‘‘నిఖిల్ సినిమాలు గతంలో ఒకటి, రెండు చూశా. కానీ, కలిసే సందర్భం రాలేదు. ‘అర్జున్ సురవరం’ప్రీమియర్ షోలో నన్ను చూడగానే తను ఎగై్జట్ అయిన విధానం చూస్తే నాకు మరో తమ్ముడు, శిష్యుడు దొరికాడని సంతోషం కలిగింది. ప్రేమించే మనుషులు దొరకడం బ్యాంక్ బ్యాలెన్స్‌గా భావిస్తా. నిఖిల్ వల్ల నా బ్యాంక్ బ్యాలెన్స్ మరింత పెరిగిందనుకుంటున్నా’’ అని చిరంజీవి అన్నారు. నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి. సంతోష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. మంగళవారం నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఈ ఫంక్షన్‌కి నేను రావడం చాలామందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. నేను బిజీగా ఉంటాను కాబట్టి నన్ను ఫంక్షన్‌కి రమ్మని ‘ఠాగూర్’ మధు ఇబ్బంది పెట్టరు. మరి ఎవరి ప్రభావంతో, ఎవరి ప్రమేయంతో వచ్చానన్నది చాలా మందికి అనుమానం ఉండొచ్చు.
నిజం చెప్పాలంటే ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన తర్వాత నేనే రావాలనుకున్నా. ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని వచ్చా. నిర్మాత రాజ్‌కుమార్ మరొక ప్రధానమైన కారణం. ఎక్కడైనా పైరసీ జరుగుతుంటే సైబర్ పోలీసుల్లా వెళ్లి తనకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో దాన్ని పూర్తీగా ధ్వంసం చేసి, ఇండస్ట్రీకి గొప్ప సహాయం చేస్తున్నాడు. తను సినిమా తీస్తున్నాడనే విషయం, తన వెనక ‘ఠాగూర్’ మధు ఉన్నాడనే విషయం నాకు తెలియదు. ఓ రోజు వచ్చి సినిమా తీశాననగానే ఆశ్చర్యంగా అనిపించింది.. ప్రివ్యూ చూశాక ఫంక్షన్‌కి పిలుస్తారేమో అనుకుంటే పిలవలేదు. నన్ను పిలవడానికి కూడా తనకి మొహమాటం. ఈ సినిమా గురించి ప్రజలకు చెప్పాలి, వాళ్ల దగ్గరకు తీసుకెళ్లాలంటే నన్ను ఉపయోగించుకోండి అన్నాను.. అయినా కూడా ఇబ్బంది పడ్డాడు (నవ్వుతూ). సంతోష్ తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగు సినిమా చేశాడు. కథ బాగుంటే భాషతో సంబంధం లేదు.. ఎవరైనా ఆదరిస్తారు.
లవర్‌బాయ్‌గా ఉండే నిఖిల్ ఈ సినిమాతో యాక్షన్ హీరోగా మారాడనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా ఇది. ఎందుకంటే కంటెంట్‌తో కనెక్ట్ అవుతారు. స్మార్ట్ ఫోన్స్ వాడుతున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పే చిత్రమిది. మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువత చూడాలి. ఇప్పటి వరకూ ఏ ఫంక్షన్‌కైనా నన్ను పిలిస్తే వెళ్లాను. కానీ, ‘అర్జున్ సురవరం’ సినిమాకి ఫంక్షన్ పెట్టుకోండి, ముఖ్య అతిథిగా వస్తానని చెప్పి మరీ పెట్టించుకున్నా (నవ్వుతూ). లావణ్యా త్రిపాఠి నవ్వంటే నాకు ఇష్టం. ఆ సొట్ట బుగ్గలు భలే ఉంటాయి. ఇలాంటి మంచి సినిమాల ఫంక్షన్స్‌కి నేనున్నాను అంటూ ముందుకొచ్చే నా సోదరుడు తలసానిగారికి అభినందనలు. ఈ సినిమాలోని ‘చేగువేరా..’ పాట చూస్తున్నప్పుడు నా తమ్ముడు పవన్ కల్యాణ్ గుర్తొచ్చాడు’’ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ – ‘‘ఇదొక మంచి కథ. తప్పకుండా ప్రేక్షకులు మంచి చిత్రాన్ని ఆదరించి హిట్ చేయాలి.
‘బాహుబలి, సైరా నరసింహారెడ్డి’ లాంటి సినిమాలు ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమ సత్తా చాటాయి. చిరంజీవిగారు టీవీ సీరియల్స్, సినిమా ఫంక్షన్స్‌తో పాటు ఇలాంటి చిన్న సినిమాల వేడుకలకు రావడం చాలా సంతోషం. ఆయన రావడం వల్ల చిన్న సినిమాల స్టామినా పెరిగి జనాల్లో క్రేజ్ వస్తుంది.. అందుకే ఆయన ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అంటున్నాను’’ అన్నారు. నిఖిల్ మాట్లాడుతూ– ‘‘ఇది నిజమో, కలో అర్థం కావడం లేదు. లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా, మెగాస్టార్ చిరంజీవిగారు మా ఫంక్షన్‌కి వస్తారంటే నమ్మలేకపోయాను.. కానీ ఆయన వచ్చారు.. వేదికపై ఉన్నారు.
మా సినిమాకి చాలా అడ్డకుంలు వచ్చాయి. ఆ దేవుడు రూపంలో చిరంజీవిగారు వచ్చారు. మా సినిమా చూసిన ఆయన నన్ను హత్తుకున్న రోజును ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల మాట్లాడుతూ– ‘‘నేను ఓ సినిమా నిర్మించడం, ఆ ఫంక్షన్‌కి చిరంజీవిగారు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ‘ఛాలెంజ్’ సినిమా స్ఫూర్తి నన్ను ఈ రోజు వరకూ ముందుకు నడిపిస్తోంది’’ అన్నారు. ‘‘మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి వచ్చిన చిరంజీవిగారికి, ఆయన అభిమానులకు థ్యాంక్స్. తెలుగులో నా తొలి చిత్రమిది’’ అన్నారు టి.సంతోష్. ‘‘ఈ ఏడాది విడుదలవుతున్న నా మొదటి తెలుగు సినిమా ఇది.. రిలీజ్ కోసం ఎగై్జటెడ్‌గా ఉన్నా’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. దర్శకులు మారుతి, చందూ మొండేటి, నటుడు రాజా రవీంద్ర, కెమెరామేన్ సూర్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment