మామ్.... శ్రీదేవి జీవించిన సినిమా. కూతురికి జరిగిన అన్యాయానికి లోపల్లోపలే కుమిలిపోతూ తమ రాత ఇంతేనని తలపట్టుకుని ఏడుస్తూ కూర్చునే అమ్మ కాదు. బిడ్డ క్షోభను తీర్చడానికి తన బతుకును పణంగా పెట్టే సాహసానికి ఒడిగడుతుంది... విజయం సాధిస్తుంది ఈ అమ్మ. ఆమె పేరు దేవకి సబర్వాల్ (శ్రీదేవి). ఢిల్లీలోని ఓ పెద్ద స్కూల్లో బయాలజీ టీచర్. అదే స్కూల్లో తన కూతురు ఆర్యా పన్నెండో తరగతి చదువుతుంటుంది. అయితే ఆమెకు దేవకి సవతి తల్లి.
దేవకి.. ఆర్యాను కూడా తన కడుపున పుట్టిన చిన్న కూతురు ప్రియాలాగే చూసుకున్నా సవతి తల్లిని తల్లిగా ఆమోదించదు ఆర్యా. స్కూల్లో పిలిచినట్టుగానే ఇంట్లో కూడా ‘మామ్’ (మేడమ్) అనే పిలుస్తుంది. కూతురి ప్రవర్తనకు నొచ్చుకుంటుంటాడు తండ్రి ఆనంద్. సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు. ‘‘నాన్నా... అమ్మ తర్వాత నీ జీవితంలోకి ఇంకో స్త్రీ రావచ్చు. కాని కూతురి జీవితంలోకి ఇంకో అమ్మ రాదు. దయచేసి నన్ను ప్రెషర్ చేయొద్దు ఈ విషయంలో’’ అని చెప్తుంది తండ్రితో. ఇటు బిడ్డ బిహేవియర్‌తో భార్య ఏం ఫీలవుతుందోనని సతమతమవుతుంటాడు ఆనంద్.
అతను భావిస్తున్నట్టుగానే పెద్ద కూతురి పద్ధతికి దేవకి మనసు చివుక్కుమంటుంటుంది కాని ఆర్యా స్థానంలో ఉండి ఆలోచిస్తుంటుంది. తన స్నేహితులకు ఆర్యాను తన కూతురుగా పరిచయం చేయడాన్ని కూడా ఆ పిల్ల సహించదు. ఆ విషయాన్ని మొహమ్మీదే స్పష్టం చేస్తుంది. అలాగని దేవకికి పుట్టిన ప్రియతో సొంత అక్కలాగే మెదులుతుంది మళ్లీ. దేవకిని తల్లిగా తప్ప మిగతా అన్ని విషయాలను యాక్సెప్ట్ చేస్తుంది. ఈ విషయం అర్థం చేసుకున్న దేవకి ఆనంద్‌తో అంటుంది.. ‘‘ఆర్యాకు మన పరిస్థితి అర్థం చేయించడం కాదు.. మనమే ఆర్యాను అర్థం చేసుకోవాలి’’ అని.
వాలంటైన్స్ డే
ఆర్యాపై ఆమె క్లాస్‌మేట్ అబ్బాయి ఒకడు క్రష్ పెంచుకుంటాడు. అస్తమానం ఏవేవో మెసేజెస్ పంపిస్తుంటాడు. ఆర్యా చిరాకుపడుతుంటుంది. ఒకసారి క్లాస్‌లో దేవకి లెసన్ చెప్తుంటే ఏదో బూతు వీడియో పంపిస్తాడు. తన పక్కనే ఉన్న స్నేహితురాలికి చూపించి ఏవగించుకుంటుంది ఆర్యా. ఈ కలకలంతో దేవకి వాళ్ల బెంచ్ దగ్గరకు వచ్చి ఏం జరిగిందంటూ ఆ సెల్ ఫోన్ తీసి చూస్తుంది. విస్తుపోయి ఆ అబ్బాయి సెల్ లాక్కుని కిటికీలోంచి బయటకు పారేస్తుంది.
ఈ విషయం మనసులో పెట్టుకొని పగ పెంచుకుంటాడు ఆ అబ్బాయి. ఇదిలా ఉండగా వాలంటైన్స్ డేకి ఓ రిసార్ట్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు ఆర్యా ఫ్రెండ్స్. తండ్రిని పర్మిషన్ అడుగుతుంది. అది చాలా దూరం. వద్దు అని దేవకి అంటుంది. నేను మా నాన్నను అడుగుతున్నాను అంటూ తండ్రిని బతిమాలుతుంది. రాత్రి పన్నెండు కల్లా ఇంటికి వచ్చేస్తాను అని మాటిచ్చి తండ్రి దగ్గర అనుమతి తీసుకుంటుంది. తెల్లవారి తండ్రి బిజినెస్ ట్రిప్ మీద అమెరికా వెళ్తాడు. వాలంటైన్స్ డై రోజు రాత్రి పార్టీకి ఆర్య వెళ్తుంది.
