నేను తెలుగులో ఒప్పుకున్న తొలి చిత్రం రఫ్!
రెండు మూడు నెలలకో సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్నారు రకుల్ ప్రీత్‌సింగ్. అటు అందంతోనూ, ఇటు అభినయంతోనూ అదరగొడుతున్నారు రకుల్. ముఖ్యంగా ఆమె అందం కుర్రకారుకు తెగ నచ్చేసింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘లౌక్యం’, ‘కరెంటు తీగ’ సినిమాలతో సందడి చేసిన రకుల్ ఇప్పుడు ‘రఫ్’ ఆడించేందుకు సిద్ధమయ్యారు. ఆది, రకుల్ జంటగా నటించిన చిత్రమే ‘రఫ్’. సీహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వం వహించారు. అభిలాష్ మాధవరం నిర్మాత. ఈ నెల 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్‌సింగ్ ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
సినిమాలో ‘రఫ్’ ఆడించేది మీరేనా?
ఇందులో రఫ్ ఆడించే వ్యక్తులు ముగ్గురు. ఆది, నేను, శ్రీహరి గారు. మా ముగ్గురి చుట్టూనే కథ సాగుతుంటుంది.
ఇందులో మీరు పోషించిన పాత్ర గురించి చెబుతారా?
నా పాత్ర పేరు నందు. బాగా డబ్బున్న అమ్మాయిని. సాటివారికి సాయం చేయాలనే మనస్తత్వమున్న ఓ అందమైన అమ్మాయి పాత్ర ఇది. చిన్న పిల్లలంటే ప్రాణం. అలాంటి అమ్మాయి జీవితంలోకి ఓ అబ్బాయి ఎలా ప్రవేశించాడనేది తెరపైనే చూడాలి.
ఈ సినిమాతోనూ సక్సెస్ ఖాయమంటారా?
తప్పకుండా. నా విజయపరంపరని కొనసాగించే చిత్రం అవుతుంది ‘రఫ్’. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. తెలుగులో నేను ఒప్పుకున్న తొలి చిత్రమిదే. కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడంతో ఇప్పుడు విడుదలవుతోంది. కథపై నమ్మకంతో ఈ సినిమా చేశాను. ప్రేక్షకుల్ని అలరించే అన్ని అంశాలూ ఈ సినిమాలో ఉన్నాయి.
ఆదితో కలిసి తెరను పంచుకోవడం ఎలా అనిపించింది?
చాలా బాగుంది. తను మంచి కోస్టార్. నాకు అడుగడుగునా అండగా నిలిచాడు. తెలుగులో నేను చేసిన తొలి చిత్రమిదే కాబట్టి, సెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు భాష తెలియక అంతా గందరగోళంగా అనిపించేది. అప్పుడు ఆది నాకు సాయం చేశాడు. డైలాగ్స్‌కి అర్థాలు చెబుతూ తెలుగు నేర్పించే ప్రయత్నం చేశాడు. తను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. సిక్స్‌ప్యాక్ చేశాడు. మా డాన్సులు కూడా బాగుంటాయి. శ్రీహరి సార్‌తో కలిసి తెరను పంచుకోవడం మరచిపోలేని విషయం. దర్శకుడు సుబ్బారెడ్డికి ఇదే తొలి చిత్రమైనా ప్రతీ విషయంలోనూ స్పష్టత ప్రదర్శిస్తూ సినిమాను చాలా బాగా తీశాడు. సెంథిల్, మణిశర్మలాంటి టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పనిచేశారు. అలాగే నిర్మాణ విలువలు కూడా అడుగడుగునా కనిపిస్తుంటాయి. నిర్మాత అభిలాష్ మాధవరం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని తెరకెక్కించారు.
(శ్రీదేవి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం ‘రఫ్’. అభిలాష్ మాధవరం నిర్మాత. యమ్. సుదర్శన్ రావు సమర్పిస్తున్నారు. 28న సినిమాని విడుదల చేస్తున్నారు).