lover boy
-
లవర్ బాయ్ తరుణ్ రీఎంట్రీ, ఈ సారి..
తరుణ్..టాలీవుడ్లో ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి లవర్ బాయ్‌గా పేరు పొందాడు. అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తొలి సినిమా ‘నువ్వే కావాలి’తో రికార్డులు సృష్టించి టాలీవుడ్ లవర్ బాయ్‌గా విశేష ప్రేక్షకాదరణ పొందాడు. 2000వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా.. అప్పట్లోనే 20 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించిదంటే తరుణ్‌కు ఉన్న క్రేజీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అత్యదిక ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో అప్పట్లో ఆ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ అందుకుంది. ఆ తర్వాత నువ్వులేక నేను లేను, నువ్వే నువ్వే వంటి సూపర్ హిట్ సినిమాలతోతరుణ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. తరుణ్ సినిమా అంటే మినిమమ్ గ్యారెంట్ అని నిర్మాతలకు గట్టి నమ్మకం ఉండేది. అయితే కొన్ని తొందరపాటు నిర్ణయాలతో ఈయన కెరీర్ దారుణంగా దిగజారిపోయింది. వరుసగా లవ్ స్టోరీలనే చేస్తూ రావడం తరుణ్‌కు మైనస్‌గా మారింది. వరస ప్లాప్స్ తో కెరీర్ లో వెనుకబడ్డాడు. తొలి ఏడేళ్లలో తరుణ్ నుంచి దాదాపు 14 సినిమాలు వస్తే.. ఆ తర్వాత 14 ఏళ్లలో ఈయన నుంచి 7 సినిమాలు కూడా రాలేదు. తరుణ్ చివరగా 2017లో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమా చేశాడు. అది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటంతో తరుణ్ తీవ్ర నిరాశ చెందాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాల జోలికి వెళ్లలేదు. చాలా గ్యాప్ తర్వాత తరుణ్ మళ్లీ వెండితెరపై మెరవబోతున్నాడు. నాలుగేళ్ళ అనంతరం తన స్నేహితుడితోనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. తన ఫ్రెండ్ రాసిన లవ్ స్టోరీ తరుణ్ కు బాగా నచ్చిందట. అంతేకాదు తరుణ్ ఈ సినిమాకు నిర్మాతగా మారనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి. ప్రస్తుతం తరుణ్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. -
లవర్‌బాయ్స్
-
ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడు ధర్నా
సాక్షి, నిజామాబాద్ : సాధారణంగా ప్రియులు, ప్రేమికులు తమను మోసం చేశారని అమ్మాయిలు, యువతులు ఆందోళనలు చేయడం.. ప్రియుడి ఇంటిముందు బైఠాయించడం ఇప్పటివరకు చూశాం. కానీ ఇక్కడ సీన్ రీవర్స్ అయింది. ఓ యువకుడు తనను ప్రియురాలు మోసం చేసిందని ధర్నాకు దిగాడు. తనను ప్రేమించి, పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చిన అమ్మాయి.. ఇప్పుడు ముఖం చాటేసిందని, ఆమెనే తాను పెళ్లి చేసుకుంటానంటూ ఏకంగా ఆమె ఇంటి ముందు ఆందోళన చేపట్టాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్లో చేటుచేసుకుంది. ఓ యువకుడు తనను మోసం చేసిందంటూ యువతి ఇంటి ముందు ధర్నాకు దిగాడు. తనను ప్రేమించిందని పేర్కొంటూ.. ఆమెతో దిగిన ఫొటోలు అందరికీ చూపించాడు. దీంతో యువతి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళారు. -
మళ్లీ లవర్‌బాయ్‌లా
‘సఖి’ సినిమాతో లవర్‌బాయ్‌లా యూత్ సెన్సేషన్ అయ్యారు హీరో మాధవన్. ఆ తర్వాత కొన్ని రొమాంటిక్ చిత్రాల్లో యాక్ట్ చేసినప్పటికీ తన ట్రాక్ మార్చుకున్నారు. డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు మాధవన్. అయితే ఇప్పుడు మళ్లీ ఓ లవ్ స్టోరీలో యాక్ట్ చేయనున్నారు మ్యాడీ. కొత్త దర్శకుడు దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ‘మారా’ చిత్రంలో రొమాంటిక్ హీరోగా దర్శనం ఇవ్వనున్నారట. ‘విక్రమ్ వేదా’లో మాధవన్ సరసన నటించిన శ్రద్ధా శ్రీనాథ్ ఇందులోనూ జోడీగా కనిపించనున్నారు. -
‘చెక్‌పోస్ట్’ చేతన్
-
జెమినీ గణేశన్‌గా..!
‘లవర్ బోయ్’ ఇమేజ్ను సొంతం చేసుకున్న అలనాటి హీరోల్లో ‘జెమినీ’ గణేశన్ ఒకరు. ఒకప్పుడు తమిళంలో హీరోగా ఓ రేంజ్లో దూసుకెళ్లిన ఆయన చనిపోయి పదేళ్లయినా, ఇప్పటికీ గుర్తుండిపోతారు. ఇప్పుడు జెమినీ గణేశన్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ఆయన పాత్రను చేసే అవకాశం యువ హీరో చేతన్ చీనూకి దక్కింది. ఇటీవల విడుదలైన ‘మంత్ర 2’లో నటించిన చేతన్ ప్రస్తుతం ‘రాజుగారి గది’, ‘చెక్‌పోస్ట్’ చిత్రాల్లో నటిస్తున్నారు. తమిళంలో జెమినీ గణేశన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘కాదల్ మన్నన్ జెమిని గణేశన్’ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈరోజు జరుపుకుంటున్న తన పుట్టినరోజుకి ఈ చిత్రం ఓ మంచి కానుక అవుతుందని చేతన్ చెప్పారు. -
బిజీ బిజీగా విజయ్ ఆదిక్
అర్హత, ఆసక్తి, నిరంతర ప్రయత్నంతో హీరో అయ్యానంటున్నారు వర్ధమాన నటుడు విజయ్ ఆదిక్. ఇటీవల విడుదలైన ఇరిడియం చిత్రం ద్వారా కథా నాయకుడిగా పరిచయమైన ఈయనను ప్రస్తుతం పలు అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఆ సంగతేంటో ఆయన మాటల్లోనే కోవైకు చెందిన నేను బీఈ, ఎంబీఏ చదివాను. అయితే నటన అంటే చాలా ఆసక్తి. చాలా కాలంగా ప్రయత్నించి ఎట్టకేలకు ఇరిడియం చిత్రం ద్వారా నా కలను నిజం చేసుకున్నాను. ఈ చిత్రంలో లవర్‌బాయ్‌గా మంచి పేరు తెచ్చుకున్నాను. ఆ చిత్రం చాలా అవకాశాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఎస్ ఆర్ సెల్వకుమార్ దర్శకత్వంలో నటుడు విజయకాంత్ అన్నయ్య కొడుకు రాజసిమ్మిన్ నిర్మిస్తున్న ఒరు కాదల్ ఒరు కల్యాణం చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నాను. ఇదే దర్శకుడి తదుపరి చిత్రంలో హీరోగా నటించనున్నాను. అదే విధంగా దర్శకుడు వళ్లియూర్ నంబిరాజన్ దర్శకత్వంలో హీరోగా నటించనున్నారు. నటనంటే ఇష్టం. హీరో అయినా రెండవ హీరో అయినా పాత్రలో దమ్ముంటే నటించడానికి సిద్ధమేనని విజయ్ ఆదిక్ అంటున్నారు. -
అప్పుడు రకుల్‌ని వద్దనుకున్నాం : ఆది
‘‘ఏ పాత్రనైనా చేయగలనని నిరూపించుకోవడంతో పాటు.. హీరో అని మాత్రమే కాకుండా ‘స్టార్’ అనిపించుకోవాలన్నదే నా లక్ష్యం. దానికోసం ఎంత కష్టపడటానికైనా వెనకాడను’’ అని హీరో ఆది అన్నారు. ‘ప్రేమ కావాలి’ నుంచి ‘గాలిపటం’ వరకు ఆది చేసిన చిత్రాలు తనకు ‘లవర్ బోయ్’ ఇమేజ్‌ని తెచ్చాయి. ‘రఫ్’లో లవర్ బోయ్‌గా మాత్రమే కాదు.. మాస్‌గా కనిపించనున్నారు. ఆది, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సుబ్బారెడ్డి దర్శకత్వంలో సుదర్శనరావు మాధవరం సమర్పణలో అభిలాష్ మాధవరం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆది మనోభావాలు ఈ విధంగా... ఈ చిత్రంలో నా పాత్రలో మాస్ టచ్ ఉంటుంది. లవర్‌బోయ్‌గా, యాక్షన్ హీరోగా కనిపిస్తాను. సినిమా మొత్తం ఆసక్తికరంగా ఉంటుంది. తదుపరి సీన్ ఏంటి? అని ఎవరూ ఊహించలేరు. స్క్రీన్‌ప్లే అంత పకడ్బందీగా ఉంటుంది. లవర్‌బోయ్ ఇమేజ్ మార్చుకోవాలనే టార్గెట్‌తోనే ఈ చిత్రం ఎంపిక చేయలేదు. ఎవరైనాసరే వాళ్లల్లో ఉన్న ప్లస్ పాయింట్స్‌ని హైలైట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. నేను డాన్సులు, ఫైట్స్ బాగా చేయగలను. అందుకని ఈ రెండింటికీ ప్రాధాన్యం ఉన్న చిత్రంలో చేయాలనుకున్నా. నా గత చిత్రాలు ‘ప్యార్ మే పడిపోయానె’, ‘గాలిపటం’లో ఫైట్స్‌కి స్కోప్ దొరకలేదు. దాంతో ‘లవ్, యాక్షన్ మూవీస్ చేస్తే బాగుంటుంది’ అని నాన్నగారికి, నాకు ఫోన్స్ వచ్చాయి. ఆ మాటలను దృష్టిలో పెట్టుకుని ‘రఫ్’ని ఎంపిక చేసుకున్నా. ఓ మంచి కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ చిత్రంతో ఆ బ్రేక్ వస్తుందనే నమ్మకం ఉంది. ఇందులో ఐదారు ఫైట్స్ ఉన్నాయి. వీటిలో వైజాగ్‌లో తీసిన ఫైట్ చాలా భారీగా ఉంటుంది. దానికి నిర్మాణ వ్యయం కూడా ఎక్కువే అయ్యింది. క్లయిమాక్స్ ఫైట్ దాన్ని మించి ఉండాలనుకున్నాం. అందుకే సిక్స్ ప్యాక్ చేశాను. ఈ ప్యాక్‌కి ఎనిమిది, తొమ్మిది నెలలు పట్టింది. షూటింగ్ ఆలస్యం కావడానికి ఇదొక కారణం. సుబ్బారెడ్డి ఈ కథ చెప్పిన తీరు చూసి, తను బాగా తెరకెక్కిస్తాడనే నమ్మకం కలిగింది. ఆ నమ్మకం నిజమైంది. ఇప్పటివరకు నేను చేసిన చిత్రాలన్నిటికన్నా నిర్మాణ వ్యయం పరంగా పెద్ద సినిమా ఇది. నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. ఈ చిత్రానికి మణిశర్మగారు పాటలు స్వరపరచిన విషయం తెలిసిందే. ‘అందరి హీరోలతో నాకు హిట్స్ ఉన్నాయి. నీతో కూడా ఓ హిట్ వస్తే లెక్క సరిపోతుంది’ అన్నారు. ఆయన అన్నట్లుగానే పాటలు హిట్టయ్యాయి. రీ-రికార్డింగ్ అయితే బ్రహ్మాండంగా చేశారు. సెంథిల్, అరుణ్‌కుమార్ వంటి గొప్ప టెక్నీషియన్స్ పనిచేయడం ఈ చిత్రానికి ప్లస్ అయ్యింది. నా చిత్రాలపరంగా నేనెంత శ్రద్ధ వహిస్తానో నాన్నగారు కూడా అంతే శ్రద్ధ వహిస్తారు. సినిమా ఎలా వస్తోందో తెలుసుకుంటారు. విడుదలయ్యాక రిపోర్ట్ ఎలా ఉందో ఫోన్ చేసి, అడుగుతుంటారు. నా సినిమా హిట్టయితే నాన్న కళ్లల్లో కనిపించే ఆనందం చూసి, ఎగ్జయిట్ అవుతాను. అందుకే, నాన్న కళ్లల్లో ఆనందం చూడటం కోసం ఈ సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నా. ‘ప్రేమ కావాలి’లో నా సరసన రకుల్ ప్రీత్ సింగే నటించాల్సి ఉంది. కానీ, అప్పుడు తనింకా చదువుకుంటోంది. వరుసగా డేట్స్ ఇవ్వలేని పరిస్థితిలో తనుండటంతో వద్దనుకున్నాం, ఇప్పుడీ చిత్రానికి మా జంట కుదిరింది. వరుస విజయాలతో రకుల్ యూత్‌కి బాగా దగ్గరైంది. ఈ సినిమా ఓపెనింగ్స్‌కి తన క్రేజ్ కూడా ఉపయోగపడుతుందంటే అతిశయోక్తి కాదు. -
బరువు తగ్గించిన బాక్సర్ పాత్ర
ఏ పాత్ర చేస్తే అందులోకి పరకాయ ప్రవేశం చేయడం మంచి కళాకారుడి లక్షణం. చాక్లెట్‌బోయ్ మాధవన్ ఈ కోవకే చెందుతారు. అందుకు తాజా ఉదాహరణగా త్వరలో ఆయన చేయనున్న ఓ చిత్రం గురించి చెప్పాలి. అమెరికన్ మాజీ బాక్సర్ మొహమ్మద్ అలీ జీవితానికి కొంత కాల్పనికత జోడించి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మణిరత్నం దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన సుధ కొంగర దర్శకత్వం వహించనున్నారు. ఇందులో అలీగా మాధవన్ నటించనున్నారు. ఇప్పటివరకు దాదాపు లవర్‌బోయ్ పాత్రలకు పరిమితమైన ఆయన ఈ శక్తిమంతమైన పాత్ర కోసం లాస్ ఏంజిల్స్‌లో కసరత్తులు చేస్తున్నారు. శారీరక దృఢత్వం, బాక్సింగ్‌లో శిక్షణ, ఓ బాక్సర్ శారీరక భాష ఎలా ఉంటుంది? అనే విషయాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ పాత్ర కోసం ఏకంగా 15 కిలోల బరువు తగ్గారు మాధవన్. అది మాత్రమే కాదు... తనను తాను ఓ బాక్సర్‌లా ఊహించుకుంటున్నారట. నడిచే తీరు, ఆలోచనా విధానం అన్నీ ఓ బాక్సర్లానే చేస్తున్నానని మాధవన్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి ‘లాల్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. -
‘స్టైల్‌కింగ్’గా గోల్డెన్‌స్టార్ గణేష్
ఫస్ట్‌లుక్ కు అనూహ్య స్పందన ఇప్పటి వరకు లవర్‌బాయ్‌గా కనిపిస్తూ, సాఫ్ట్ క్యారెక్టర్లతో శాండల్‌వుడ్ తెరపై తళుక్కుమన్న గోల్డెన్‌స్టార్ గణేష్ ఇప్పుడు తన స్టైల్‌ని మార్చుకున్నాడు. పూర్తి స్టైలిష్‌గా, కాస్తంత రఫ్‌గా తయారయ్యాడు. ‘స్టైల్‌కింగ్’ సినిమా ద్వారా సరికొత్త స్టైల్లో గణేష్ శాండల్‌వుడ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రముఖ దర్శకుడు పీసీ శేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, మారుతి జడియార్ ఈ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్, ఫస్ట్‌లుక్‌ను ఇటీవలే విడుదల చేశారు. కాస్తంత చెదిరిన జుట్టు, సరికొత్త స్టైల్లో గణేష్ కనిపించే ఈ ఫస్ట్‌లుక్‌కు అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇక ఈ సినిమాలో గణేష్ ద్విపాత్రాభినయం చేయనుండడంతో పాటు ఈ సినిమా గణేష్‌కి 25వ సినిమా కావడం మరో విశేషం. ఈ ట్రైలర్లో కేవలం గణేష్ ఒక పాత్రను మాత్రమే చూపించామని, మరో పాత్రను సినిమాలో చూడాల్సిందేనని దర్శకుడు శేఖర్ చెబుతున్నారు. దీంతో ‘స్టైల్‌కింగ్’లో మరో పాత్రలో గణేష్ ఎలా కనిపించనున్నారనే విషయంపై సినీ అభిమానుల్లో కుతూహలం పెరుగుతోంది. - సాక్షి, బెంగళూరు -
మలేసియాలో ప్రేమ
‘‘ఇప్పటివరకు లవర్‌బోయ్, కామన్ మేన్ పాత్రలు చేశాను. వాటికి భిన్నంగా ఇందులో ప్రతినాయక ఛాయలున్న పాత్ర చేశాను. శాటిలైట్ రైట్స్, బిజినెస్‌ని దృష్టిలో పెట్టుకుని కాకుండా నాణ్యత గల సినిమా చేయాలనే తపనతో చేశాం. సినిమా బాగా వచ్చింది’’ అని జై ఆకాష్ చెప్పారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ ఇన్ మలేసియా’. సంగీత, గెహనా వశిష్ట్, రమ్య నాయికలుగా ఈ చిత్రాన్ని గణేశ్ దొండి నిర్మించారు. సుమన్ జూపూడి స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. గణేశ్ దొండి మాట్లాడుతూ - ‘‘కథానుసారం ఎక్కువ శాతం షూటింగ్‌ని మలేసియాలో చేశాం. మంచి కథ, పాటలు, ఆకాశ్ డెరైక్షన్.. ఈ సినిమా విజయానికి దోహదపడతాయి’’ అని చెప్పారు. మంచి పాటలివ్వడానికి ఆస్కారం ఉన్న కథ ఇదని సంగీతదర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నరేశ్ .బి. -
అవి నాకు కిక్ ఇవ్వలేదు...
తమిళంలో లవర్ బోయ్... తెలుగులో పోలీస్‌మేన్... యువతుల మనసు దోచే పాత్రలు ఒకచోట... యువ హీరోలకు దీటైన పాత్రలు మరోచోట... శామ్ కెరీర్ ఇవాళ మూడు క్లాప్‌లు, ఆరు షాట్లతో ఓ ‘రేసుగుర్రం’... తమిళ, తెలుగు సినీ రంగాల్లో అభిమానులనూ, అభిమానించే అగ్ర దర్శకులనూ సంపాదించుకోవడం, బాక్సాఫీస్ విజయాలు అందుకోవడం ఏ నటుడికైనా ‘కిక్’ కాక మరేమిటి? శామ్కు... కాదు... కాదు... ‘కిక్’ శామ్కు తరగని ఆస్తి అదే. ఇంట్లో ఒప్పించి మరీ సినీ హీరో అయిన ఈ ఫుట్‌బాల్ ఆటగాడి మనసులోని మాటల కచ్చేరీలోని కిక్కే వేరప్పా! హాయ్.. నేను ‘కిక్’ శామ్ని. మీకు కిక్ ఇచ్చే విషయాలు చాలా చెప్పాలని ఉంది. ముందు నా గురించి చెబుతా. నా అసలు పేరు ‘షంషుద్దీన్ ఇబ్రహీం’. సినిమాల కోసం ‘శామ్’ అని మార్చేసుకున్నాను. తెలుగులో మాత్రం నేను చేసిన ‘కిక్’ నా ఇంటి పేరైపోయింది. తమిళ పరిశ్రమలో అందరూ నన్ను సున్నితమైన పాత్రల్లో చూడాలని కోరుకుంటారు. అందుకని ‘చాక్లెట్ బాయ్’ అంటారు. ఇక్కడేమో జోష్‌గా ‘కిక్ శామ్’ అని అంటారు. నేనిప్పటివరకు తెలుగులో ఆరేడు సినిమాల్లో నటించా. వాటిలో ఎక్కువగా సీరియస్‌గా ఉండే పోలీసు పాత్రలే. తమిళంలోనేమో సరదా సరదాగా ఉండే పాత్రలు చేస్తుంటా. ఏమైనా పోలీసు పాత్రలకు విరామం తీసుకోవాలనుకుంటున్నా. చేసిన పాత్రలే చేస్తే కిక్కేముంటుంది! అమ్మకు ఇష్టం లేదు! మీకో విషయం చెప్పనా? అసలు నేను సినిమా నటుణ్ణి కావాలనుకుంటున్నానని మా ఇంట్లో చెప్పినప్పుడు పెద్ద రాద్ధాంతమే చేశారు. మా అమ్మగారికి నేను సినిమాల్లోకి రావడం అస్సలిష్టం లేదు. నేను మంచి ఫుట్‌బాల్ ప్లేయర్‌ని. యూనివర్సిటీ ఆఫ్ బెంగళూరుకీ, స్పోర్ట్స్ క్లబ్స్కీ మా కాలేజ్ తరఫున ఆడేవాణ్ణి. ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు ‘మా ఇంట్లో మంచి క్రీడాకారుడున్నాడు’ అని మా అమ్మ గర్వంగా చెప్పుకునేది. నా ధ్యాస మాత్రం సినిమాల మీదే. అమ్మని ఒప్పించారు నాన్నగారు. కానీ, నేను నటుణ్ణి కాకముందే ఆయన పోయారు. అది నా దురదృష్టం. నాలుగేళ్లు తెగ తిరిగా! సినిమాల్లో అవకాశాల కోసం కొన్నాళ్లు మోడల్‌గా చేసి, ఆ తర్వాత సినిమాలకు ప్రయత్నం చేయ సాగా. పరిశ్రమలో నాకంటూ ఎవరూ లేకపోవడంతో అంత సులువుగా అవకాశాలు రాలేదు. నాలుగైదేళ్లు తెగ తిరిగా. చివరకు తమిళ దర్శ కుడు జీవా గారి దృష్టిలో పడ్డాను. ‘12 బి’ ద్వారా ఆయన నన్ను హీరోను చేశారు. ఆ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత కూడా ఆయన దర్శకత్వంలోనే ‘ఉళ్లమ్ కేక్కుదే’ సినిమా చేశాను. అదీ నా కెరీర్‌కు ఉపయోగపడింది. సినీ పరిశ్రమలో జీవా గారు నా గాడ్‌ఫాదర్. 2008లో ఆయన రష్యాలో గుండెపోటుతో చనిపోయారు. నాకైతే వెన్నెముక కోల్పోయినట్లనిపించింది. లవర్‌బోయ్‌గానే చేయమంటున్నారు కెరీర్‌పరంగా నాకెలాంటి అసంతృప్తీ లేదు. నాకు మహిళా అభిమానులెక్కువ. నేను గడ్డం, మీసాలతో కనిపిస్తే వాళ్లకు నచ్చడం లేదు. వాళ్ల ఇష్టాన్ని కాదనలేను. పరిశ్రమకు వచ్చి పదేళ్లయినా ఇంకా లవర్‌బోయ్‌గా చేయాలంటే నాకు బోర్ కొట్టేస్తోంది. అందుకే అప్పుడప్పుడూ యాక్షన్ సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఈ క్రమంలోనే నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించుకోవాలనుకున్నాను. నేనిష్టపడే పాత్రలు చేయడం కోసం స్వీయ చిత్ర నిర్మాణ సంస్థను మొదలుపెట్టాను. ‘6’ సినిమా నిర్మించి, నటించాను. నాలుగైదు కోట్ల బడ్జెట్‌తో ఆ సినిమా తీశాను. లాభం రాలేదు.. నష్టం కూడా తేలేదు. అయితే, ఆ సినిమాతో డబ్బు కన్నా పేరు బాగా వచ్చింది. ఆనందంగా ఉన్నా! తమిళంలో హీరోగా, తెలుగులో కీలక పాత్రలు చేస్తూ ఆనందంగా ఉన్నా. వాస్తవానికి ‘కిక్’ తర్వాత తెలుగులోసోలో హీరోగా చేసి ఉండ వచ్చు. కానీ, వచ్చిన అవకాశాలు అంత కిక్ ఇవ్వలేదు. అందుకే, కీలక పాత్రలకే పరిమితమయ్యా. ప్రేమ వివాహం నాది ప్రేమ వివాహం. నేను ముస్లిమ్. నా భార్య పంజాబీ హిందువు. పేరు - కామ్నా. ‘పంజాబీ అమ్మాయి కోడలుగా వస్తే, ఆమెతో ఏ భాషలో మాట్లాడాలిరా.. మన కుటుంబంతో తను సర్దుకు పోగలుగుతుందా? మన సంప్రదాయాలు వేరు, తనవి వేరు’ అని అమ్మ ససేమిరా అంది. కానీ, చివరకు ఒప్పించాను. ఇప్పుడు మా అమ్మ, నా భార్యతల్లీకూతుళ్లలా ఉంటున్నారు. నాకో వెసులుబాటు ఏమిటంటే.. ఉత్తరాది వంటకాలు తినాలంటే మా ఆవిడ, దక్షిణాది వంటకాలంటే మా అమ్మ చేస్తారు. పెళ్లికి ముందే మేము ఒకరినొకరం పూర్తిగా అర్థం చేసుకోవడంతో పెళ్లి తర్వాత మా జీవితం సాఫీగా సాగుతోంది. ‘సినిమాలు తప్ప వేరే దేని మీదా ఆసక్తి కనబరచడు’ అనే నమ్మకం కామ్నాకి ఉంది. ఎలాంటి పరిస్థితిలోనూ చేయి వదలననే నమ్మకం ఆమెకు ఉంది. వైవాహిక జీవితం సజావుగా సాగాలంటే భార్యాభర్తల మధ్య ‘నమ్మకం’ అవసరం. మేమిద్దరం... మాకిద్దరు పిల్లలున్నారు. పెద్దమ్మాయి పేరు సమైరా. రెండో పాప పేరు కియారా. సమైరా ఒకటో తరగతి చదువుతోంది. కియారాకి రెండేళ్లు. అందరూ మారతారో లేదో నాకు తెలియదు కానీ, తండ్రయిన తర్వాత నాలో చాలా మార్పొచ్చేసింది. నా భార్యకూ, కూతుళ్లకూ నేనే హీరోని. అందుకే సినిమాలు, కుటుంబం తప్ప నాకు వేరే ధ్యాస లేదు. - గోల్డీ -
అమ్మాయిల జోలికి పోనంటున్న నితిన్
-
ఎదిరించి నిలవాలి..
