Miss Leelavathi
-
దశ.. దిశ.. సినిమానే!
‘‘చిన్నప్పట్నుంచీ నటన, సినిమాలు ఇవే లోకం. కమల్‌హాసన్, చిరంజీవి అంటే చాలా ఇష్టం. వాళ్లను చూసి హీరో అయిపోదామని డిసైడైపోయా. సినీ పరిశ్రమలోకి వచ్చి ఆరేళ్లయింది. ఎన్ని కష్టాలెదురైనా ఇష్టం మాత్రం పోలేదు. అయినా ముందుకు సాగుతున్నా’’ అని హీరో సురేశ్ అన్నారు. ఇటీవల విడుదలైన ‘మిస్ లీలావతి’తో హీరోగా తనకు మంచి గుర్తింపు వచ్చిందని సురేశ్ చెబుతూ - ‘‘మాది నెల్లూరు. నా చదువంతా అక్కడే సాగింది. మా నాన్నగారికి నటన అంటే ఇష్టం. దాంతో నాక్కూడా ఆసక్తి ఏర్పడింది. క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా. నృత్య ప్రదర్శన లు కూడా ఇచ్చాను. బీటెక్ పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చి స్టూడియోలు, ఆఫీసులు చుట్టూ తిరిగాను. కొన్ని సినిమాలకు సహాయ దర్శకునిగా చేశా. ఆ తర్వాత ‘అలజడి’ చిత్రంలో హీరో పాత్ర కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి, వెళ్లాను. నా తొలి ఆడిషన్స్‌లో సక్సెస్ అయ్యి, ఆ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాను. అనంతరం తారకరత్న హీరోగా చేసిన ‘ఎదురులేని అలెగ్జాండర్’లో ఓ కీలక పాత్ర పోషించా. ‘మిస్ లీలావతి’ తర్వాత అవకాశాలు పెరిగాయి. కథకు తగ్గ పాత్ర అయితే విలన్ పాత్రలు చేయడానికి కూడా రెడీ. పరిపూర్ణమైన నటుడు అనిపించుకోవా లన్నదే నా ఆశయం’’ అని అన్నారు. ప్రతిభకు తగ్గ అవకాశాలు వస్తే మరో మంచి యువ హీరో లభించినట్లే! -
డోన్ట్ మిస్ లీలావతి!
-
ఇవన్నీ సమాజంలో జరుగుతున్నవే!
అక్రమ సంబంధాలు మానవ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తాయనే కథాంశంతో దర్శకుడు పి. సునీల్‌కుమార్ రెడ్డి తీసిన చిత్రం ‘మిస్ లీలావతి’. కార్తీక్, లీలావతి ముఖ్య తారలుగా కీ ప్రొడక్షన్స్, శ్రావ్య ఫిలింస్‌పై యెక్కలి రవీంద్రబాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. సునీల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ -‘‘వైజాగ్‌లో పోలీస్‌గా చేస్తున్న నా స్నేహితుడు, ‘అక్రమ సంబంధాల వల్ల ఎన్నో జీవితాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి... ఆ పాయింట్ మీద సినిమా తీస్తే బాగుంటుంది’ అన్నాడు. అందుకే ఈ సినిమా చేశా. సమాజంలో జరుగుతున్నవే నా సినిమాల్లో చూపిస్తున్నా. విమర్శలు, ప్రశంసలూ రెండూ వస్తున్నాయి. మంచి సందేశం ఉన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు. అసభ్యతకు తావు లేకుండా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారని నిర్మాత చెప్పారు. సునీల్‌కుమార్ రెడ్డి ఏ సినిమా చేసినా మంచి సందేశం ఉంటుందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత బాపిరాజు అన్నారు. పాటలు మాత్రమే కాదు, రీ-రికార్డింగ్ కూడా అద్భుతంగా కుదిరిందని సంగీతదర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి చెప్పారు. ఛాయాగ్రాహకుడు ఎస్.వి. శివరాం, నటులు కార్తీక్, మహేశ్ కూడా మాట్లాడారు. -
'మిస్ లీలావతి' స్టిల్స్
-
ప్రణయం ప్రళయమైతే...
