Rough
-
ప్రతి అక్కా... తమ్ముడూ చూడాల్సిన సినిమా
‘‘నా కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమా ‘రఫ్’. రెండో వారం కూడా వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ విజయానికి కారణం నిర్మాత అభిలాష్. సినిమాపై నమ్మకంతో భారీ పబ్లిసిటీ ఇచ్చి... నైజాంలో స్వయంగా ఆయనే 130 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు’’ అని ఆది అన్నారు. ఆది, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా సి.హెచ్.సుబ్బారెడ్డి దర్శకత్వంలో అభిలాష్ మాధవరం నిర్మించిన చిత్రం ‘రఫ్’. ఈ చిత్రం సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆది మాట్లాడారు. ‘‘దర్శకుడు సుబ్బారెడ్డి నన్ను చాలా కొత్తగా ప్రెజెంట్ చేశాడు. ఈ సినిమాలో నేను అందంగా కనబడ్డానంటే కారణం కెమెరామేన్ సెంథిల్. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. ఇందులో శ్రీహరి అసిస్టెంట్‌గా శివారెడ్డి ఆకట్టుకున్నారు. ఇంత మంచి సందర్భంలో శ్రీహరిగారు లేకపోవడం బాధాకరం’’ అని ఆవేదన వెలిబుచ్చారు ఆది. వరుసగా సినిమాలు తీస్తూ, ఇదే రంగంలో కొనసాగాలనే భావనను ఈ సినిమా విజయం తనకు కలిగించిందని నిర్మాత అభిలాష్ అన్నారు. ‘‘ప్రతి అక్కా, తమ్ముడూ చూడాల్సి సినిమా ఇది. ఎన్నో అవరోధాలను అధిగమించి ఈ చిత్రాన్ని విడుదల చేశాం. శ్రీహరిగారు చనిపోవడంతో ఈ సినిమాపై ఆశలు వదులుకున్నాం. కానీ... నిర్మాత అభిలాష్ భుజం తట్టి ముందుకు నడిపించారు. లవర్‌బోయ్ ఆదితో మాస్ ఎంటర్టైనర్ ఏంటి? అన్న వాళ్లందరికీ ఈ సినిమా వసూళ్లే సమాధానాలు’’ అని దర్శకుడు చెప్పారు. ప్రేక్షకుల మధ్య కూర్చొని ఈ సినిమా చూశాననీ, పాటలకు, డైలాగులకు మంచి స్పందన లభిస్తోందని రకుల్ ప్రీత్‌సింగ్ చెప్పారు. ఈ మధ్య కాలంలో కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న సినిమా ఇదేనని శివారెడ్డి అన్నారు. ఇంకా కాశీవిశ్వనాథ్, దిల్ రమేశ్ కూడా మాట్లాడారు. -
ఇలా అన్నీ ఒక సినిమాలో కుదరడం అరుదుగా జరుగుతుంటుంది
‘‘కొత్త దర్శకుడినైనా... తొలిసారి కథ చెప్పగానే హీరో ఆది సినిమా చేయడానికి అంగీకరించారు. నాపై పూర్తి నమ్మకాన్ని కనబరిచారు సాయికుమార్. వారిద్దరూ అందించిన ప్రోత్సాహంతోనే ‘రఫ్’ సినిమాని అంత బాగా తీయగలిగాను. కమర్షియల్ అంశాలతో కూడిన మాస్ సినిమా చేయడమంటేనే నాకు ఇష్టం. తొలి ప్రయత్నంలోనే మంచి ఫలితాన్ని సాధించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు సీహెచ్ సుబ్బారెడ్డి. సహాయ దర్శకునిగా కెరీర్‌ని ఆరంభించిన ఆయన ‘రఫ్’తో దర్శకుడయ్యారు. ఆది, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా అభిలాష్ మాధవరం నిర్మాణంలో రూపొందిన ఆ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎమ్. సుదర్శన్‌రావు సమర్పించారు. చిత్ర దర్శకుడు సీహెచ్ సుబ్బారెడ్డితో ‘సాక్షి’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ వివరాలివీ... ఆ ఆలోచనలకు ప్రతిరూపమే ‘రఫ్’ తొమ్మండుగురు దర్శకుల దగ్గర పదకొండు చిత్రాలకు సహాయ దర్శకునిగా పనిచేశాను. ఆ అనుభవం నా తొలి సినిమాకి బాగా పనికొచ్చింది. ఎక్కడా ఇబ్బంది పడకుండా ‘రఫ్’ చిత్రాన్ని తెరకెక్కించగలిగానంటే కారణం అదే. ‘అశోక్’, ‘గుడుంబా శంకర్’ లాంటి చిత్రాలకు నేను సహాయ దర్శకునిగా పనిచేశాను. వాటి ప్రభావం నాపై ఎక్కువగా ఉంటుంది. అందుకే మాస్ సినిమాల్ని చేయడానికే ఇష్టపడుతుంటాను. ఆ ఆలోచనలకి ప్రతిరూపమే ‘రఫ్’. అందరూ కలిసి చూసేలా ఉండాలని కథ రాసుకున్నా. అభిలాష్ మాధవరం కథని నమ్మి ఈ సినిమా నిర్మించారు. కమర్షియల్‌గా సినిమా మంచి ఫలితాన్ని సాధించిందంటే కారణం నిర్మాతే. బి, సి కేంద్రాల్లో చిత్రానికి లభిస్తున్న స్పందన చాలా బాగుంది. యాక్షన్, వినోదం, కుటుంబ అనుబంధాలు... ఇలా అన్నీ ఒక సినిమాలో కుదరడం అరుదుగా జరుగుతుంటుంది. మొత్తంగా ‘రఫ్’ రూపంలో ఒక మంచి సినిమా చేశామన్న తృప్తి లభించింది. శ్రీహరి నన్ను మెచ్చుకున్నారు! సినిమా కోసం ఆది పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. రెండేళ్ల ప్రయాణంలో ఆయన ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఎనిమిది నెలలు కష్టపడి సిక్స్ ప్యాక్ చేశారు. ఆ సన్నివేశాల్లో ఆది నటనకు ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు. ఆదిలోని మాస్ హీరోని బయటికి చూపించగలిగాను. ఆయన ఈ సినిమా కోసం పడిన కష్టం వృథా కాలేదు. శ్రీహరి గారు మరో పిల్లర్‌లా ఈ సినిమాని మోశారు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తర్వాత మళ్లీ అంత మంచి పాత్ర ఇచ్చావ్... అంటూ ఆయన నన్ను మెచ్చుకొంటూ, ప్రోత్సహిస్తూ ఈ సినిమా చేశారు. ఆయన సలహాలతోనే ఈ సినిమా బయటకు రాగలిగింది. మేం స్విట్జర్లాండ్‌లో పాటలు చిత్రీకరించాలని వెళుతుంటే... శ్రీహరి గారు ఇంటికి పిలిపించి ‘ముందు నాపై సన్నివేశాలు తీయండి, ఆ తర్వాత స్విట్జర్లాండ్‌కి వెళ్లండి’ అని చెప్పారు. దీంతో ముందుగా ఆయన సన్నివేశాల్ని తీశాం. ఈ రోజు శ్రీహరి గారు మా మధ్య లేకపోవడం బాధగా ఉంది. ఆయనలా స్టయిలిష్‌గా తీశానంటున్నారు! నేను ఎవరి దగ్గరైతే పని చేశానో వారందరి ప్రభావం నాపై చాలా ఉంది. ‘రఫ్’ చూసినవాళ్లు ‘మీ గురువు సురేందర్ రెడ్డిలా స్టైలిష్ సినిమా తీశావ్’ అని కొద్దిమంది అన్నారు. ఆ కామెంట్ నాకు తృప్తినిచ్చింది. ఏదైతే అనుకొన్నామో అది పక్కాగా తెరపైకి తీసుకురావాలనేది నా అభిమతం. అందుకోసం ఎంతైనా కష్టపడతాను. తర్వాత కూడా ‘రఫ్’ లాంటి కమర్షియల్ సినిమాలే చేస్తాను. రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే నా రెండో చిత్రం వివరాల్ని ప్రకటిస్తా. -
భవిష్యత్తులో ఎలాంటి సినిమానైనా నిర్మించగలననే ధైర్యాన్నిచ్చింది రఫ్
‘‘క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అటు యువతరానికీ, ఇటు కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా ఓ మంచి సినిమా తీయాలనుకున్నాం. ‘రఫ్’తో ఆ ప్రయత్నం నెరవేరినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు అభిలాష్ మాధవరం. శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం ‘రఫ్’. ఆది, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటించారు. సీహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వం వహించారు. యమ్. సుదర్శన్‌రావు సమర్పకుడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి ప్రారంభ వసూళ్లను తెచ్చిపెట్టిందంటున్న అభిలాష్ మాధవరంతో ‘సాక్షి’ ముచ్చటించింది. ఆ విషయాలివి... మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘రఫ్’. కథలో అందరినీ అలరించే అంశాలున్నాయి. అందుకే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. బి, సి కేంద్రాల్లో సినిమాకి చక్కటి ఆదరణ దక్కుతోంది. మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు ఇదొక యావరేజ్ సినిమానే అయినప్పటికీ...వాళ్లు కూడా ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తున్నారు. మౌత్ టాక్‌తో ఇంకా వసూళ్లు పెరుగుతాయని మా నమ్మకం. దర్శకుడు సుబ్బారెడ్డి ఎక్కడా తడబాటు లేకుండా ఎంతో అనుభవమున్న దర్శకుడిలా చిత్రాన్ని తీర్చిదిద్దారు. కథని నమ్మి చేసిన చిత్రమిది. దర్శకుడు తొలిసారి కథ చెప్పినప్పుడే సినిమాపై మాకు నమ్మకం కలిగింది. ఆయన ఏం చెప్పాడో అదే తెరపైకి తీసుకొచ్చాడు. ఆది, రకుల్ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రెండేళ్ల ప్రయాణం ఈ సినిమా. నిర్మాతగా నాకు ఇదే తొలి చిత్రం. చాలా ఆటుపోట్లు ఎదురయ్యాయి. కానీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా చిత్రాన్ని పూర్తి చేశాం. నిర్మాతగా ఒక మంచి అనుభవాన్నిచ్చిందీ సినిమా. భవిష్యత్తులో ఎలాంటి సినిమానైనా నిర్మించగలననే ధైర్యాన్నిచ్చింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందించిన సహకారం ఎప్పటికీ మరచిపోలేను. మణిశర్మ, సెంథిల్ కుమార్, అరుణ్ కుమార్ లాంటి సాంకేతిక బృందంతో కలిసి మేం పనిచేశామని చెప్పుకోవడం కంటే... వాళ్ల నుంచి చాలా నేర్చుకున్నానని చెబుతాను. సినిమా కోసం ఆది పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఎనిమిది నెలల పాటు తను కఠోరంగా శ్రమించి సిక్స్ ప్యాక్ చేశాడు. తన ప్రతిభా పాటవాలన్నీ ఈ సినిమా కోసం ఉపయోగించాడు. ‘‘సినిమా పరిశ్రమతో నాకు అనుబంధమేమీ లేదు. కేవలం అభిరుచే ఇటు వైపు తీసుకొచ్చింది. నేను స్విట్జర్లాండ్‌లో బిజినెస్ అండ్ ఫైనాన్స్‌లో డిగ్రీ చేశాను. ఆ సమయంలో ఇండియన్ సినిమా గురించి ఓ థీసిస్ సమర్పించాను. ‘సినిమా ఇన్వెస్ట్మెంట్ అండ్ రిటర్న్’ అనే అంశంపై కొంచెం పరిశోధన చేశాను. ఆ సమయంలోనే సినిమాపై మరింత ప్రేమ పెరిగింది. దీంతో సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టా. ప్రస్తుతం ‘రఫ్’ హడావుడిలోనే ఉన్నాం. తదుపరి సినిమా కోసం రెండు కథలు సిద్ధం చేశాం. ఒకటి కుటుంబ కథ, మరొకటి ఆఫ్ బీట్ సినిమా చేయబోతున్నాం. -
అలరిస్తున్న రఫ్ ఆడియో
-
రఫ్ ఆడిస్తా టిమ్‌తో చిట్‌చాట్
-
నేను తెలుగులో ఒప్పుకున్న తొలి చిత్రం రఫ్!
రెండు మూడు నెలలకో సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్నారు రకుల్ ప్రీత్‌సింగ్. అటు అందంతోనూ, ఇటు అభినయంతోనూ అదరగొడుతున్నారు రకుల్. ముఖ్యంగా ఆమె అందం కుర్రకారుకు తెగ నచ్చేసింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘లౌక్యం’, ‘కరెంటు తీగ’ సినిమాలతో సందడి చేసిన రకుల్ ఇప్పుడు ‘రఫ్’ ఆడించేందుకు సిద్ధమయ్యారు. ఆది, రకుల్ జంటగా నటించిన చిత్రమే ‘రఫ్’. సీహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వం వహించారు. అభిలాష్ మాధవరం నిర్మాత. ఈ నెల 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్‌సింగ్ ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విషయాలివీ... సినిమాలో ‘రఫ్’ ఆడించేది మీరేనా? ఇందులో రఫ్ ఆడించే వ్యక్తులు ముగ్గురు. ఆది, నేను, శ్రీహరి గారు. మా ముగ్గురి చుట్టూనే కథ సాగుతుంటుంది. ఇందులో మీరు పోషించిన పాత్ర గురించి చెబుతారా? నా పాత్ర పేరు నందు. బాగా డబ్బున్న అమ్మాయిని. సాటివారికి సాయం చేయాలనే మనస్తత్వమున్న ఓ అందమైన అమ్మాయి పాత్ర ఇది. చిన్న పిల్లలంటే ప్రాణం. అలాంటి అమ్మాయి జీవితంలోకి ఓ అబ్బాయి ఎలా ప్రవేశించాడనేది తెరపైనే చూడాలి. ఈ సినిమాతోనూ సక్సెస్ ఖాయమంటారా? తప్పకుండా. నా విజయపరంపరని కొనసాగించే చిత్రం అవుతుంది ‘రఫ్’. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. తెలుగులో నేను ఒప్పుకున్న తొలి చిత్రమిదే. కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడంతో ఇప్పుడు విడుదలవుతోంది. కథపై నమ్మకంతో ఈ సినిమా చేశాను. ప్రేక్షకుల్ని అలరించే అన్ని అంశాలూ ఈ సినిమాలో ఉన్నాయి. ఆదితో కలిసి తెరను పంచుకోవడం ఎలా అనిపించింది? చాలా బాగుంది. తను మంచి కోస్టార్. నాకు అడుగడుగునా అండగా నిలిచాడు. తెలుగులో నేను చేసిన తొలి చిత్రమిదే కాబట్టి, సెట్లోకి అడుగుపెట్టినప్పుడు భాష తెలియక అంతా గందరగోళంగా అనిపించేది. అప్పుడు ఆది నాకు సాయం చేశాడు. డైలాగ్స్‌కి అర్థాలు చెబుతూ తెలుగు నేర్పించే ప్రయత్నం చేశాడు. తను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. సిక్స్‌ప్యాక్ చేశాడు. మా డాన్సులు కూడా బాగుంటాయి. శ్రీహరి సార్‌తో కలిసి తెరను పంచుకోవడం మరచిపోలేని విషయం. దర్శకుడు సుబ్బారెడ్డికి ఇదే తొలి చిత్రమైనా ప్రతీ విషయంలోనూ స్పష్టత ప్రదర్శిస్తూ సినిమాను చాలా బాగా తీశాడు. సెంథిల్, మణిశర్మలాంటి టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పనిచేశారు. అలాగే నిర్మాణ విలువలు కూడా అడుగడుగునా కనిపిస్తుంటాయి. నిర్మాత అభిలాష్ మాధవరం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని తెరకెక్కించారు. (శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం ‘రఫ్’. అభిలాష్ మాధవరం నిర్మాత. యమ్. సుదర్శన్ రావు సమర్పిస్తున్నారు. 28న సినిమాని విడుదల చేస్తున్నారు). -
అప్పుడు రకుల్‌ని వద్దనుకున్నాం : ఆది
