
నా పాటలను సొమ్ము చేసుకుంటున్నారు!
‘‘నా అనుమతి లేనిదే నా పాటలను వాడకూడదు’’ అని సంగీత జ్ఞాని ఇళయరాజా ఇప్పుడు కాదు.. ఎప్పట్నుంచో వాపోతున్నారు. అయినప్పటికీ రేడియో, టీవీ, అంతర్జాలం.. ఇలా ఎక్కడి పడితే అక్కడ ఆయన అనుమతి లేకుండా పాటలను వాడేసుకుంటున్నారు. లాభం లేదనుకుని, ఇళయరాజా ఆ మధ్య మద్రాస్ హైకోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.
ఆయన విన్నపాన్ని పరిశీలించి, ఇళయరాజా అనుమతి లేకుండా పాటలను ఎవరూ వినియోగించకూడదంటూ న్యాయస్థానం ఓ ఉత్తర్వు కూడా జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వును కూడా చాలామంది ఖాతరు చేయడంలేదు. దాంతో తన పాటలను వాడుకుంటున్న రికార్డింగ్ కంపెనీలను, రేడియో స్టేషన్లను, ఆన్‌లైన్ పైరసీని అడ్డుకోవడానికి అభిమానుల ద్వారా ఇళయరాజా చాలా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఫలితం కనిపించలేదు.
ఇక లాభం లేదనుకుని డీజీపీ, చెన్నై పోలీస్ కమిషనర్, తమిళనాడులోని అన్ని జిల్లాల్లో ఉన్న ఎస్‌ఐలకు లేఖ రాశారు. ‘‘నా పాటలను తస్కరిస్తున్నారు. నా అనుమతి లేకుండా సొమ్ము చేసుకుంటున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని ఇళయరాజా కోరారు. ఇప్పుడైనా రాజాగారికి ఫలితం కనిపిస్తుందో? లేదో?