సినిమా పరిశ్రమ వేరే లోకంలా ఉంది! | Music Director Mickey J Meyer Interview | Sakshi
Sakshi News home page

సినిమా పరిశ్రమ వేరే లోకంలా ఉంది!

Published Wed, Apr 5 2017 11:34 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

సినిమా పరిశ్రమ వేరే లోకంలా ఉంది! - Sakshi

సినిమా పరిశ్రమ వేరే లోకంలా ఉంది!

‘‘నేను చాలా హోమ్లీ పర్సన్‌. పబ్స్, పార్టీలకు వెళ్లను. ఫ్రెండ్స్‌ కూడా తక్కువే. తెలుగు సరిగ్గా రానప్పుడు తెలుగు ఇండస్ట్రీకి రావడం ఎందుకు? అని ఇండస్ట్రీకొచ్చినప్పుడు కొందరన్నారు. ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడుతున్నా. పదేళ్లయినా సినిమా పరిశ్రమ నాకు వేరే లోకంలా కొత్తగా ఉంది’’ అన్నారు సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్‌. వరుణ్‌ తేజ్, లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్‌ హీరో హీరోయిన్లుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ‘ఠాగూర్‌’ మధు నిర్మించిన ‘మిస్టర్‌’ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన మిక్కీ చెప్పిన విశేషాలు.


శ్రీను వైట్లగారితో నాకిది తొలి చిత్రం. కథకు తగ్గట్టు బెస్ట్‌ మ్యూజిక్‌ ఇవ్వాలన్నారు. ఆరు పాటలూ బాగా వచ్చాయి. పాటలు, ట్రైలర్స్‌కు మంచి స్పందన వచ్చింది. వరుణ్‌తేజ్‌తో ‘ముకుంద’ తర్వాత మరోసారి పనిచేశా. తను అందరితో సరదాగా ఉంటాడు. నాకు ఓ మంచి స్నేహితుడికంటే ఎక్కవ.

‘కొత్త బంగారు లోకం’ తర్వాత మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో మూడేళ్లు సంగీతంపై దృష్టి పెట్టలేదు. 2011లో నాన్నగారు చనిపోయారు. ఆ బాధ నుంచి మెల్లిగా తేరుకుని, సినిమాలు చేస్తున్నా.

ఏఆర్‌ రెహమాన్‌ అంటే నాకిష్టం. ‘లీడర్‌’లో ఆయనతో ఒక పాట పాడించాలనుకున్నా. ఇప్పటివరకూ పాడించే ఛాన్స్‌ రాలేదు.

నాకిష్టమైన హీరో మహేశ్‌బాబు. దర్శకుల్లో శ్రీకాంత్‌ అడ్డాల. శ్రీకాంత్‌ ప్రతిభకు తగ్గ హిట్‌ ఇప్పటికీ రాలేదు.

దర్శకులు వాళ్లకు ఏం కావాలో చెబుతారు. మన అభిప్రాయమూ చెబుతాం. ఒక్కోసారి వారు వినిపించుకోనప్పుడు ఫ్రస్ట్రేషన్‌ వస్తుంది. ఆ తర్వాత సర్దుకుపోతాం. అయితే, ఎదుటి వారి సలహాలు వినే ఓపిక ఉంటే మంచిది. బాగుంటే పాటిస్తాం, లేకపోతే లేదు.

ఆంధ్ర, తెలంగాణ జానపదాలతో ఫోక్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ చేయాలనుంది. సినిమా హిట్, ఫ్లాప్‌ విషయంలో నా జడ్జిమెంట్‌ ఎప్పుడూ రాంగే. హిట్‌ అనుకున్నవి ఫ్లాప్, ఫ్లాప్‌ అనుకున్నవి ఘనవిజయం సాధించాయి.

సావిత్రిగారి జీవితకథతో తెరకెక్కనున్న ‘మహానటి’ చిత్రానికీ, ‘దిల్‌’ రాజుగారి బ్యానర్‌లో మరో చిత్రానికి సంగీతం అందించనున్నా. ‘మహానటి’ 1940–50 దశకానికి సంబంధించినది. అందుకు తగ్గట్టే స్వరాలు ఇస్తున్నా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement