బిగ్‌స్క్రీన్‌కు short cut
అచ్చమైన పల్లెటూరి కుర్రాడిలా ప్రేక్షకుల్ని మెప్పించిన ఉయ్యాల జంపాల హీరో రాజ్‌తరుణ్‌ను వెండితెరకు ఎక్కించింది షార్ట్ సినిమానే. ప్రస్తుతం మధురం అనే తెలుగు సినిమా ద్వారా పరిచయం కానున్నషార్ట్ మూవీస్ స్టార్ చాందినీచౌదరి యూట్యూబ్ ప్రేక్షకులకు చిరపరిచితురాలే. యూట్యూబ్‌లో 4 లక్షలకు పైగా హిట్స్ సాధించిన ‘దేవుడు చేసిన యెదవలు’షార్ట్ ఫిల్మ్‌లో నటించిన అశోక్ వర్ధన్ ‘కిరాకు’తో కమెడియన్‌గా మారాడు. ఆ సినిమాలో హీరోగా నటించిన అనిరుధ్ కూడా షార్ట్‌ఫిల్మ్ స్టారే...
సూపర్‌హిట్ అయిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ దర్శకుడు మేర్లపాక గాంధీ హైదరాబాద్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో గెలిచిన ‘ఖర్మరా దేవుడా’ హిట్‌తో సినిమాలకు ఎగబాకాడు. ఇంటర్వ్యూ, లవ్‌ఫార్ములా, తూర్పు పడమర వంటి లఘు చిత్రాలు రూపొందించిన పవన్ సాదినేని ‘ప్రేమ ఇష్క్
కాదల్’తో టాలీవుడ్ దర్శకుడిగా మారాడు. బస్‌స్టాప్‌లో నటిం చిన డీఎంకే కూడా షార్ట్ ఫిల్మ్ నటుడే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా పెద్ద చాంతాడే అవుతుంది. ఈ నేపధ్యంలో యువత షార్ట్ ఫిల్మ్స్‌నే రాచబాటగా మార్చుకోవడం విచిత్రమేమీ కాదు. సినిమా చాన్సులు రావాలంటే మాటలు కాదు. కాళ్లూ, ఒళ్లూ హూనమయ్యేలా తిరిగినా మన ముఖం చూసే నాధుడుండడు. మరి దీనికి పరిష్కారం...‘‘ఛత్ ఇవన్నీ ఎందుకురా భయ్... తిన్నగా ఓ షార్ట్ ఫిల్మ్ తీసేసెయ్’’ అనేది నేటి యువ మంత్రం. ఆ మంత్రాన్నే నమ్ముకున్న యువ ప్రతిభావంతులు తామేంటో పొట్టి చిత్రాలతో చూపిస్తూ...టాలీవుడ్‌నే తమ దగ్గరకు రప్పించుకుంటున్నారు. నిదానంగానే మొదలైనా... ఈ ట్రెండ్ స్వల్పకాలంలోనే ఊపందుకుంది. ప్రస్తుతం షార్ట్ ఫిల్మ్‌ల వెల్లువ చూస్తుంటే సినీ పరిశ్రమ చిట్టి సినిమాను పట్టించుకోకుండా ఉండే పరిస్థితి లేనట్టే కనపడుతోంది.
ఔత్సాహికుల వర్క్‌షాప్‌లు
లఘు చిత్రాల రూపకల్పనకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని కొనసాగిస్తూ ‘తెలుగువన్.కామ్’ వర్‌కషాప్‌లు నిర్వహిస్తోంది. ప్రతి నెలా రెండు వర్క్‌షాప్‌లు జరుగుతాయి. నెలకు ఒకటి చొప్పున ఇప్పటికి ఐదింటిని ఉత్తమ చిత్రాలుగా ఎంపిక చేసి, రూ.10 వేలు చొప్పున నగదు బహుమతిని అందించింది. అంతే కాదు... ఈ కాంటెస్ట్‌లో ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి రూ.లక్ష బహుమతి ఇస్తోంది. ‘పొట్టి చిత్రాలకు కేవలం పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే కాకుండా... ప్రీ ప్రొడక్షన్‌కు సైతం ఔత్సాహికులకు వేదిక కల్పిస్తున్నాం. వివరాలకు మా వెబ్‌సైట్‌లోగానీ, యూట్యూబ్ ద్వారా గానీ సంప్రదించవచ్చు’ అని తెలుగువన్.కామ్ ఎండీ ఎస్.రవిశేఖర్ చెప్పారు. మరిన్ని వివరాలకు ఫోన్: 040 23757192.