Kerala election
-
రాష్ట్రాల హక్కులను మోడీ కాలరాస్తున్నారు: కేరళ సీఎం పినరయి విజయన్
-
ఇదేంటి బాసూ! సూపర్ స్టార్ ప్రచారంపై దుమారం!
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎన్నికల ప్రచారంలో కనిపించడం కేరళను రాజకీయంగా కుదిపేస్తోంది. ఓ వామపక్ష పార్టీ అభ్యర్థి తరఫున మోహన్ లాల్ ఎన్నికల సభలో పాల్గొనడం కోలీవుడ్‌లో దుమారం రేపుతోంది. ఆయన తీరును ప్రశ్నిస్తూ కోలీవుడ్ మువీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఒకరు వైదొలుగగా.. ప్రముఖ మలయాళీ దర్శకుడు కూడా ఈ వివాదంలో తలదూర్చాడు. కొల్లాంలోని పథానపురం నియోజక వర్గం నుంచి సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు వ్యక్తులు బరిలోకి దిగారు. వామపక్ష ఎల్డీఎఫ్ నుంచి నటుడు కేవీ గణేష్ కుమార్, కాంగ్రెస్ నుంచి హాస్య నటుడు జగదీశ్, బీజేపీ నుంచి ప్రముఖ విలన్ క్యారెక్టర్ ఆర్టిస్టు భీమన్ రఘు పోటీ పడుతున్నారు. గురువారం మోహన్‌లాల్ గణేశ్‌కుమార్ తరఫున ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన రాజకీయాలేవీ మాట్లాడలేదు. గణేష్ కుమార్‌కు ఓటు వేయమనీ అడుగలేదు. కేవలం పథానపురం నియోజకవర్గంతో తనకున్న అనుబంధాన్ని మాత్రమే ఈ ర్యాలీలో ప్రస్తావించారు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూడా గణేశ్ కుమార్ తరఫున ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. తన స్నేహితుడైన గణేష్‌కుమార్ తరఫున మోహన్‌లాల్ ప్రచారం చేయడం పెద్ద దుమారమే రేపుతున్నది. మోహన్ లాల్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిబంధనల్ని ఉల్లంఘించారని, సినీ కళాకారులు ఎవరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని అసోసియేషన్ నోటిఫికేషన్ ఇచ్చిందని గణేష్‌కుమార్ ప్రత్యర్థి, కమెడియన్ జగదీశ్ మండిపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఆయన శుక్రవారం టీవీ ముందుకువచ్చి కంటతడి పెడుతూ.. గణేష్ కుమార్ బ్లాక్మెయిల్ చేసి మోహన్ లాల్‌ను తన ప్రచారానికి రప్పించుకున్నారని, ఇది సరికాదని ఆరోపించారు. కాగా, జగదీశ్‌కు మద్దతుగా మరో కమెడియన్ సలీంకుమార్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి తప్పుకున్నారు. మరోవైపు మోహన్ లాల్‌పై జగదీశ్ చేసిన ఆరోపణల్ని దర్శకుడు ఉన్నికృష్ణన్ కొట్టిపారేశారు. ఆయనను ఎవరూ బ్లాక్ మెయిల్ చేయలేదని, జగదీశ్ చెత్త ఆరోపల్ని మానుకోవాలని చెప్పారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా నటులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధిస్తూ ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. -
వామ్మో! ఆయన జయలలిత పార్టీ అభ్యర్థా?
తిరువనంతపురంలో రిక్షాలు, జీపుల్లో ఊరేగుతున్న అన్నాడీఎంకే కటౌట్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎన్నడూలేనిరీతిలో జయలలిత, ఎంజీ రామచంద్రన్ ఫొటోలతో అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటం స్థానికులను ఆశ్చర్య పరుస్తున్నది. ఈ కటౌట్లలో ప్రముఖంగా కనిపిస్తున్న మరో వ్యక్తి డాక్టర్ బీజూ రమేశ్. అన్నాడీఎంకే అభ్యర్థిగా తిరువనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగారు. 'టోపీ' గుర్తుతో బరిలోకి దిగిన ఆయనను చూడగానే కేరళ రాజకీయ నాయకులు ఒకింత విస్మయానికి లోనవుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. రూ. 161 కోట్ల ఆస్తులతో కేరళలోనే అత్యంత సంపన్న అభ్యర్థిగా బరిలోకి దిగిన బీజూ రమేశ్ బార్ల కుంభకోణంలో కీలక వ్యక్తి. బార్లకు లైసెన్సుల కోసం లంచాలు ఇచ్చినట్టు బీజూ రమేశ్ చేసిన ఆరోపణలు కేరళను రాజకీయంగా కుదిపేశాయి. ఈ ఆరోపణల దెబ్బకు బలమైన రాజకీయ నాయకుడు, ఆర్థికమంత్రి కేఎం మణి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ వ్యవహారం కుదిపేస్తుండగానే ఆయన ఏకంగా అన్నాడీఎంకే వంటి బలమైన తమిళ పార్టీ నుంచి కేరళ ఎన్నికల బరిలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2014 డిసెంబర్లో ఓ టీవీ చానెల్ చర్చలో బీజూ రమేశ్ మాట్లాడుతూ.. బార్ల అసోసియేషన్ తరఫున ఆర్థికమంత్రి కేఎం మణికి రూ. కోటి లంచంగా ఇచ్చామని వెల్లడించి సంచలనం రేపారు. అప్పుడు ఆయన బార్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిండెంట్‌గా ఉండేవారు. బార్ల లైసెన్సుల కోసం లంచాలు తీసుకున్న వ్యవహారం చినికిచినికి.. చివరకు మణి రాజీనామాకు దారితీసింది. ఈ వివాదం నేపథ్యంలో కేరళలో ఏకంగా మద్యనిషేధాన్ని సీఎం ఊమెన్ చాందీ ప్రకటించారు. అటు సీపీఎం నేతృత్వంలో ప్రతిపక్ష కూటమి కూడా ఓట్ల కోసం మద్యనిషేధానికి మద్దతు పలుకుతూ మాట్లాడుతున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలోకి దిగిన రమేశ్ కేరళ మద్యవిధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో జయలలిత తమిళనాడులో ప్రతిపాదించిన దఫాలవారీగా మద్యనిషేధాన్ని ఆయన సమర్థిస్తున్నారు. తాను సాదాసీదాగా ఎన్నికల బరిలోకి దిగలేదని, ప్రతిష్టాత్మకమైన తిరువనంతపురం నియోజకవర్గంలో గెలుపు తనదేనని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
కన్నకొడుకే తల్లికి ఓటెయ్యలేదు.. ఎందుకంటే?
బిహార్ ఎన్నికల వార్తల హోరులో మరుగునపడ్డ ఓ ఆసక్తికరమైన కథనమిది. గతవారం కేరళలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఓ వ్యక్తి ఫేస్బుక్లో పెట్టిన పోస్టు ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన తన తల్లికి ఎందుకు ఓటువేయలేదో వివరిస్తూ అతను ఈ పోస్టు పెట్టాడు. రాజేశ్ కుమార్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. థమరాకులంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన తన తల్లి జగదమ్మకు వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేశానో వివరిస్తూ ఆయన మలయాళంలో ఓ పోస్టు పెట్టారు. 'నా తల్లిపై ఉన్న ప్రేమ దేశం పట్ల నా కర్తవ్యాన్ని నెరవేర్చడంలో అడ్డురాలేదని నేను గర్వంగా చెప్తాను' అంటూ ఆయన పెట్టిన పోస్టుకు 10వేలకుపైగా లైకులు, 4,700కుపైగా షేర్లు వచ్చాయి. 'థమరాకులం గ్రామంలో ఆరో వార్డులో పోటీచేసిన నా తల్లి ఓడిపోయింది. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నేను వేసిన పోస్టల్ ఓటు కూడా ఆమె ఓటమికి కారణం. నేను ఈ విషయాన్ని ఎంతో బాధపడుతూ రాస్తున్నాను. 56 ఇంచుల ఛాతి కలిగిన వారికంటే నేను పెద్ద జాతీయవాదిని. నా దేశంలోని 126 కోట్ల ప్రజల గురించి నేను ఆందోళన చెందుతున్నాను' అని రాజేశ్‌కుమార్ పేర్కొన్నారు. బీజేపీ తరఫున పోటీచేసిన తన తల్లి తీరును కూడా ఆయన తప్పుబట్టారు. బీజేపీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఆయన గుజరాత్లో బీజేపీ ప్రభుత్వ పనితీరు దారుణంగా ఉందని పలు గణంకాలు వెల్లడించారు. రిజర్వేషన్ అంశంపై మోహన్ భగవత్, ప్రధాని నరేంద్రమోదీ చేసిన పరస్పర విరుద్ధ వ్యాఖ్యలను దుయ్యబట్టారు. అగ్ర కులాలు, అట్టడుగు వర్గాలను ఒకతాటిపైకి తెచ్చి.. మైనారిటీలను నిర్మూలించడం ద్వారా హిందూత్వ రాజ్యాన్ని సృష్టించాలని వారు మూర్ఖంగా ప్రయత్నిస్తున్నారని ఈ పోస్టులో ధ్వజమెత్తారు. 'స్త్రీలు, పురుషులు, ట్రాన్స్జెండర్లు వంటి ఎలాంటి వివక్ష లేకుండా రానున్న తరాలు స్వేచ్ఛగా జీవించేలా కృషిచేసేందుకు ప్రస్తుతం మనం పోరాడాల్సిన అవసరముంది. మత ఉగ్రవాదం నుంచి ప్రగతిశీల ఆలోచనావిధానాన్ని, భారత్ వంటి లౌకిక, ప్రజాస్వామిక దేశాన్ని రక్షించేందుకు మనం మరిన్ని త్యాగాలు చేయాల్సిన అవసరముంది' అని పేర్కొంటూ ఆయన ఈ పోస్టును ముగించారు.