
లీలావతికి ఏం జరిగింది?
సినిమా తీయాలని వైజాగ్‌కు వచ్చిన ఓ అమ్మాయి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తీసుకుని, వాణిజ్య అంశాలు జోడించి ఈ సినిమా తీశాం.
‘‘సినిమా తీయాలని వైజాగ్‌కు వచ్చిన ఓ అమ్మాయి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తీసుకుని, వాణిజ్య అంశాలు జోడించి ఈ సినిమా తీశాం. హుద్ హుద్ తుఫాన్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. లీలావతికి ఏం జరిగింది? అనేది సినిమాలో చూడాల్సిందే’’ అని పి. సునీల్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన దర్శకత్వంలో కీ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రావ్య ఫిలింస్ పతాకంపై యెక్కలి రవీంద్రబాబు నిర్మించిన ‘మిస్ లీలావతి’ వచ్చే వారం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘గ్లోబల్ వార్మింగ్ వల్ల భవిష్యత్తులో హుద్ హుద్ వంటి పరిణామాలు బోల్డన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలాగే, అక్రమ సంబంధాల కారణంగా భవిష్యత్తులో మానవ సంబంధాల్లో ఎలాంటి విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటాయో ఈ చిత్రంలో చర్చించాం. అనుబంధాలు సవ్యంగా ఉన్నంతవరకూ బాగానే ఉంటుందనీ, దారి తప్పితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పే చిత్రం ఇది’’ అన్నారు. అసభ్యతకు తావు లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిదనీ, మంచి కథాంశంతో రూపొందించిన ఈ చిత్రంలో చక్కని సందేశం ఉందనీ నిర్మాత రవీంద్రబాబు చెప్పారు. అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత బాపిరాజు అన్నారు. సంగీతదర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి, ఎడిటర్ శివ కూడా మాట్లాడారు.