వామ్మో! ఆయన జయలలిత పార్టీ అభ్యర్థా?
తిరువనంతపురంలో రిక్షాలు, జీపుల్లో ఊరేగుతున్న అన్నాడీఎంకే కటౌట్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎన్నడూలేనిరీతిలో జయలలిత, ఎంజీ రామచంద్రన్ ఫొటోలతో అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటం స్థానికులను ఆశ్చర్య పరుస్తున్నది.
ఈ కటౌట్లలో ప్రముఖంగా కనిపిస్తున్న మరో వ్యక్తి డాక్టర్ బీజూ రమేశ్. అన్నాడీఎంకే అభ్యర్థిగా తిరువనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగారు. 'టోపీ' గుర్తుతో బరిలోకి దిగిన ఆయనను చూడగానే కేరళ రాజకీయ నాయకులు ఒకింత విస్మయానికి లోనవుతున్నారు.
అందుకు కారణం లేకపోలేదు. రూ. 161 కోట్ల ఆస్తులతో కేరళలోనే అత్యంత సంపన్న అభ్యర్థిగా బరిలోకి దిగిన బీజూ రమేశ్ బార్ల కుంభకోణంలో కీలక వ్యక్తి. బార్లకు లైసెన్సుల కోసం లంచాలు ఇచ్చినట్టు బీజూ రమేశ్ చేసిన ఆరోపణలు కేరళను రాజకీయంగా కుదిపేశాయి. ఈ ఆరోపణల దెబ్బకు బలమైన రాజకీయ నాయకుడు, ఆర్థికమంత్రి కేఎం మణి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ వ్యవహారం కుదిపేస్తుండగానే ఆయన ఏకంగా అన్నాడీఎంకే వంటి బలమైన తమిళ పార్టీ నుంచి కేరళ ఎన్నికల బరిలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
2014 డిసెంబర్‌లో ఓ టీవీ చానెల్ చర్చలో బీజూ రమేశ్ మాట్లాడుతూ.. బార్ల అసోసియేషన్ తరఫున ఆర్థికమంత్రి కేఎం మణికి రూ. కోటి లంచంగా ఇచ్చామని వెల్లడించి సంచలనం రేపారు. అప్పుడు ఆయన బార్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిండెంట్‌గా ఉండేవారు. బార్ల లైసెన్సుల కోసం లంచాలు తీసుకున్న వ్యవహారం చినికిచినికి.. చివరకు మణి రాజీనామాకు దారితీసింది. ఈ వివాదం నేపథ్యంలో కేరళలో ఏకంగా మద్యనిషేధాన్ని సీఎం ఊమెన్ చాందీ ప్రకటించారు. అటు సీపీఎం నేతృత్వంలో ప్రతిపక్ష కూటమి కూడా ఓట్ల కోసం మద్యనిషేధానికి మద్దతు పలుకుతూ మాట్లాడుతున్నది.
ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలోకి దిగిన రమేశ్ కేరళ మద్యవిధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో జయలలిత తమిళనాడులో ప్రతిపాదించిన దఫాలవారీగా మద్యనిషేధాన్ని ఆయన సమర్థిస్తున్నారు. తాను సాదాసీదాగా ఎన్నికల బరిలోకి దిగలేదని, ప్రతిష్టాత్మకమైన తిరువనంతపురం నియోజకవర్గంలో గెలుపు తనదేనని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.