సనత్‌నగర్, న్యూస్‌లైన్: కెరటాన్ని మించిన స్ఫూర్తి జీవితానికి ఏముంటుంది..? గెలుపోటములు వెలుగునీడల్లాంటివి. పడిలేచిన కెరటం ఎప్పుడైనా ఒడ్డును తాకాల్సిందే కదా. ఓడిపోయిన ప్రతి జీవితం ఏదో ఒక సమయంలో విజయతీరాన్ని చేరుకోవలసిందే. చిన్న వయసులోనే కెరటంలా ఎగిసిన హీరో ఉదయ్‌కిరణ్ తీవ్ర నిరాశానిస్పృహల నడుమ ఆయన ఆత్మహత్యకు పాల్పడిన తీరు సినీవర్గాల్లో కలకలాన్ని రేపుతోంది. ఎండమావుల్లాంటి సినిమా జీవితంలో అవకాశాలు లభించడం అంత సులభం కాదు. అలాగని ప్రతిభా పాటవాలు ఉన్నవాళ్లకు అవి దరిచేరకుండా ఉండవు. సుమారు 19 సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటించి అభిమానుల హృదయాల్లో ‘లవర్‌బాయ్’గా సుస్థిరస్థానాన్ని సొంతం చేసుకున్న ఉదయ్ ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. ఇటీవల కాలంలో తనకు అవకాశాలు రావడం లేదనే ఆవేదన... ఇండస్ట్రీకి దూరమవుతున్నాననే బాధ.. కారణాలు ఏవైతేనేం. ప్రతికూలతను అధిగమించలేకపోయాడు. నిజానికి తెలుగు సినిమా పరిశ్రమలో ఇలాంటి ఎత్తుపల్లాలు కొత్తేం కాదు. ఇప్పుడు పేరుప్రఖ్యాతలు సంపాదించుకొన్న ఎంతో మంది ఒకప్పుడు ఇలాంటి ఆత్మహత్యా సదృశ్యమైన పరిస్థితులను ఎదుర్కొన్నవాళ్లే కావడం గమనార్హం. చావు పరిష్కారం కాదు అవకాశాలు లభించక కుమిలిపోతున్న ఉదయ్‌కిరణ్ లాంటివాళ్లు తెలుగు సినీపరిశ్రమలో ఇంకా ఎంతోమంది ఉన్నారని సినీ వర్గాలే పేర్కొంటున్నాయి. అయితే ఈ సమస్యకు చావు మాత్రం పరిష్కారం కాబోదని మానసిక నిపుణులు చెబుతున్నారు. జూనియర్ ఆర్టిస్ట్ నుంచి సినీ హీరో వరకు ఏదో ఒక ఫ్రేమ్‌లో తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించుకొనే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని... కొద్దిపాటి ఓటములకే భయపడి పారిపోవలసిన పనిలేదని వారు అభిప్రాయపడ్డారు. అప్పటి వరకు నిర్వేదంలో ఉండి ఒక్క సినిమాతో బ్రహ్మాండమైన టర్నింగ్ తీసుకున్న నిర్మాతలున్నారు. హీరోగా ఎదగలేని వాళ్లు యాంకర్లుగానో, రచయితలాగానో చక్కటి పేరు తెచ్చుకున్నారు. ఒకటి, రెండు సినిమాల్లో మాత్రమే వెలుగు వెలిగి వెండితెరకు దూరమైన ఓ వర్ధమాన నటుడు ప్రస్తుతం వ్యాపార, వాణిజ్య రంగంలో చక్కగా రాణిస్తున్నాడు. ఇలా తమ రంగంలో అపజయాలను తట్టుకుని నిలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకొని విజయం కోసం కృషి చేయాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడం పాపం.. ఏ రంగంలోనైనా ప్రయత్నిస్తే ఓడిపోవడం అనేది ఉండదు. ఇక అవకాశాలు లేవన్న భావనతో ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. ఎవరో అవకాశాలు ఇవ్వడం కాదు. మనకు మనమే ప్లాట్‌ఫాంను క్రియేట్ చేసుకోవాలి. అంతెందుకు.. సినిమా పరిజ్ఞానం అంతగాలేని వారు కూడా యూట్యూబ్‌ను ఆసరాగా చేసుకుని లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంటున్నారు. తద్వారా అవకాశాలను చేజక్కించుకుంటున్నారు. ఫైనాన్షియల్ పరంగా కూడా ప్లానింగ్ అవసరం. - దాసరి మారుతి, సినీ డెరైక్టర్ ఎదిగేవరకు పోరాడాలి.. టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు దక్కకపోవడం తెలుగు సినిమా పరిశ్రమ చేసుకున్న పాపం. కొత్తవారికి దర్శకులు, నిర్మాతలు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో వారు మానసికంగా కుంగిపోతున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవడం చాలా తప్పు. తాము ఎంచుకున్న రంగంలో పైకి ఎదిగేవరకు పోరాడాలే తప్ప జీవితాన్ని మధ్యలోనే తుంచేసుకోకూడదు. - పీసీ ఆదిత్య, సినీ దర్శకుడు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత శోక సంద్రంలో అభిమానులు బంజారాహిల్స్, న్యూస్‌లైన్: తమ అభిమాన హీరో ఇక లేరని తెలుసుకున్న ఉదయ్‌కిరణ్ అభిమానులు సోమవారం ఉదయం పెద్ద సంఖ్యలో అపోలో ఆస్పత్రి వద్దకు, శ్రీనగర్ కాలనీలోని ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అపోలో నుంచి మృతదేహాన్ని ఉస్మానియాకు శవపరీక్ష నిమిత్తం తరలిస్తుండగా అభిమానులు చూసేందుకు ఎగబడటంతో తోపులాట చోటుచేసుకుంది. ఉదయ్ మృతదేహాన్ని చూసి కొందరు విలపించారు. సినీరంగానికి చెందిన నటులు శ్రీకాంత్, శివాజీరాజా, శివకృష్ణ, వైజాగ్ ప్రసాద్, గొల్లపూడి మారుతీరావు, ఢిల్లీ రాజేశ్వరి, విజయ్‌చందర్ తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. కొందరి గుప్పిట్లో చిత్ర పరిశ్రమ! బంజారాహిల్స్, నూస్య్లైన్: తెలుగు చిత్ర పరిశ్రమలో అండదండలు ఉన్నవారే అవకాశాలు దక్కించుకుంటున్నారని, ఏ అండాలేనివారు అవకాశాలకు దూరమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా హీరో ఉదయ్‌కిరణ్ ఉదంతం ఇందుకు అద్దం పడుతోంది. 19 చిత్రాల్లో నటించి ‘లవర్‌బాయ్’గా పేరుతెచ్చుకున్న ఉదయ్‌కిరణ్ మృతి ఫిల్మ్‌నగర్‌లో సంచలనం రేపింది. సోమవారం ఉదయం ఈ విషయం తెలియడంతో సినీ కార్యాలయాలు, సినీ స్టూడియోల్లోనూ ఉదయ్‌కిరణ్ ఆత్మహత్యపైన, అందుకు దారితీసిన కారణాలపైన చర్చించుకున్నారు. చిత్ర పరిశ్రమను తమ గుప్పిట్లో పెట్టుకున్న కొన్ని కుటుంబాలు ఉదయ్‌కిరణ్ కెరీర్‌ను పూర్తిగా నాశనం చేశాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వర్థమాన హీరోలు సైతం సినిమా అవకాశాలు లేకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని సినీ పెద్దలు పేర్కొంటున్నారు. కొందరు హీరోయిన్ల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదని, గడిచిన రెండు, మూడేళ్లు ఒక వెలుగు వెలిగిన హీరోలకు సినిమా ఛాన్సులు లేకుండాపోయాయని.. వారు పడుతున్న వేదన అంతాఇంతా కాదని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. చెమ్మగిల్లిన కళ్లు ఉదయ్‌కిరణ్‌పై ట్వీట్స్ ‘మెరిసేదంతా బంగారం కాదు. పెద్ద చిరునవ్వు వెనక ఎంతో బాధ దాగుంటుంది. ఉదయ్ విషయం నన్నెంతో కలిచి వేసింది. అతని ఆత్మకు శాంతి కలగాలి’ - శ్రద్ధాదాస్ యువ నటుడి మరణం చాలా బాధ కలిగించింది. ఒక్కోసారి ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. - గుత్తా జ్వాల ఉదయ్‌కిరణ్ ఇకలేరు. చాలా బాధగా ఉంది. - ఎస్ఎస్ రాజమౌళి ఉదయ్‌కిరణ్ మరణం దుర్వార్త. అందరికీ కష్టాలు ఉంటాయి. అందరూ పోరాడాల్సిందే. కొంత మంది పోరాటాన్ని వదిలేస్తారు. అలా చేయకపోతే బాగుండు. - చిన్మయి శ్రీపద మనం ఇలా జరగకుండా చూసి ఉండాల్సింది. - జీవా పొద్దున్నే ఈ దుర్వార్త వినడానికి నిద్రలేచానా. నాకు తెలిసిన వాళ్లలో అత్యంత స్నేహపాత్రుడు ఉదయ్‌కిరణ్. నేను దుఃఖంలో మునిగి పోయాను. - ప్రియమణి చాలా దుర్వార్త. ఆర్ఐపీ ఉదయ్ - గోపీచంద్ వాట్ ది హెల్. ఉదయ్‌కిరణ్ వార్త నిజమా? ఇంకా నమ్మలేకుండా ఉన్నా. - స్నేహా ఉల్లాల్ ఎంతో మంచి వాడు. స్వీట్ పర్సన్. ఉదయ్ లేడంటే ఇప్పటికీ నమ్మసక్యం కాకుండా ఉంది. - వరుణ్‌సందేశ్ నాకు అత్యంత దగ్గరి స్నేహితుడు. ఉదయ్ కిరణ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. వియ్ విల్ మిస్‌యూ. - మంచు మనోజ్ నీ చిరునవ్వు వెనకున్న విషాదం మాకు తెలీదు. నీ ఆత్మ సంతోషాన్ని పొందాలని కోరుకుంటున్నా. ఉదయ్‌కిరణ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. - చార్మి