శిరీష్ అలా చెప్పగానే సెలైంట్ అయ్యా!
‘‘శిరీష్ ఆలోచనా విధానం, నడవడిక, ప్రవర్తన చూసి మంచి వ్యాపారవేత్త అవుతాడనుకున్నా. ఏ సినిమా ఎంత వసూళ్లు చేసింది? ఏది ఎందుకు చేయలేదు? అని రివ్యూ చేస్తుంటే మంచి నిర్మాత అవుతాడనుకున్నా. వాళ్ల నాన్నగారికి బాసటగా ఉంటూ గీతా ఆర్ట్స్ బాధ్యతలు తీసుకుంటాడనుకున్నా. ఓ రోజు నాదగ్గరకొచ్చి ‘మావయ్యా.. నేను ఆర్టిస్ట్ అవుతాను’ అన్నాడు. ఒక్కసారిగా సెలైంట్ అయ్యా. ఇంతమంది ఆర్టిస్టులున్న కుటుంబంలో పుట్టి, నటుడు అయ్యే అన్ని అర్హతలున్న వాడు ఆర్టిస్ట్ అవుతానన్నాడు కాబట్టి మనస్ఫూర్తిగా వెల్‌కమ్ చెప్పా’’ అని చిరంజీవి అన్నారు. అల్లు శిరీష్, లావణ్యా త్రిపాఠి జంటగా పరశురామ్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ- ‘‘ఈ టైటిల్‌కు నేను బాగా కనెక్ట్ అయ్యా. ఎందుకంటే నేను, సరిత జంటగా కట్టా సుబ్బారావుగారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రం 1980వ దశకంలో విడుదలై మంచి విజయం అందుకుంది. నాకు ఎక్కువ సినిమాలు ఇచ్చి, విజయవంతమైన చిత్రాలు తీసిన అల్లు అరవింద్ వంటి నిర్మాత నాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. పరశురామ్ ఈ చిత్రాన్ని సున్నితంగా హ్యాండిల్ చేశాడు.
ఫస్ట్ కాపీ చూస్తుంటే నాకు ‘బొమ్మరిల్లు’ సినిమా గుర్తొస్తోంది. తమన్ మంచి ట్యూన్స్ చేసుకో.. బావుంటే నా 151వ చిత్రానికి పనిచేసే అవకాశం ఇస్తా’’ చెప్పారు. ‘‘నిన్న ‘సరైనోడు’, నేడు ‘శ్రీరస్తు శుభమస్తు’, రేపు ‘ధ్రువ’ ఘనవిజయం సాధిస్తాయి. పరశురామ్ ఆర్నెల్లు స్క్రిప్ట్ వర్క్ చేసి తొమ్మిది నెలలు షూటింగ్ చేశాడు. అన్ని వర్గాల వారికీ మా చిత్రం నచ్చుతుంది’’ అని అల్లు అరవింద్ పేర్కొన్నారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ -‘‘చిరంజీవిగారు నాకు రోల్‌మోడల్. ఏ ఇంట్లో ఆడవాళ్లు గౌరవింపబడతారో.. ఆ ఇంట్లో దేవతలు కొలువు తీరతారనే పాయింట్‌ను ఎంటర్‌టైనింగ్‌గా చెప్పాం’’ అని చెప్పారు. చిత్రదర్శకుడు పరశురాం, నిర్మాతలు ‘జెమినీ’ కిరణ్, డా.వెంకటేశ్వరరావు, దర్శకులు బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి, హీరోయిన్ లావణ్యా త్రిపాఠి, సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ తమన్, కెమెరామ్యాన్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.