అక్కడ తనకు ఇష్టమైన అబ్బాయిని ప్రపోజ్ చేయాలనుకుంటుంది. కాని అతను ఇంకో అమ్మాయితో కనిపించే సరికి ఇక అక్కడ ఆర్యాకు ఉండాలనిపించదు. ఫ్రెండ్‌తో చెప్పి వెళ్లిపోదామంటుంది. కాని ఫ్రెండ్ అప్పటికే తాగిన మత్తులో ఉండడం వల్ల క్యాబ్ బుక్ చేద్దామని కాస్త పక్కకు వెళ్తుంటే క్లాస్‌లో తన మీద క్రష్ పెంచుకున్న అబ్బాయి అండ్ గ్యాంగ్ కనిపిస్తారు. ఆ అబ్బాయి ఆర్యాను తనతో డ్యాన్స్ చేయమని అడుగుతాడు. ఆర్యా తిరస్కరించి క్యాబ్ బుక్ చేయడానికి బయటకు వెళ్తుంది.
ఆ అవమానాన్ని తట్టుకోలేని ఆ క్లాస్‌మేట్ తనతోపాటే ఉన్న తన కజిన్, కార్ డ్రైవర్‌కి చెప్పి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలంటాడు. ఆ రిసార్ట్ వాచ్‌మన్‌తో కలిసి ఆర్యాను కిడ్నాప్ చేస్తారు. అంతకుముందే ఆర్యాకు దేవకి కాల్ చేస్తుంది బయలుదేరమని. క్యాబ్ బుక్ చేస్తున్నాను,... 45 నిమిషాల్లో ఉంటాను ఇంట్లో అని చెప్తుంది ఆర్యా. కాని రెండున్నర గంటలు గడిచినా ఆర్య రాకపోయేసరికి కంగారు పడ్తుంది. ఫోన్ చేస్తుంటే కూడా ఆర్యా ఎత్తకపోయేసరికి దేవకి కంగారు భయంగా మారుతుంది.
గటేరులో...
రాత్రి రెండున్నర గంటలకు కార్లో రిసార్ట్‌కు బయలుదేరుతుంది దేవకి. అక్కడ ఆర్యాతోపాటు వెళ్లిన వాళ్లను ఆరా తీస్తుంది. ఆర్యా అప్పుడే వెళ్లిపోయింది అంటారు. కాళ్లు చేతులు వణుకుతాయి దేవకికి. నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్తుంది. కంప్లయింట్ ఇస్తుంది. వాలంటైన్స్ డే కదా... ఏ బాయ్‌ఫ్రెండ్‌తోనో వెళ్లి ఉంటుంది. ఎంజాయ్ చేసి వస్తుందిలే అని పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతుంది. మీకిలాంటివన్నీ మామూలే కావచ్చు, కాని మాకు కాదు. నా కూతురు అలాంటిది కాదు అని తీవ్రంగానే చెప్పి తన కూతురు జాడ వెతకమని సీరియస్‌గా అంటుంది.
అక్కడే ఉన్న ఓ ప్రైవేట్ డిటెక్టివ్ దయాశంకర్ కపూర్ (నవాజుద్దీన్ సిద్దిఖీ)దేవకి బయటకు వెళ్లగానే వెంటే వెళ్లి తన గురించి చెప్పి బిజినెస్ కార్డ్ ఇస్తాడు. అవసరం ఉంటే కాంటాక్ట్ చేయమని. తనకు అవసరం లేదని చెప్తుంది. ‘‘నాకూ ఓ కూతురు ఉంది. మీ బాధను అర్థం చేసుకోగలను. అందుకే హెల్ప్ చేయగలను అంటున్నా’’ అని చెప్తాడు. ఇదిలా ఉంటే మార్నింగ్ వాక్‌కు వెళ్లిన వాళ్లు పద్ధెనిమిదేళ్ల ఓ అమ్మాయి గటేరులో పడి ఉండడం చూసి హాస్పిటల్లో చేరుస్తారు. ఆ అమ్మాయి ఆర్యా అని తెలిసి దేవకికి కబురు పంపిస్తారు. పరీక్షలో ఆమె గ్యాంగ్ రేప్‌కి గురయిందని తేలుతుంది. అపస్మారక స్థితిలో ఉన్న బిడ్డను చూసి గుండె పగిలేలా ఏడుస్తుంది దేవకి. భర్తకు ఫోన్ చేస్తుంది వెంటనే రమ్మని.
ఒక్కొక్కరుగా...
విషయం కోర్ట్ వరకూ వెళ్తుంది. రేప్ చేసింది ఆర్యా క్లాస్‌మేట్ అయిన ఆ అబ్బాయి, కజిన్, వాళ్ల డ్రైవర్, వాచ్‌మన్ అని ఆర్యా చెప్తుంది. కాని డబ్బుతో మేనేజ్ చేసి నిర్దోషులుగా బయటకు వస్తారు. ఈ కేస్‌ను డీల్ చేసిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఫ్రాన్సిస్ మాథ్యూ (అక్షయ్ ఖన్నా) కూడా ఖంగు తింటాడు. ఎలాగైనా వాళ్లకు శిక్ష పడేలా చేయాలని సరైన సాక్ష్యాలను వెదికే పనిలో ఉంటాడు. ఇంకో వైపు ఆర్యా లోకంతో సంబంధంలేనిదానిలా అయిపోతుంది. దేనికీ స్పందించదు. గది నుంచి బయటకు రాదు. జరిగిన సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా కంపించిపోతుంటుంది.
అర్ధరాత్రి లేచి షవర్ కింద కూర్చుని శరీరాన్ని తొలి చేసుకునే ప్రయత్నం చేస్తుంటుంది. బిడ్డ మానసిక స్థితి అర్థమైన దేవకికి కంటి మీద కునుకు ఉండదు. దాంతో దయాశంకర్ కపూర్‌ను కలుస్తుంది. ఆ నలుగురి వివరాలు తీసుకుంటుంది. వాచ్‌మన్ క్యాస్ట్రేషన్‌కు లోనవుతాడు. ఆర్యా క్లాస్‌మేట్ వాళ్ల కజిన్ యాపిల్ సీడ్స్ పౌడర్ (ఇది సైనైడ్‌లాంటిది) కలిసి ఉన్న ప్రొటీన్ షేక్ తాగడం వల్ల పక్షవాతానికి లోనై చావుకి దగ్గరవుతాడు. ఇది చేసింది అతని కజినే అని పోలీస్ ఎంక్వయిరీలో తేలి ఆర్యా క్లాస్‌మేట్ జైలు పాలవుతాడు.
వీళ్లందరూ వరుసగా ఇలా పనిష్మెంట్‌కు గురవుతుంటే అటు పోలీస్ ఫ్రాన్సిస్, ఇటు ఆర్యా ఆశ్చర్యపోతారు. ఆర్యా కాస్త తేలికపడుతుంది. ఫ్యామిలీ అంతా కుఫ్రీ పోదామని అడుగుతుంది తండ్రిని. వెళ్తారు. అయితే పోలీస్ ఫ్రాన్సిస్‌కు దేవకి మీద అనుమానం మొదలై గమనిస్తుంటాడు. వాళ్లను మట్టుబెడుతుంది దేవకే అని నిర్థారణకూ వస్తాడు. చట్టాన్ని ఆమె చేతుల్లోకి తీసుకోకుండా ఆపాలనుకుంటాడు. ఇంతలోకే ఆర్యా క్లాస్‌మేట్ కజిన్ వాళ్ల డ్రైవర్‌కు దయాశంకర్ మీద డౌట్ వచ్చి నివృత్తి చేసుకుని అతన్ని చంపేస్తాడు, కుఫ్రీకి వస్తాడు దేవకీని మట్టుబెట్టడానికి.
ఫ్రాన్సిస్ కూడా చేరుకుంటాడు అతన్ని ఫాలో అవుతూ. దేవకి మీద దాడి చేస్తాడు డ్రైవర్. అక్కడే ఉన్న ఆర్యానూ చంపాలనుకుంటాడు కాని దేవకి చెప్పడంతో ఆర్యా అక్కడి నుంచి పారిపోతుంది. మంచులో ఛేజింగ్.... చివరకు దేవకి చేతికి చిక్కుతాడు డ్రైవర్. వెనకే పోలీస్. తన గన్ ఇస్తాడు చంపేదుంటే దాంతో చంపమని. తన తల్లి తన కోసం ఎంత చేసిందో అప్పుడు అర్థమవుతుంది ఆర్యాకు. అప్పడు పిలుస్తుంది ‘మామ్’ (అమ్మ) అని. దేవకి ఆ డ్రైవర్‌ను చంపేస్తుంది. బిడ్డ తల్లిని అక్కున చేర్చుకుంటుంది. గుండెలవిసేలా ఏడుస్తుంది దేవకి.
సవతి తల్లిని రాక్షసిగా కాకుండా... బిడ్డను అర్థం చేసుకునే రియల్ మామ్‌లా చూపించిందీ సినిమా. ఓ పాశవిక చర్యకు బలైన అమ్మాయి పట్ల కుటుంబం ఎలా ప్రవర్తించాలో చెప్తుంది. ఎలాంటి నైతిక అండ ఉండాలో వివరిస్తుంది. ఈ సినిమా షూటింగ్ విరామ సమయాల్లో కూడా శ్రీదేవి తన పిల్లలకు ఫోన్ చేయలేదట. గ్యాప్ గ్యాప్‌కి ఫోన్ చేసే అమ్మ ఫోన్ చేయట్లేదేంటి అని శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ తన అక్క జాన్వీని అడిగేదట. ‘ఈ సినిమాలో అంత లీనమయ్యా... ఆర్యా ప్లేస్‌లో నా కూతరే ఉందనుకున్నా’ అని చెప్పింది శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో. ఆ మాట నిజమే అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. ఆమేజాన్ ప్రైమ్‌లో దొరకొచ్చు. ఆల్ఫా మూవీస్ చానల్‌లో కూడా తరచుగా ఈ సినిమా ప్లే అవుతోంది.
– శరాది
Comments
Please login to add a commentAdd a comment