వాళ్లు కన్నీటితో ఉంటే మనం పన్నీరు జల్లుకుంటామా?
వాళ్లు కన్నీటితో ఉంటే మనం పన్నీరు జల్లుకుంటామా?
Published Sat, Sep 7 2013 10:50 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
‘‘రాష్ట్ర ప్రజలు సీమాంధ్ర, తెలంగాణ అంటూ ఒకరకమైన ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంటే మనం పండగ చేసుకోవడమా? ప్రేక్షక దేవుళ్ల వరంతో మనం ఆకాశంలో హరివిల్లులా వెలుగుతున్నాం. అంతగా అభిమానిస్తున్న వారు బాధలో ఉన్నప్పుడు మనం పండగ చేసుకుంటే చెడు సంకేతాలు వెళ్లవా’’ అని ప్రశ్నిస్తున్నారు డా. మోహన్‌బాబు. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యావత్ దక్షిణ భారత పరిశ్రమ చెన్నయ్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.
ఈ 21న ప్రారంభమయ్యే ఈ వేడుకలు 24 వరకూ జరుగుతాయి. ఈ వేడుకలను ఉద్దేశించే మోహన్‌బాబు ఈ ప్రశ్నలను సంధించారు. చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి ఈ వేడుకల విషయంలో పునరాలోచించాలని శనివారం ఓ ప్రకటనలో మోహన్‌బాబు అన్నారు. -‘‘నూరేళ్ల పండగను వైభవంగా జరపాలని అందరం నిర్ణయించుకున్నాం. దీనికి సంబంధించి రెండున్నర గంటలతో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రూపొందించాలనుకున్నాం. అయితే ఇది జూలై 30కి ముందు. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. తెలంగాణ, సీమాంధ్ర మన పరిశ్రమకు రెండు కళ్లులాంటివి.
ఈ ప్రజలు ఆవేదనలో ఉన్నప్పుడు మనం ఆడిపాడి సినిమా పండగ చేసుకోవడం ఎంతవరకు సబబు? ప్రజల మనోభావాలు దెబ్బ తినే ప్రమాదం ఉండదా? ప్రజలు కన్నీటితో ఉంటే మనం పన్నీరు జల్లుకుంటున్నామనే భావన వారికి కలగదా? అలాగని ఈ వేడుకల్లో మన తెలుగు పరిశ్రమవారు పాల్గొనకూడదని నేను అనను. కానీ ఈ వేడుకను వాయిదా వేస్తే బాగుంటుందని, చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. సినిమా నిజం. ప్రేక్షకులు నిజం. మిగతావన్నీ మధ్యలో పడి లేచే కెరటాలే’’ అన్నారు.
Advertisement