ఎన్నో యుద్ధాలు, ప్రళయాలు మనిషి వల్లే ఇప్పటిదాకా సంభవించాయి. స్త్రీ, పురుష సంబంధాలకు ఇదే వర్తిస్తుందన్న కథాంశంతో హుద్‌హుద్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మిస్ లీలావతి’. కార్తీక్, లీలావతి, మహేశ్ ముఖ్యతారలుగా శ్రావ్య ఫిలింస్ పతాక ంపై యెక్కలి రవీంద్రబాబు నిర్మించిన ఈ చిత్రానికి పి. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ -‘‘సెన్సార్ పూర్తయింది. ప్రేమకథ నేపథ్యంలో సాగే ఈ చిత్రం మాస్‌ని, క్లాస్‌ని ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి. బాపిరాజు, సహనిర్మాతలు: కుర్రా విజయ్‌కుమార్, శాంతయ్య. -
లీలావతికి ఏం జరిగింది?
‘‘సినిమా తీయాలని వైజాగ్‌కు వచ్చిన ఓ అమ్మాయి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తీసుకుని, వాణిజ్య అంశాలు జోడించి ఈ సినిమా తీశాం. హుద్ హుద్ తుఫాన్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. లీలావతికి ఏం జరిగింది? అనేది సినిమాలో చూడాల్సిందే’’ అని పి. సునీల్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన దర్శకత్వంలో కీ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రావ్య ఫిలింస్ పతాకంపై యెక్కలి రవీంద్రబాబు నిర్మించిన ‘మిస్ లీలావతి’ వచ్చే వారం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘గ్లోబల్ వార్మింగ్ వల్ల భవిష్యత్తులో హుద్ హుద్ వంటి పరిణామాలు బోల్డన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే, అక్రమ సంబంధాల కారణంగా భవిష్యత్తులో మానవ సంబంధాల్లో ఎలాంటి విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటాయో ఈ చిత్రంలో చర్చించాం. అనుబంధాలు సవ్యంగా ఉన్నంతవరకూ బాగానే ఉంటుందనీ, దారి తప్పితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పే చిత్రం ఇది’’ అన్నారు. అసభ్యతకు తావు లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిదనీ, మంచి కథాంశంతో రూపొందించిన ఈ చిత్రంలో చక్కని సందేశం ఉందనీ నిర్మాత రవీంద్రబాబు చెప్పారు. అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత బాపిరాజు అన్నారు. సంగీతదర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి, ఎడిటర్ శివ కూడా మాట్లాడారు. -
లీలావతి కథేంటి?
హుద్ హుద్ రాకముందు, వచ్చిన తర్వాత పరిణామాలను ప్రధానాంశంగా చేసుకుని పి. సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్ లీలావతి’. కీ ప్రొడక్షన్స్ సమర్పణలో రాజాజీ ఎంటెర్టైన్మెంట్స్ సారథ్యంలో శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై యెక్కలి రవీంద్రబాబు నిర్మిస్తున్నారు. కార్తీక్, లీలావతి, మహేశ్, ఎఫ్.ఎమ్.బాబాయ్, దివ్య, గీత, మల్లిక, బుగతా సత్యనారాయణ, సముద్రం వెంకటే శ్ తదితరులు ముఖ్య తారలు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఒకసారి చరిత్రను తిరగేస్తే, ఎన్నో యుద్ధాలు, అధిక శాతం ప్రళయాలు.. ఇవి మనిషి తనకు తానుగా తెచ్చుకున్న ఉపద్రవాలే కానీ, సహజమైనవి కావు. స్త్రీ, పురుష సంబంధాల్లో ఇదే తరహా సూత్రం వర్తిస్తుందన్న కథాంశంతో రూపొందిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది’’ అని చెప్పారు. ఈ నెలలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, కెమెరా: శివరాం, ఎడిటర్: శివ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి. బాపిరాజు, సహనిర్మాతలు: కుర్రా విజయ్‌కుమార్, శాంతయ్య.