
దశ.. దిశ.. సినిమానే!
‘‘చిన్నప్పట్నుంచీ నటన, సినిమాలు ఇవే లోకం. కమల్‌హాసన్, చిరంజీవి అంటే చాలా ఇష్టం. వాళ్లను చూసి హీరో అయిపోదామని డిసైడైపోయా. సినీ పరిశ్రమలోకి వచ్చి ఆరేళ్లయింది. ఎన్ని కష్టాలెదురైనా ఇష్టం మాత్రం పోలేదు. అయినా ముందుకు సాగుతున్నా’’ అని హీరో సురేశ్ అన్నారు. ఇటీవల విడుదలైన ‘మిస్ లీలావతి’తో హీరోగా తనకు మంచి గుర్తింపు వచ్చిందని సురేశ్ చెబుతూ - ‘‘మాది నెల్లూరు.
నా చదువంతా అక్కడే సాగింది. మా నాన్నగారికి నటన అంటే ఇష్టం. దాంతో నాక్కూడా ఆసక్తి ఏర్పడింది. క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా. నృత్య ప్రదర్శన లు కూడా ఇచ్చాను. బీటెక్ పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చి స్టూడియోలు, ఆఫీసులు చుట్టూ తిరిగాను. కొన్ని సినిమాలకు సహాయ దర్శకునిగా చేశా. ఆ తర్వాత ‘అలజడి’ చిత్రంలో హీరో పాత్ర కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి, వెళ్లాను. నా తొలి ఆడిషన్స్‌లో సక్సెస్ అయ్యి, ఆ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాను.
అనంతరం తారకరత్న హీరోగా చేసిన ‘ఎదురులేని అలెగ్జాండర్’లో ఓ కీలక పాత్ర పోషించా. ‘మిస్ లీలావతి’ తర్వాత అవకాశాలు పెరిగాయి. కథకు తగ్గ పాత్ర అయితే విలన్ పాత్రలు చేయడానికి కూడా రెడీ. పరిపూర్ణమైన నటుడు అనిపించుకోవా లన్నదే నా ఆశయం’’ అని అన్నారు. ప్రతిభకు తగ్గ అవకాశాలు వస్తే మరో మంచి యువ హీరో లభించినట్లే!