మణ్యం అనే కొత్త తమిళ దర్శకుడు తెరకెక్కించనున్నారని సమాచారం. కోలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు మోహన్‌రాజా (‘తని ఒరువన్‌’ మూవీ ఫేమ్‌) దగ్గర అసోసియేట్‌గా వర్క్‌ చేశారట బిన్ను సుబ్రహ్మణ్యం. దర్శకుడిగా తొలి అడుగుని తెలుగులో వేయనున్నారన్న మాట.

తెలుగులో ముద్ర కోసం...
 స్టెప్‌ బై స్టెప్‌ కెరీర్‌లో ఎదుగుతున్నారు హీరో నిఖిల్‌. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ముద్ర’. తమిళంలో రూపొందిన ‘కణిదన్‌’ చిత్రానికిది రీమేక్‌. ఒరిజినల్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన సంతోష్‌ ఈ సినిమాతోనే టాలీవుడ్‌ కి హాయ్‌ చెప్పనున్నారు. తెలుగులో తనదైన ముద్ర వేసుకోవడానికి కృషి చేస్తున్నారు. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానుంది.

ఆల్రెడీ వచ్చేశారహో
గతంలో పలువురు పరభాషల దర్శకులు తెలుగు తెరపై సినిమా చూపించారు. కె. బాలచందర్, పి. వాసు, సురేష్‌కృష్ణ, ఉదయ్‌కుమార్, కె.యస్‌. రవికుమార్, కరుణాకరన్, రాధామోహన్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, వంటి దర్శకులు తెలుగులో సినిమాలు తెరకెక్కించారు. ఆ తర్వాత మురుగదాస్, రీసెంట్‌ టైమ్స్‌లో ‘ఇష్క్, మనం, 24’ సినిమాలతో విక్రమ్‌ కె.కుమార్‌ టాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇక ‘పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి, గీతగోవిందం’ సినిమాల తర్వాత విజయ్‌ దేవరకొండ క్రేజీ స్టార్‌ అయ్యారు.


రానా, విజయ్‌ దేవరకొండ, నిఖిల్‌, ఎన్టీఆర్‌

  దీంతో కోలీవుడ్‌ నుంచి కబురొచ్చింది విజయ్‌కి. తమిళ దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా ‘నోటా’ చిత్రం రూపొందింది. ఈ సినిమాకు కాస్త ప్రతికూల ఫలితాలు వచ్చాయనే టాక్‌ కూడా వినిపించినప్పటీకీ ఆ వెంటనే ‘టాక్సీవాలా’ సక్సెస్‌తో మళ్లీ హిట్‌ ట్రాక్‌లోకి వచ్చారు విజయ్‌. ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక టాలీవుడ్‌లో సమంతకు ఎంత పాపులారిటీ ఉందో కోలీవుడ్‌లోనూ దాదాపు అంతే ఉంది. ఈ ఏడాది ఆమె ‘యు–టర్న్‌’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ద్వారా పవన్‌ కుమార్‌ అనే కన్నడ దర్శకుడు టాలీవుడ్‌కి వచ్చారు. కన్నడ ‘యు–టర్న్‌’ను సేమ్‌ టైటిల్‌తో తమిళం, తెలుగు భాషల్లో రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే.

‘హమ్‌తుమ్, ఫనా, ఫిర్‌ సే’ వంటి సినిమాలతో బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్నారు దర్శకుడు కునాల్‌ కోహ్లీ. ప్రజెంట్‌ థియేటర్స్‌లో ఆడుతున్న ‘నెక్ట్స్‌ ఏంటి’ సినిమాకు ఆయనే దర్శకుడు. ఇలా మరికొంతమంది పరభాష దర్శకులు తెలుగులో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారని టాక్‌. తెలుగు ఇండస్ట్రీది విశాల హృదయం. ఎవరు వచ్చినా అవకాశం ఇచ్చేస్తుంది. అందుకనే మన భాషలో పరభాషల హీరోయిన్లు, విలన్లు, ఇప్పుడు దర్శకుల జోరు కూడా మొదలైంది. కొందరు ఏకకాలంలో ద్విభాషా చిత్రాలు చేస్తూ.. ఆ విధంగా సొంత భాషకు దగ్గరగా ఉంటూనే పరభాషకు కూడా దగ్గరవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement