ఇదేంటి బాసూ! సూపర్ స్టార్ ప్రచారంపై దుమారం!
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎన్నికల ప్రచారంలో కనిపించడం కేరళను రాజకీయంగా కుదిపేస్తోంది. ఓ వామపక్ష పార్టీ అభ్యర్థి తరఫున మోహన్ లాల్ ఎన్నికల సభలో పాల్గొనడం కోలీవుడ్‌లో దుమారం రేపుతోంది. ఆయన తీరును ప్రశ్నిస్తూ కోలీవుడ్ మువీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఒకరు వైదొలుగగా.. ప్రముఖ మలయాళీ దర్శకుడు కూడా ఈ వివాదంలో తలదూర్చాడు.
కొల్లాంలోని పథానపురం నియోజక వర్గం నుంచి సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు వ్యక్తులు బరిలోకి దిగారు. వామపక్ష ఎల్డీఎఫ్ నుంచి నటుడు కేవీ గణేష్ కుమార్, కాంగ్రెస్ నుంచి హాస్య నటుడు జగదీశ్, బీజేపీ నుంచి ప్రముఖ విలన్ క్యారెక్టర్ ఆర్టిస్టు భీమన్ రఘు పోటీ పడుతున్నారు. గురువారం మోహన్‌లాల్ గణేశ్‌కుమార్ తరఫున ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన రాజకీయాలేవీ మాట్లాడలేదు. గణేష్ కుమార్‌కు ఓటు వేయమనీ అడుగలేదు. కేవలం పథానపురం నియోజకవర్గంతో తనకున్న అనుబంధాన్ని మాత్రమే ఈ ర్యాలీలో ప్రస్తావించారు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూడా గణేశ్ కుమార్ తరఫున ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.
తన స్నేహితుడైన గణేష్‌కుమార్ తరఫున మోహన్‌లాల్ ప్రచారం చేయడం పెద్ద దుమారమే రేపుతున్నది. మోహన్ లాల్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిబంధనల్ని ఉల్లంఘించారని, సినీ కళాకారులు ఎవరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని అసోసియేషన్ నోటిఫికేషన్ ఇచ్చిందని గణేష్‌కుమార్ ప్రత్యర్థి, కమెడియన్ జగదీశ్ మండిపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఆయన శుక్రవారం టీవీ ముందుకువచ్చి కంటతడి పెడుతూ.. గణేష్ కుమార్ బ్లాక్‌మెయిల్ చేసి మోహన్ లాల్‌ను తన ప్రచారానికి రప్పించుకున్నారని, ఇది సరికాదని ఆరోపించారు. కాగా, జగదీశ్‌కు మద్దతుగా మరో కమెడియన్ సలీంకుమార్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి తప్పుకున్నారు.
మరోవైపు మోహన్ లాల్‌పై జగదీశ్ చేసిన ఆరోపణల్ని దర్శకుడు ఉన్నికృష్ణన్ కొట్టిపారేశారు. ఆయనను ఎవరూ బ్లాక్ మెయిల్ చేయలేదని, జగదీశ్ చెత్త ఆరోపల్ని మానుకోవాలని చెప్పారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా నటులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధిస్తూ ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది.