నా మాడ్యులేషన్ అందరికీ తెగ నచ్చేసింది
తోటపల్లి మధు
‘చిత్రం భళారే విచిత్రం’లో ‘నీ ఎంకమ్మా...’ అనే డైలాగ్ గుర్తుంది కదూ. అసలు మరచిపోతేనే కదా. ‘కలికాలం’లో గుండెను కరిగించే డైలాగులు, ‘అల్లరి అల్లుడు’లో కవ్వించే డైలాగులు, ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం’లో కరుణారసభరిత డైలాగులు... ఇలా ఏదైనా రాయగల దమ్మున్న డైలాగ్ రైటర్ తోటపల్లి మధు. ఒక మూమెంట్‌లో అయితే... ఆయన డైలాగులు రాస్తున్నాడంటే ఆ సినిమా సగం హిట్ కిందే లెక్కగా భావించేవారు. రచయితగా ఒక వైభవం చూసిన తోటపల్లి మధు సడన్‌గా సైలైంటైపోయి, లేటెస్ట్‌గా ‘సినిమా చూపిస్త మావా’తో నటుడిగా పెద్ద హిట్టు కొట్టారు.
అప్పట్లో కొన్ని సినిమాల్లో విలన్‌గా నటించిన ఆయన, ‘సినిమా చూపిస్త మావ’లో హీరో రాజ్‌తరుణ్ తండ్రి పాత్రలో గమ్మత్తై నటన కనబరిచారు. ‘‘రచయితగా ఎన్నెన్నో ప్రశంసలందుకున్నాను. కానీ నటుడిగా ఈ ఒక్క పాత్ర ఇస్తున్న కిక్ ఎప్పటికీ మరిచిపోలేను. దాసరి-చిరంజీవి లాంటి మహామహులు సైతం నా నటనను అభినందించారు. ముఖ్యంగా నా మాడ్యులేషన్ అందరికీ విపరీతంగా నచ్చేసింది. నాకు చాలా మంచి మంచి పాత్రలు వస్తున్నాయి. నాకు సరైన టైమ్‌లో సరైన హిట్ వచ్చింది’’ అని తెగ సంబరపడిపోయారు తోటపల్లి మధు. సినిమాలు, పుస్తకాలే ప్రపంచంగా బతికే మధు, బయట సినిమా ఫంక్షన్స్‌లో పెద్దగా కనబడరు. ఆయనది థర్టీ ఇయర్స్ లాంగ్ కెరీర్. 19 ఏళ్ల వయసులోనే పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన, 189 చిత్రాలకు రచన చేశారు. ‘‘ ‘మహారథి’ సినిమా తర్వాత మళ్లీ రచన వైపు దృష్టి పెట్టలేదు. ఇకపై నటుడిగా పూర్తి స్థాయిలో కొనసాగుదామని నిర్ణయించుకున్నా. కామెడీ, సెంటిమెంట్, విలనీ ఏదైనా చేయగలననే నమ్మకం ఉంది. రచయితగా నన్ను నెత్తిన పెట్టుకున్న ఈ పరిశ్రమే నటుడిగా కూడా నన్ను కొత్త అంతస్తుకు చేరుస్తుందని నమ్ముతున్నా’’ అని ఎంతో ఉత్సాహంగా చెప్పారు తోటపల్లి మధు.