ప్రతి అక్కా... తమ్ముడూ చూడాల్సిన సినిమా
‘‘నా కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమా ‘రఫ్’. రెండో వారం కూడా వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ విజయానికి కారణం నిర్మాత అభిలాష్. సినిమాపై నమ్మకంతో భారీ పబ్లిసిటీ ఇచ్చి... నైజాంలో స్వయంగా ఆయనే 130 థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు’’ అని ఆది అన్నారు. ఆది, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా సి.హెచ్.సుబ్బారెడ్డి దర్శకత్వంలో అభిలాష్ మాధవరం నిర్మించిన చిత్రం ‘రఫ్’. ఈ చిత్రం సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆది మాట్లాడారు. ‘‘దర్శకుడు సుబ్బారెడ్డి నన్ను చాలా కొత్తగా ప్రెజెంట్ చేశాడు.
ఈ సినిమాలో నేను అందంగా కనబడ్డానంటే కారణం కెమెరామేన్ సెంథిల్. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. ఇందులో శ్రీహరి అసిస్టెంట్‌గా శివారెడ్డి ఆకట్టుకున్నారు. ఇంత మంచి సందర్భంలో శ్రీహరిగారు లేకపోవడం బాధాకరం’’ అని ఆవేదన వెలిబుచ్చారు ఆది. వరుసగా సినిమాలు తీస్తూ, ఇదే రంగంలో కొనసాగాలనే భావనను ఈ సినిమా విజయం తనకు కలిగించిందని నిర్మాత అభిలాష్ అన్నారు. ‘‘ప్రతి అక్కా, తమ్ముడూ చూడాల్సి సినిమా ఇది. ఎన్నో అవరోధాలను అధిగమించి ఈ చిత్రాన్ని విడుదల చేశాం.
శ్రీహరిగారు చనిపోవడంతో ఈ సినిమాపై ఆశలు వదులుకున్నాం. కానీ... నిర్మాత అభిలాష్ భుజం తట్టి ముందుకు నడిపించారు. లవర్‌బోయ్ ఆదితో మాస్ ఎంటర్‌టైనర్ ఏంటి? అన్న వాళ్లందరికీ ఈ సినిమా వసూళ్లే సమాధానాలు’’ అని దర్శకుడు చెప్పారు. ప్రేక్షకుల మధ్య కూర్చొని ఈ సినిమా చూశాననీ, పాటలకు, డైలాగులకు మంచి స్పందన లభిస్తోందని రకుల్ ప్రీత్‌సింగ్ చెప్పారు. ఈ మధ్య కాలంలో కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న సినిమా ఇదేనని శివారెడ్డి అన్నారు. ఇంకా కాశీవిశ్వనాథ్, దిల్ రమేశ్ కూడా మాట్లాడారు.