
దర్శకుడు రావిపూడి అనిల్‌ను సన్మానిస్తున్న గ్రామస్తులు
చిలుకూరివారిపాలెం (యద్దనపూడి): ‘ నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రోద్బలంతోనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. ఏ కొడుకైనా సినిమా రంగంలోకి వెళ్తానంటే ఏ ఉద్యోగమో, వ్యాపారమే చేసుకోమంటారు.. కానీ నా తల్లిదండ్రులు నేను డైరెక్టర్‌ను అవుతానని చెప్తే నీ వెన్నంటే ఉంటామని నన్ను ప్రోత్సహించారు. అందుకే నా తల్లిదండ్రులే నాకు బలం వారికి జీవితాంతం రుణపడి ఉంటాను’ అని రాజా ది గ్రేట్ సినిమా దర్శకుడు రావిపూడి అనిల్ అన్నారు. చిలుకూరివారిపాలెంలో ఆదివారం రావిపూడి అనిల్‌కి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదల, కృషి, ఓర్పుతో ఏ రంగంలోనైనా రాణించవచ్చన్నారు.
రాబోయే చిత్రాలు సమాజానికి సందేశాత్మకంగా, హస్యానికి ప్రాధాన్యతనిస్తూ నిర్మిస్తానన్నారు. రచయిత కందిమళ్ల సాంబశివరావు మాట్లాడుతూ మారుమూల గ్రామంలో పుట్టిన అనిల్ అంచెలంచెలుగా ఎదిగారన్నారు. ఆయన దర్శకత్వం వహించిన పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాలు విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. ఐ అండ్ పీఆర్ రాష్ట్ర కమిషనర్ ఎస్.వెంకటేశ్వరన్ మాట్లాడుతూ సమాజంలో ఉన్న మంచి చెడులను విశ్లేషిస్తూ ప్రజల్లో తీసుకువచ్చేందుకు నాటకరంగం, చలనచిత్ర రంగం దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పారిశ్రామిక వేత్తలు, రచయితలు దర్శకుడు అనిల్, ఆంధ్రప్రదేశ్ కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు పెరవళ్లి రాఘవరావును ఘనంగా సత్కరించి సన్మానించారు. కార్యక్రమంలో పేర్ని వీరనారాయణ, కల్పతరువు సంస్థ అధినేత రఘురామిరెడ్డి, ఏఎమ్‌జీ సంస్థల డైరెక్టర్ బాబు, పెరవళ్లి కోటిరామయ్య, రావిపూడి బ్రహ్మయ్య, కరణం శివ, చిలుకూరి శ్రీనివాసరావు, కరణం శ్రీను, కమ్మ పద్మారావు, చెరుకూరి కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment