విజయ్ చిత్రానికి సంగీతం అందించాలి
ఇళయదళపతి విజయ్ చిత్రానికి సంగీతాన్ని అందించాలన్న కోరికను వ్యక్తం చేశారు యువ సంగీతదర్శకుడు సిద్ధార్థ్ విపిన్. ఈయన్ని ఒక్క సంగీతదర్శకుడని మాత్రమే సరిపెట్టలేం. కారణం సిద్ధార్థ్‌విపిన్‌లో ఒక గాయకుడు, మంచి నటుడు, నిర్మాత ఉన్నారు. ఇలా మల్టీ ట్యాలెంట్‌ను ప్రదర్శస్తున్న అతి కొద్దిమంది సంగీతదర్శకుల్లో ఈయన ఒకరు.
చెన్నై లయోలా కళాశాల విద్యార్థి అయిన సిద్ధార్థ్ విపిన్ ఆ తరువాత సంగీత పాఠశాలో సంగీతాన్ని అభ్యర్థించారు. కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్న ఈయన తొలుత హాలీవుడ్ చిత్రాలకు సౌండ్ ఎఫెక్ట్స్‌ను అందించారు. అలాపేరు తెచ్చుకున్న సిద్ధార్థ్‌విపిన్ మిషన్ 90 డేస్ అనే మలయాళ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని అందించి సంగీత దర్శకుడిగా రంగప్రవేశం చేశారు.
అదే చిత్రంలో రాజీవ్‌గాంధీగా కీలక పాత్ర పోషించి నటుడిగానూ పరిచయమయ్యారు. ఆ తరువాత సిద్ధార్థ్ విపిన్ వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. తమిళంలో నడువుల కొంచెం పక్కత్తుకానోమ్ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని అందించారు. అటుపై ఇదర్కుదానే అశై పడ్డాయ్ బాలకుమారా చిత్రానికి సంగీతాన్ని అందించి అందులో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించారు.
చేరన్ దర్శకత్వం వహించిన జేకే ఎనుమ్ నన్భనిన్ వాళ్కై, సుందర్.సీ కథానాయకుడిగా నటించి నిర్మించిన ముత్తిన కత్తిరిక, శుక్రవారం తెరపైకి వచ్చిన జాక్సన్‌దురై వరకూ పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించి సక్సెస్ గాడిలో దూసుకుపోతున్న సిద్ధార్థ్‌విపిన్ నిర్మాతగా కూడా అవతారమెత్తారు. లెన్స్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే తనకు నటన, నిర్మాత కంటే సంగీతం తన ప్రాధాన్యం అంటున్న విపిన్ ఇదర్కుదానే ఆశైపడ్డాయ్ బాలకుమారా లాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు సంగీతాన్ని అందించడం ఇష్టం అంటున్నారు.
సంగీతంలో తనకు స్ఫూర్తి ఏఆర్.రెహ్మాన్ అని పేర్కొన్న సిద్ధార్థ్‌విపిన్ నటుడు విజయ్ చిత్రానికి సంగీతాన్ని అందించాలన్న కోరికను వ్యక్తం చేశారు.ప్రస్తుతం మలమాళంలో మోహన్‌లాల్ నటిస్తున్న చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. తమిళంలో ఇద ర్కుదానే ఆశైపడ్డాయ్ బాలకుమారా చిత్రానికి సీక్వెల్ చిత్రాలకు సంగీతం అందించనున్నట్లు తెలిపారు.