
శ్రీవిష్ణు, నివేతా పెతురాజ్ జంటగా డి. సురేశ్‌బాబు సమర్పణలో రాజ్ కందుకూరి నిర్మించిన సినిమా ‘మెంటల్ మదిలో’. వివేక్ ఆత్రేయ దర్శకుడు. ఈ నెల 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్, పాటల వేడుక నిర్వహించారు. ఆడియో సీడీలను సురేశ్‌బాబు–విజయ్ దేవరకొండ, ట్రైలర్‌ను నారా రోహిత్ విడుదల చేశారు. ‘‘సినిమా చూసి బాగా ఏంజాయ్ చేశా. శ్రీవిష్ణు బాగా నటించాడు. నా సిన్మా కూడా ఈ 24నే విడుదలవుతోంది. రెండూ బాగా ఆడి నిర్మాతలకు డబ్బులు తీసుకురావాలి. పోటీగా అనుకోవడం లేదు’’ అన్నారు నారా రోహిత్. ‘‘ప్రీమియర్ షోలు చూసిన వాళ్లంతా సినిమా బాగుందంటున్నారు. పరీక్ష రాశాం. ప్రేక్షకుల రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం.
సురేశ్‌బాబుగారు కొండంత అండ. నన్ను, నా టీమ్‌ని నమ్మి మరొక్క అవకాశం ఇచ్చిన ఆయనకి థ్యాంక్స్. తరుణ్ భాస్కర్ (‘పెళ్లి చూపులు’ దర్శకుడు) తర్వాత వివేక్‌ను మా బ్యానర్‌లో పరిచయం చేయడం ఆనందంగా ఉంది. శ్రీ విష్ణు బాగా నటించాడు’’ అన్నారు రాజ్ కందుకూరి. ‘‘లైప్ ఈజ్ బ్యూటీఫుల్’లో నేను, శ్రీ విష్ణు చిన్న పాత్రల్లో నటించాం. తన సినిమాలు బాగుంటాయని వింటూనే ఉన్నాను. ఈ సినిమా పెద్ద హిట్టవుతుంది’’ అన్నారు విజయ్ దేవరకొండ. ‘‘విశ్వనాథ్‌గారి కథను తీసుకుని, ఆ కథకు జంధ్యాలగారు మాటలు రాసి చిన్న బడ్జెట్‌తో మణిరత్నంగారు డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అంత హాయిగా ఉంటుందీ సిన్మా. ఇది నా పర్సనల్ ఫీలింగ్’’ అన్నారు శ్రీవిష్ణు. ఈ వేడుకలో దర్శక–నటుడు అవసరాల శ్రీనివాస్, నిర్మాత ‘మధుర’ శ్రీధర్, ప్రశాంత్ విహరి, ‘కళామందిర్’ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment