
జీవించినంతకాలం రాజులా బతికారు: జగపతిబాబు
హైదరాబాద్: తన తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్ జీవించినంతకాలం రాజులా బతికారని ప్రముఖ నటుడు జగపతిబాబు అన్నారు. తన జీవితంలో ఎవరినీ బాధ పెట్టలేదన్నారు. తన తండ్రి ఎటువంటి బాధ లేకుండా మనశ్శాంతిగా నిష్క్రమించారని జగపతిబాబు మీడియాతో చెప్పారు. ఆయన భౌతిక కాయాన్ని ఫిల్మ్ చాంబర్ కు తీసుకెళ్లడం లేదని, తమ ఇంటికే తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని రేపు తమ ఇంటిదగ్గర ఉంచుతామన్నారు.
తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా బాధపడ్డారని, మళ్లీ పుంజుకున్న తర్వాత సంతోషించారని జగపతిబాబు తెలిపారు. తాను జీవితంలో స్థిరపడాలన్న నాన్నగారి కోరిక నెరవేరిందన్నారు. తన కూతురు, తన సోదరుడి కుమార్తె పెళ్లిళ్ల కోసం ఆరాటపడ్డారని చెప్పారు. వాళ్లిద్దరికీ పెళ్లిళ్లు కుదిరాయన్న శుభవార్తలు విన్న తర్వాతే ఆయన కన్నుమూశారన్నారు.