నాగ చైతన్య
‘‘భారీ నిర్మాణం, వాణిజ్య అంశాల వల్ల సినిమాలు విజయం సాధిస్తాయంటే నమ్మను. దేనికైనా కథ ముఖ్యం. ఆ కథ ద్వారా ప్రేక్షకులకు సరైన వినోదాన్ని పంచడం ముఖ్యం’’ అని నాగచైతన్య అంటున్నారు. విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు నాగచైతన్య.
మీ తాతగారి పాటలోని పల్లవిని సినిమా టైటిల్‌గా పెట్టుకున్నారు. ఆ ఆలోచన ఎవరిది?
దర్శకునిదే. కథకు ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుంది. ఓ అమ్మాయి కోసం ఓ అబ్బాయి చేసిన ప్రయత్నాలేంటి? ఆ అమ్మాయి కోసం ఆ అబ్బాయి ఎంత దూరం వెళ్లాడు? అనేది ఈ సినిమా కథ. తాతగారి ‘రాముడుకాదు కృష్ణుడు’ సినిమాలోని ‘ఒక లైలాకోసం’ పాట పెద్ద హిట్. క్రేజ్ కూడా ఉంటుంది కదా. అందుకే ఆ టైటిల్ పెట్టాం. ఆ పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ కూడా చేశాం. నిజంగా ఆ పాటను రీమిక్స్ చేయడం కత్తిమీద సామే. రీమిక్స్‌లకు అనూప్‌రూబెన్స్ త్వరగా ఒప్పుకోడు. కానీ... సందర్భం చెప్పి, పాట వినిపించగానే ఒప్పుకున్నాడు.
ఇంతకు ముందు ప్రేమకథలు చేశారు కదా. వాటికీ దీనికి తేడా ఏంటి?
వాటితో పోలిస్తే ఇది పరిణతి చెందిన కుర్రాడి ప్రేమకథ. గ్రాడ్యుయేషన్ పూర్తయిన కుర్రాడిగా ఇందులో కనిపిస్తా. ఇంట్లో సంబంధాలు చూస్తుంటారు. నాకేమో పెళ్లంటే ఆసక్తి ఉండదు. అలాంటి వాడు ప్రేమలో పడితే ఏమవుతుంది? అనేది ఈ సినిమా. నా ‘100% లవ్’ సినిమాలాగే పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుంది.
తుఫాన్ బీభత్సం వల్ల ఆంధ్రా పరిస్థితి బావుండలేదు కదా. ఈ టైమ్‌లో విడుదల కరెక్టేనా?
నష్టం ఉంటుంది. సిద్ధపడే విడుదల చేస్తున్నాం. వారికి ఎదురైన నష్టంతో పోలిస్తే మన నష్టం ఏముంది చెప్పండి. చాలా బాధగా ఉంది. ఈ సినిమా విడుదలకు కావాల్సిన అన్ని పనులూ పూర్తయిపోయాయి. అందుకే తప్పడంలేదు.
నాగార్జునగారు సినిమా చూసి కొన్ని మార్పులు చెప్పారట?
ఒక సినిమాతో చాలారోజులుగా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ సినిమాలో ప్రతి సన్నివేశం మనకు బాగానే ఉంటుంది. కానీ... కొత్తగా చూసేవారికి తెలుస్తుంది అందులోని లోపాలు. రీసెంట్‌గా నాన్న చూసి కొన్ని మార్పులు సూచించారు. మాకు సబబే అనిపించి రీషూట్ చేశాం.
అంటే మీ సినిమాల విషయం మీ నాన్నగారి జోక్యం ఉంటుందన్నమాట?
కథలు నేనే వింటాను. నాకు నచ్చాక నాన్నగారిని వినమంటాను. హీరోగా నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు రావాలనేది నాన్నగారి కోరిక. అందుకే సలహాలిస్తుంటారు. నేను సొంతంగా నిర్ణయం తీసుకోవడమే నాన్నకు ఇష్టం. రెండు సినిమాలు ఫ్లాపైనా పర్లేదు.. అనుభవం వస్తుందంటారు నాన్న. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. పబ్లిసిటీ వ్యవహారాలు కూడా నేనే చూసుకుంటున్నా.
స్టార్ హీరోల భారీ పారితోషికాల వల్లే నిర్మాణ వ్యయం పెరిగిపోతోందనీ, తద్వారా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు నష్టాలు వాటిల్లుతున్నాయనే విమర్శపై మీ కామెంట్?
నేను సినిమా ఒప్పుకునే ముందు బడ్జెట్ ఎంతో తెలుసుకుంటాను. సేఫ్ అనుకున్న తర్వాతే ముందుకెళ్తా. మనం చేసే సినిమా వల్ల ఎవరూ నష్టపోకూడదనేది నా సిద్ధాంతం.
సినిమా ఫ్లాపైతే ఆ నష్టాన్ని హీరోలు భరించాలనే వాదనను ఏకీభవిస్తారా?
సినిమా అనేది సమష్టి కృషి. ఒకరి వల్ల హిట్ అవ్వదు. ఒకరి వల్ల ఫ్లాప్ అవ్వదు. యూనిట్ మొత్తం కలిసి నష్టాన్ని భరిస్తామంటే నేనూ సిద్ధమే.
అఖిల్ సినిమా ఎప్పుడు?
కథలు వింటున్నాడు. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. ఏమైనా సందేహాలు ఉంటే అడుగుతుంటాడు. ఫైనల్ నిర్ణయం మాత్రం తనదే.
మీ నెక్ట్స్ సినిమాలు?
సుధీర్‌వర్మ దర్శకత్వంలో చేస్తున్నాను. మిగిలినవి చర్చల దశలో ఉన్నాయి.
ఇంతకీ మీ లైలా తారసపడిందా? పెళ్లెప్పుడు?
ఇంట్లో వాళ్లు కూడా అడిగారు. చూడమని చెప్పాను. వారి ప్రయత్నాల్లో వారున్నారు. నా లైలా ట్రయల్స్‌లో నేనున్నాను (నవ్వుతూ).