‘‘ఏ పాత్రనైనా చేయగలనని నిరూపించుకోవడంతో పాటు.. హీరో అని మాత్రమే కాకుండా ‘స్టార్’ అనిపించుకోవాలన్నదే నా లక్ష్యం. దానికోసం ఎంత కష్టపడటానికైనా వెనకాడను’’ అని హీరో ఆది అన్నారు. ‘ప్రేమ కావాలి’ నుంచి ‘గాలిపటం’ వరకు ఆది చేసిన చిత్రాలు తనకు ‘లవర్ బోయ్’ ఇమేజ్‌ని తెచ్చాయి. ‘రఫ్’లో లవర్ బోయ్‌గా మాత్రమే కాదు.. మాస్‌గా కనిపించనున్నారు. ఆది, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సుబ్బారెడ్డి దర్శకత్వంలో సుదర్శనరావు మాధవరం సమర్పణలో అభిలాష్ మాధవరం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆది మనోభావాలు ఈ విధంగా... ఈ చిత్రంలో నా పాత్రలో మాస్ టచ్ ఉంటుంది. లవర్‌బోయ్‌గా, యాక్షన్ హీరోగా కనిపిస్తాను. సినిమా మొత్తం ఆసక్తికరంగా ఉంటుంది. తదుపరి సీన్ ఏంటి? అని ఎవరూ ఊహించలేరు. స్క్రీన్‌ప్లే అంత పకడ్బందీగా ఉంటుంది. లవర్‌బోయ్ ఇమేజ్ మార్చుకోవాలనే టార్గెట్‌తోనే ఈ చిత్రం ఎంపిక చేయలేదు. ఎవరైనాసరే వాళ్లల్లో ఉన్న ప్లస్ పాయింట్స్‌ని హైలైట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. నేను డాన్సులు, ఫైట్స్ బాగా చేయగలను. అందుకని ఈ రెండింటికీ ప్రాధాన్యం ఉన్న చిత్రంలో చేయాలనుకున్నా. నా గత చిత్రాలు ‘ప్యార్ మే పడిపోయానె’, ‘గాలిపటం’లో ఫైట్స్‌కి స్కోప్ దొరకలేదు. దాంతో ‘లవ్, యాక్షన్ మూవీస్ చేస్తే బాగుంటుంది’ అని నాన్నగారికి, నాకు ఫోన్స్ వచ్చాయి. ఆ మాటలను దృష్టిలో పెట్టుకుని ‘రఫ్’ని ఎంపిక చేసుకున్నా. ఓ మంచి కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ చిత్రంతో ఆ బ్రేక్ వస్తుందనే నమ్మకం ఉంది. ఇందులో ఐదారు ఫైట్స్ ఉన్నాయి. వీటిలో వైజాగ్‌లో తీసిన ఫైట్ చాలా భారీగా ఉంటుంది. దానికి నిర్మాణ వ్యయం కూడా ఎక్కువే అయ్యింది. క్లయిమాక్స్ ఫైట్ దాన్ని మించి ఉండాలనుకున్నాం. అందుకే సిక్స్ ప్యాక్ చేశాను. ఈ ప్యాక్‌కి ఎనిమిది, తొమ్మిది నెలలు పట్టింది. షూటింగ్ ఆలస్యం కావడానికి ఇదొక కారణం. సుబ్బారెడ్డి ఈ కథ చెప్పిన తీరు చూసి, తను బాగా తెరకెక్కిస్తాడనే నమ్మకం కలిగింది. ఆ నమ్మకం నిజమైంది. ఇప్పటివరకు నేను చేసిన చిత్రాలన్నిటికన్నా నిర్మాణ వ్యయం పరంగా పెద్ద సినిమా ఇది. నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. ఈ చిత్రానికి మణిశర్మగారు పాటలు స్వరపరచిన విషయం తెలిసిందే. ‘అందరి హీరోలతో నాకు హిట్స్ ఉన్నాయి. నీతో కూడా ఓ హిట్ వస్తే లెక్క సరిపోతుంది’ అన్నారు. ఆయన అన్నట్లుగానే పాటలు హిట్టయ్యాయి. రీ-రికార్డింగ్ అయితే బ్రహ్మాండంగా చేశారు. సెంథిల్, అరుణ్‌కుమార్ వంటి గొప్ప టెక్నీషియన్స్ పనిచేయడం ఈ చిత్రానికి ప్లస్ అయ్యింది. నా చిత్రాలపరంగా నేనెంత శ్రద్ధ వహిస్తానో నాన్నగారు కూడా అంతే శ్రద్ధ వహిస్తారు. సినిమా ఎలా వస్తోందో తెలుసుకుంటారు. విడుదలయ్యాక రిపోర్ట్ ఎలా ఉందో ఫోన్ చేసి, అడుగుతుంటారు. నా సినిమా హిట్టయితే నాన్న కళ్లల్లో కనిపించే ఆనందం చూసి, ఎగ్జయిట్ అవుతాను. అందుకే, నాన్న కళ్లల్లో ఆనందం చూడటం కోసం ఈ సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నా. ‘ప్రేమ కావాలి’లో నా సరసన రకుల్ ప్రీత్ సింగే నటించాల్సి ఉంది. కానీ, అప్పుడు తనింకా చదువుకుంటోంది. వరుసగా డేట్స్ ఇవ్వలేని పరిస్థితిలో తనుండటంతో వద్దనుకున్నాం, ఇప్పుడీ చిత్రానికి మా జంట కుదిరింది. వరుస విజయాలతో రకుల్ యూత్‌కి బాగా దగ్గరైంది. ఈ సినిమా ఓపెనింగ్స్‌కి తన క్రేజ్ కూడా ఉపయోగపడుతుందంటే అతిశయోక్తి కాదు. -
పూర్తి భిన్నంగా...
‘‘ఈ చిత్రకథ వినగానే, మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం కుదిరింది. తొలి కాపీ చూశాక ఆ నమ్మకం రెట్టింపైంది. ఆది కెరీర్లోనే పెద్ద హిట్‌గా నిలుస్తుంది’’ అని నటుడు సాయికుమార్ చెప్పారు. ఆది, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సీహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘రఫ్’. సుదర్శనరావు మాధవరం సమర్పణలో అభిలాష్ మాధవరం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆది మాట్లాడుతూ - ‘‘ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. సినిమాలో లేని ఒక పాటను త్వరలో విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఆది అద్భుతంగా నటించాడనీ, మణిశర్మ, సెంథిల్‌కుమార్, అరుణ్‌కుమార్ వంటి గొప్ప సాంకేతిక నిపుణులు పని చేయడం ఈ చిత్రానికి ప్లస్ అని దర్శకుడు తెలిపారు. సుబ్బారెడ్డిగారు ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కించారనీ, విజయంపై పూర్తి నమ్మకం ఉందని నిర్మాత అన్నారు. ఆదితో తనకిది మొదటి చిత్రమనీ, ఇందులో మంచి పాత్ర చేశానని కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు. -
అదే ఆదికి వచ్చి ఉంటుంది : సూర్య
‘‘బాక్సింగ్‌లో కిందపడితే ఓడిపోయినట్లు కాదు. లేవలేనప్పుడే నిజంగా ఓడిపోయినట్లు. అలా లేచి నిలబడిన తర్వాత ఇచ్చే రఫ్ పంచ్ విజయానికి కారణం అవుతుంది. ఆ పంచ్లా ఈ ‘రఫ్’ సక్సెస్ కావాలి. ఫైట్ మాస్టర్ పాండ్యన్ దగ్గర ఆది, కార్తీ శిక్షణ తీసుకుంటున్నప్పుడు చూసేవాణ్ణి. చాలా కష్టపడి నేర్చుకునేవాడు. ఈ ప్రచార చిత్రాలు ఆదిలోని ఎనర్జీని, ప్రతిభను తెలియజేస్తున్నాయి. డైలాగ్స్ చెప్పడంలో సాయికుమార్‌గారు స్పెషలిస్ట్. అదే ఆదికి వచ్చి ఉంటుంది’’ అని హీరో సూర్య అన్నారు. ఆది, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఎమ్. సుదర్శనరావు మాధవరం సమర్పణలో అభిలాష్ మాధవరం నిర్మించిన చిత్రం ‘రఫ్’. సీహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ పాటలు స్వరపరిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న సూర్య పాటల సీడీని ఆవిష్కరించి, దర్శకుడు వంశీ పైడిపల్లికి ఇచ్చారు. ప్రచార చిత్రాలను బోయపాటి శ్రీను ఆవిష్కరించారు. ఈ వేడుకలో అతిథులుగా పాల్గొన్న రానా, ‘అల్లరి’ నరేశ్, నితిన్, దశరథ్, సంపత్ నంది, వీరభద్రం, కేవీవీ సత్యనారాయణ తదితరులు చిత్రబృందానికి శుభాకాంక్షలందజేశారు. ఆది మాట్లాడుతూ -‘‘సూర్యగారు ఈ వేడుకకు రావడం, మణిశర్మగారు స్వరపరచిన పాటలకు డాన్స్ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్’’ అని దర్శక, నిర్మాతలు చెప్పారు. సాయికుమార్ మాట్లాడుతూ - ‘గతంలో సూర్య తండ్రి శివకుమార్ చేసిన పాత్రలకు డబ్బింగ్ చెప్పేవాణ్ణి, నేను డబ్బింగ్ మానేసిన తర్వాత సూర్య హీరో అయ్యారు. లేకపోతే ఆయనక్కూడా చెప్పి ఉండేవాణ్ణి. ఈ చిత్రం ఆదికి కమర్షియల్ హీరోగా మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
రఫ్ ఆడించే యాక్షన్
ఆది, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రఫ్’. సి.హెచ్.సుబ్బారెడ్డి దర్శకుడు. అభిలాష్ మాధవరం నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఆది నటిస్తున్న పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇటీవలే విడులైన టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది. మణిశర్మ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలందించారు. నవంబర్ 2న పాటల వేడుకను ఘనంగా జరుపనున్నాం’’ అని తెలిపారు. నటునిగా ఆదిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ఈ సినిమా... అతని కెరీర్లో ఓ మైలురాయిలా నిలుస్తుందని దర్శకుడు నమ్మకం వెలిబుచ్చారు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, కెమెరా: సెంథిల్ కుమార్, అరుణ్‌కుమార్, కూర్పు: మార్తాండ్ కె. వెంకటేశ్. -
‘రఫ్’ కుర్రాడి రొమాన్స్
ఇప్పటివరకు చేసిన చిత్రాల ద్వారా లవర్‌బోయ్‌లా కనిపించిన ఆది, ఈసారి రఫ్‌గా కనిపించనున్నారు. ఆది, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా ‘రఫ్’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రంలో శ్రీహరి ప్రత్యేక పాత్ర పోషించారు. ఎమ్. సుదర్శనరావు సమర్పణలో శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సీహెచ్. సుబ్బారెడ్డి దర్శకత్వంలో అభిలాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఓ కొత్త కోణంలో ఆది కనిపించబోతున్న సినిమా ఇది. ఇటీవల స్విట్జర్లాండ్‌లో రెండు పాటలు చిత్రీకరించాం’’ అని చెప్పారు. ‘‘బుల్లెట్‌లాంటి కుర్రాడి కథ ఇది. టైటిల్ ‘రఫ్’ అయినప్పటికీ కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటుంది. ఒక పాట మినహా ఈ సినిమా పూర్తయ్యింది. ఈ నెలలోనే పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, సంగీతం: మణిశర్మ, కెమెరా: సెంథిల్‌కుమార్. -
‘రఫ్’ ఆడించే కుర్రాడు ప్రేమలో పడితే..!
కోపం వస్తే రఫ్ ఆడించే కుర్రాడు ఓ అందమైన అమ్మాయితో ప్రేమలో పడతాడు. ప్రేమ కోసం ఎంతకైనా తెగించే తత్త్వం అతనిది. ఇంతకూ అతని ప్రేమకు అడ్డుపడింది ఎవరు? వారిని అతనేం చేశాడు? ఈ నేపథ్యంలో ఆది హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘రఫ్’. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. సీహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వంలోశ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాధవరం అభిలాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఆది మాట్లాడుతూ -‘‘నా గత చిత్రాలతో పోలిస్తే మ్యూజికల్‌గా పెద్ద హిట్ అవుతుంది. మణిశర్మ మంచి సంగీతాన్నిచ్చారు’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలో శ్రీహరిది కీలకపాత్ర. ఆయన మీద 23 సీన్లు తీశాం’’ అని తెలిపారు. సినిమా పూర్తి కావచ్చిందని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సెంథిల్‌కుమార్, అరుణ్‌కుమార్, మాటలు: మరుధూరి రాజా.