సినిమా రివ్యూ: మళ్లీ రాదోయ్...లైఫ్
సినిమా రివ్యూ: మళ్లీ రాదోయ్...లైఫ్
Published Sun, Nov 9 2014 10:11 PM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM
క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడటం ద్వారా భగవంతుడు ప్రసాదించిన విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దనే ఓ చక్కటి కథాంశంతో రూపొందిన చిత్రం 'మళ్లీ రాదోయ్... లైఫ్'. అప్పుల బారిన పడిన రైతులు, ప్రేమ విఫలమై ప్రేమికులు, సంసారంలో చిన్న చిన్న తగాదాలకు ఆత్మహత్యలు చేసుకోవడం వద్దనే అనే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం గురించి వివరంగా తెలుసుకోవాలంటే కథలోకి వెళ్తాం.
అప్పుల బారిన పడిన ఓ రైతు ప్రభుత్వ సహాయం కోసం ప్రయత్నించి.. విఫలమై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని.. ఓ ప్రదేశానికి చేరుకుంటారు. అదే సమయానికి ప్రియురాలితో విభేదాలు తలెత్తడంతో ఆత్మహత్యే శరణ్యమని అనుకుంటున్న యువకుడికి రైతు తారసపడుతాడు. అయితే ఆత్మహత్యకు పాల్పడాలని నిశ్చయించుకున్న వీరికి ఓ వ్యక్తి పరిచయమవుతాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వారి జీవితాలకు సార్ధకతను కల్పిస్తానని..చెప్పి వ్యవసాయ మంత్రిని చంపడానికి మానవబాంబుల్లా తయారు చేయాలని అపరిచిత వ్యక్తి ప్లాన్ వేస్తాడు. తమను స్వార్థం కోసం వాడుకుంటున్నాడని రైతుకి, యువకుడికి తెలుస్తాయి. ఆ యువకుడు, రైతు మానవబాంబుల్లా తయారయ్యారా? రైతు, యువకుడి సమస్యకు పరిష్కారం దొరికిందా? రైతు సమస్యలకు ఎలాంటి పరిష్కారాన్ని చూపించాడనే కథతో తెరకెక్కిన చిత్రం 'మళ్లీ రాదోయ్...లైఫ్'.
ప్రేమికులుగా అల్తాఫ్ హసన్, కృష్ణవేణి, రైతు కేశవ్ గా మేక రామకృష్ణ, విలన్ గా బి.మల్లేశ్ లు నటించారు. ఈ చిత్రంలో రైతు, యువకుడి పాత్రలే ప్రధానమైనవి. అప్పుల బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులకు సాక్షిగా రామకృష్ణ, క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్న ప్రేమికులకు ఉదాహరణగా అల్తాఫ్ పాత్రలు ప్రస్తుత సమాజంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులకు దర్పణం పడుతాయి. తమ పాత్రల పరిధి మేరకు అన్ని పాత్రలు బాగానే రాణించాయి. ప్రతి పాత్ర ద్వారా ఓ సందేశాన్ని చెప్పడానికి దర్శకుడు రఘు బెల్లంకొండ చేసిన ప్రయత్నం అభినందనీయం. కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దర్శకుడు ఆత్మహత్యలు చేసుకోకూడదు.. అనే థీమ్ తో ఓ చిత్రాన్ని రూపొందించడమనే విషయాన్ని ఓ సాహసంగా చెప్పుకోవచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్ ను టచ్ చేస్తూ.. ఆఫ్ బీట్ లో చిత్రాన్ని చక్కగా చిత్రీకరించారు. విజయ్ కురాకుల సంగీతం, రాజేశ్ కెమెరా, ఎడిటర్ శ్రీగుహల పనితీరు ఓకే అనేలా ఉన్నాయి. అయితే పబ్లిసిటీ, పంపిణీ వ్యవస్థలోని లోపాలు ఈ చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో దారుణంగా విఫలమయ్యాయి. మంచి కథను ప్రభావవంతంగా తెరకెక్కించడంలో దర్శకుడి అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపిస్తుంది. బడ్జెట్ పరిమితి కారణంగా పాత్రలకు నటీనటుల ఎంపిక విషయంలో తడబాటుకు గురైనప్పటికి.. కొత్త నటీనటులు చక్కటి ప్రతిభను కనబరిచారు. ఏది ఏమైనా.. రెగ్యులర్ చిత్రాలతో విసిగెత్తిన ప్రేక్షకులకు.. సందేశాత్మక, ఆఫ్ బీట్ చిత్రాలను మెచ్చే సినీ అభిమానులకు 'మళ్లీ రాదోయ్ లైఫ్' నచ్చుతుంది.
Advertisement