అప్పుడు రకుల్‌ని వద్దనుకున్నాం : ఆది
‘‘ఏ పాత్రనైనా చేయగలనని నిరూపించుకోవడంతో పాటు.. హీరో అని మాత్రమే కాకుండా ‘స్టార్’ అనిపించుకోవాలన్నదే నా లక్ష్యం. దానికోసం ఎంత కష్టపడటానికైనా వెనకాడను’’ అని హీరో ఆది అన్నారు. ‘ప్రేమ కావాలి’ నుంచి ‘గాలిపటం’ వరకు ఆది చేసిన చిత్రాలు తనకు ‘లవర్ బోయ్’ ఇమేజ్‌ని తెచ్చాయి. ‘రఫ్’లో లవర్ బోయ్‌గా మాత్రమే కాదు.. మాస్‌గా కనిపించనున్నారు. ఆది, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సుబ్బారెడ్డి దర్శకత్వంలో సుదర్శనరావు మాధవరం సమర్పణలో అభిలాష్ మాధవరం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆది మనోభావాలు ఈ విధంగా...
ఈ చిత్రంలో నా పాత్రలో మాస్ టచ్ ఉంటుంది. లవర్‌బోయ్‌గా, యాక్షన్ హీరోగా కనిపిస్తాను. సినిమా మొత్తం ఆసక్తికరంగా ఉంటుంది. తదుపరి సీన్ ఏంటి? అని ఎవరూ ఊహించలేరు. స్క్రీన్‌ప్లే అంత పకడ్బందీగా ఉంటుంది. లవర్‌బోయ్ ఇమేజ్ మార్చుకోవాలనే టార్గెట్‌తోనే ఈ చిత్రం ఎంపిక చేయలేదు. ఎవరైనాసరే వాళ్లల్లో ఉన్న ప్లస్ పాయింట్స్‌ని హైలైట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. నేను డాన్సులు, ఫైట్స్ బాగా చేయగలను. అందుకని ఈ రెండింటికీ ప్రాధాన్యం ఉన్న చిత్రంలో చేయాలనుకున్నా. నా గత చిత్రాలు ‘ప్యార్ మే పడిపోయానె’, ‘గాలిపటం’లో ఫైట్స్‌కి స్కోప్ దొరకలేదు. దాంతో ‘లవ్, యాక్షన్ మూవీస్ చేస్తే బాగుంటుంది’ అని నాన్నగారికి, నాకు ఫోన్స్ వచ్చాయి. ఆ మాటలను దృష్టిలో పెట్టుకుని ‘రఫ్’ని ఎంపిక చేసుకున్నా.
ఓ మంచి కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ చిత్రంతో ఆ బ్రేక్ వస్తుందనే నమ్మకం ఉంది. ఇందులో ఐదారు ఫైట్స్ ఉన్నాయి. వీటిలో వైజాగ్‌లో తీసిన ఫైట్ చాలా భారీగా ఉంటుంది. దానికి నిర్మాణ వ్యయం కూడా ఎక్కువే అయ్యింది. క్లయిమాక్స్ ఫైట్ దాన్ని మించి ఉండాలనుకున్నాం. అందుకే సిక్స్ ప్యాక్ చేశాను. ఈ ప్యాక్‌కి ఎనిమిది, తొమ్మిది నెలలు పట్టింది. షూటింగ్ ఆలస్యం కావడానికి ఇదొక కారణం.
సుబ్బారెడ్డి ఈ కథ చెప్పిన తీరు చూసి, తను బాగా తెరకెక్కిస్తాడనే నమ్మకం కలిగింది. ఆ నమ్మకం నిజమైంది. ఇప్పటివరకు నేను చేసిన చిత్రాలన్నిటికన్నా నిర్మాణ వ్యయం పరంగా పెద్ద సినిమా ఇది. నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. ఈ చిత్రానికి మణిశర్మగారు పాటలు స్వరపరచిన విషయం తెలిసిందే. ‘అందరి హీరోలతో నాకు హిట్స్ ఉన్నాయి. నీతో కూడా ఓ హిట్ వస్తే లెక్క సరిపోతుంది’ అన్నారు. ఆయన అన్నట్లుగానే పాటలు హిట్టయ్యాయి. రీ-రికార్డింగ్ అయితే బ్రహ్మాండంగా చేశారు. సెంథిల్, అరుణ్‌కుమార్ వంటి గొప్ప టెక్నీషియన్స్ పనిచేయడం ఈ చిత్రానికి ప్లస్ అయ్యింది.
నా చిత్రాలపరంగా నేనెంత శ్రద్ధ వహిస్తానో నాన్నగారు కూడా అంతే శ్రద్ధ వహిస్తారు. సినిమా ఎలా వస్తోందో తెలుసుకుంటారు. విడుదలయ్యాక రిపోర్ట్ ఎలా ఉందో ఫోన్ చేసి, అడుగుతుంటారు. నా సినిమా హిట్టయితే నాన్న కళ్లల్లో కనిపించే ఆనందం చూసి, ఎగ్జయిట్ అవుతాను. అందుకే, నాన్న కళ్లల్లో ఆనందం చూడటం కోసం ఈ సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నా.
‘ప్రేమ కావాలి’లో నా సరసన రకుల్ ప్రీత్ సింగే నటించాల్సి ఉంది. కానీ, అప్పుడు తనింకా చదువుకుంటోంది. వరుసగా డేట్స్ ఇవ్వలేని పరిస్థితిలో తనుండటంతో వద్దనుకున్నాం, ఇప్పుడీ చిత్రానికి మా జంట కుదిరింది. వరుస విజయాలతో రకుల్ యూత్‌కి బాగా దగ్గరైంది. ఈ సినిమా ఓపెనింగ్స్‌కి తన క్రేజ్ కూడా ఉపయోగపడుతుందంటే అతిశయోక్తి కాదు.