కన్నకొడుకే తల్లికి ఓటెయ్యలేదు.. ఎందుకంటే? | Why a Son Voted Against his Mother, a BJP Candidate | Sakshi
Sakshi News home page

కన్నకొడుకే తల్లికి ఓటెయ్యలేదు.. ఎందుకంటే?

Published Mon, Nov 9 2015 7:01 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

కన్నకొడుకే తల్లికి ఓటెయ్యలేదు.. ఎందుకంటే? - Sakshi

కన్నకొడుకే తల్లికి ఓటెయ్యలేదు.. ఎందుకంటే?

బిహార్ ఎన్నికల వార్తల హోరులో మరుగునపడ్డ ఓ ఆసక్తికరమైన కథనమిది. గతవారం కేరళలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన తన తల్లికి ఎందుకు ఓటువేయలేదో వివరిస్తూ అతను ఈ పోస్టు పెట్టాడు.

రాజేశ్ కుమార్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. థమరాకులంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన తన తల్లి జగదమ్మకు వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేశానో వివరిస్తూ ఆయన మలయాళంలో ఓ పోస్టు పెట్టారు. 'నా తల్లిపై ఉన్న ప్రేమ దేశం పట్ల నా కర్తవ్యాన్ని నెరవేర్చడంలో అడ్డురాలేదని నేను గర్వంగా చెప్తాను' అంటూ ఆయన పెట్టిన పోస్టుకు 10వేలకుపైగా లైకులు, 4,700కుపైగా షేర్‌లు వచ్చాయి.

'థమరాకులం గ్రామంలో ఆరో వార్డులో పోటీచేసిన నా తల్లి ఓడిపోయింది. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నేను వేసిన పోస్టల్ ఓటు కూడా ఆమె ఓటమికి కారణం. నేను ఈ విషయాన్ని ఎంతో బాధపడుతూ రాస్తున్నాను. 56 ఇంచుల ఛాతి కలిగిన వారికంటే నేను పెద్ద జాతీయవాదిని. నా దేశంలోని 126 కోట్ల ప్రజల గురించి నేను ఆందోళన చెందుతున్నాను' అని రాజేశ్‌కుమార్ పేర్కొన్నారు. బీజేపీ తరఫున పోటీచేసిన తన తల్లి తీరును కూడా ఆయన తప్పుబట్టారు. బీజేపీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఆయన గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వ పనితీరు దారుణంగా ఉందని పలు గణంకాలు వెల్లడించారు. రిజర్వేషన్ అంశంపై మోహన్ భగవత్, ప్రధాని నరేంద్రమోదీ చేసిన పరస్పర విరుద్ధ వ్యాఖ్యలను దుయ్యబట్టారు. అగ్ర కులాలు, అట్టడుగు వర్గాలను ఒకతాటిపైకి తెచ్చి.. మైనారిటీలను నిర్మూలించడం ద్వారా హిందూత్వ రాజ్యాన్ని సృష్టించాలని వారు మూర్ఖంగా ప్రయత్నిస్తున్నారని ఈ పోస్టులో ధ్వజమెత్తారు.

'స్త్రీలు, పురుషులు, ట్రాన్స్‌జెండర్లు వంటి ఎలాంటి వివక్ష లేకుండా రానున్న తరాలు స్వేచ్ఛగా జీవించేలా కృషిచేసేందుకు ప్రస్తుతం మనం పోరాడాల్సిన అవసరముంది. మత ఉగ్రవాదం నుంచి ప్రగతిశీల ఆలోచనావిధానాన్ని, భారత్ వంటి లౌకిక, ప్రజాస్వామిక దేశాన్ని రక్షించేందుకు మనం మరిన్ని త్యాగాలు చేయాల్సిన అవసరముంది' అని పేర్కొంటూ ఆయన ఈ పోస్టును ముగించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement