
మాయ దర్శకుడితో ఎస్‌జే.సూర్య
నేటి టాప్ మోస్ట్ హీరోయిన్ నయనతారకు తొలి విజయాన్ని అందించిన లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం మాయ. హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం 2015లో విడుదలై భారీ వసూళ్లను సాధించింది.ఈ చిత్రం ద్వారా పరిచయమైన దర్శకుడు అశ్విన్ శరవణన్. ఈయన తదుపరి చిత్రం గురించి చాలా రకాల వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే అవేవి నిజం కాలేదు. తాజాగా ఎస్‌జే.సూర్యను తన తాజా చిత్రానికి కథానాయకుడిగా ఎన్నుకున్నారు. ఆయనకు జంటగా నటి శివద నటించనున్నారు.
మాయ చిత్రానికి హారర్ నేపథ్యాన్ని ఎంచుకుని సక్సెస్ అయిన దర్శకుడు అశ్విన్ శరవణన్ తన తాజా చిత్రానికి ప్రేమ కథను తయారు చేసుకున్నారట. అందులోనూ తనదైన స్టైల్‌లో థ్రిల్లర్ అంశాలను జోడించి థ్రిల్లర్ ప్రేమ కథా చిత్రంగా దీన్ని తీర్చిదిద్దనున్నారని సమాచారం. మాయ చిత్రానికి సంగీతాన్ని అందించిన యోహన్‌నే ఈ చిత్రానికి బాణీలు అందించనున్నారు. ఈ చిత్ర పూర్తి వివరాలను దర్శకుడు ఏప్రిల్ 14వ తేదీన వెల్లడించనున్నట్లు తెలిసింది. ఎస్‌జే.సూర్య ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో నెంజం మరప్పదిల్‌లై చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.