ఏడాది అయిపోయింది దీపికా పదుకోన్ మేకప్ వేసుకుని సిల్వర్‌స్క్రీన్ మీద కనిపించి. తన నెక్ట్స్ సినిమా ఏంటో అఫీషియల్‌గా అనౌన్స్ చేశారామె. యాసిడ్ అటాక్ బాధితురాలిగా దీపిక ఓ సినిమాలో నటించబోతున్నారన్న సంగతి తెలిసిందే. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో లక్ష్మీ అగర్వాల్ అనే యాసిడ్ అటాక్ బాధితురాలి పాత్రలో కనిపించనున్నానని దీపిక అధికారికంగా పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌తో కలసి ఆమె నిర్మిస్తుండటం విశేషం. ‘మిర్జాపూర్’ వెబ్‌సిరీస్‌తో మంచి పేరు సంపాదించుకున్న విక్రాంత్ మాస్సే ఇందులో దీపికా సరసన యాక్ట్ చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ చిత్రానికి ‘చప్పాక్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ‘‘గాయం.. అద్వితీయమైన పోరాట పటిమ.. విజయ గేయం.. గాయం, విజయం చుట్టూ సాగే కథ ఇది. ఫాక్స్ స్టార్ స్టూడియోతో కలసి పని చేయడం ఆనందంగా ఉంది’’ అని ట్వీట్ చేశారు దీపికా పదుకోన్.
Comments
Please login to add a commentAdd a comment