ఎదిరించి నిలవాలి.. | Actor Uday Kiran commits suicide | Sakshi
Sakshi News home page

ఎదిరించి నిలవాలి..

Published Tue, Jan 7 2014 4:32 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

Actor Uday Kiran commits suicide

సనత్‌నగర్, న్యూస్‌లైన్: కెరటాన్ని మించిన స్ఫూర్తి జీవితానికి ఏముంటుంది..? గెలుపోటములు వెలుగునీడల్లాంటివి. పడిలేచిన కెరటం ఎప్పుడైనా ఒడ్డును తాకాల్సిందే కదా. ఓడిపోయిన ప్రతి  జీవితం ఏదో ఒక సమయంలో విజయతీరాన్ని చేరుకోవలసిందే. చిన్న వయసులోనే కెరటంలా ఎగిసిన హీరో ఉదయ్‌కిరణ్  తీవ్ర నిరాశానిస్పృహల నడుమ ఆయన ఆత్మహత్యకు పాల్పడిన తీరు  సినీవర్గాల్లో కలకలాన్ని రేపుతోంది. ఎండమావుల్లాంటి సినిమా జీవితంలో అవకాశాలు లభించడం అంత సులభం కాదు. అలాగని ప్రతిభా పాటవాలు ఉన్నవాళ్లకు అవి దరిచేరకుండా ఉండవు. సుమారు 19 సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటించి అభిమానుల  హృదయాల్లో ‘లవర్‌బాయ్’గా  సుస్థిరస్థానాన్ని సొంతం చేసుకున్న ఉదయ్ ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. ఇటీవల కాలంలో  తనకు అవకాశాలు రావడం లేదనే ఆవేదన... ఇండస్ట్రీకి దూరమవుతున్నాననే బాధ.. కారణాలు ఏవైతేనేం. ప్రతికూలతను అధిగమించలేకపోయాడు. నిజానికి తెలుగు సినిమా పరిశ్రమలో ఇలాంటి ఎత్తుపల్లాలు కొత్తేం కాదు. ఇప్పుడు పేరుప్రఖ్యాతలు సంపాదించుకొన్న ఎంతో మంది  ఒకప్పుడు ఇలాంటి ఆత్మహత్యా సదృశ్యమైన పరిస్థితులను ఎదుర్కొన్నవాళ్లే కావడం గమనార్హం.
 
చావు పరిష్కారం కాదు

అవకాశాలు లభించక కుమిలిపోతున్న ఉదయ్‌కిరణ్ లాంటివాళ్లు తెలుగు సినీపరిశ్రమలో ఇంకా ఎంతోమంది ఉన్నారని సినీ వర్గాలే పేర్కొంటున్నాయి. అయితే ఈ సమస్యకు చావు మాత్రం పరిష్కారం కాబోదని మానసిక నిపుణులు చెబుతున్నారు. జూనియర్ ఆర్టిస్ట్ నుంచి సినీ హీరో వరకు  ఏదో ఒక ఫ్రేమ్‌లో తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించుకొనే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని... కొద్దిపాటి ఓటములకే  భయపడి పారిపోవలసిన పనిలేదని వారు అభిప్రాయపడ్డారు. అప్పటి వరకు నిర్వేదంలో ఉండి ఒక్క సినిమాతో బ్రహ్మాండమైన టర్నింగ్  తీసుకున్న నిర్మాతలున్నారు. హీరోగా ఎదగలేని వాళ్లు    యాంకర్‌లుగానో, రచయితలాగానో చక్కటి పేరు తెచ్చుకున్నారు. ఒకటి, రెండు సినిమాల్లో మాత్రమే వెలుగు వెలిగి వెండితెరకు దూరమైన ఓ వర్ధమాన నటుడు ప్రస్తుతం వ్యాపార, వాణిజ్య రంగంలో చక్కగా రాణిస్తున్నాడు. ఇలా తమ రంగంలో అపజయాలను తట్టుకుని నిలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకొని విజయం కోసం కృషి చేయాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.  
 
ఆత్మహత్య చేసుకోవడం పాపం..

ఏ రంగంలోనైనా ప్రయత్నిస్తే ఓడిపోవడం అనేది ఉండదు. ఇక అవకాశాలు లేవన్న భావనతో ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. ఎవరో అవకాశాలు ఇవ్వడం కాదు. మనకు మనమే ప్లాట్‌ఫాంను క్రియేట్ చేసుకోవాలి. అంతెందుకు.. సినిమా పరిజ్ఞానం అంతగాలేని వారు కూడా యూట్యూబ్‌ను ఆసరాగా చేసుకుని లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంటున్నారు. తద్వారా అవకాశాలను చేజక్కించుకుంటున్నారు. ఫైనాన్షియల్ పరంగా కూడా ప్లానింగ్ అవసరం.   
 - దాసరి మారుతి, సినీ డెరైక్టర్
 
 ఎదిగేవరకు పోరాడాలి..

 టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు దక్కకపోవడం తెలుగు సినిమా పరిశ్రమ చేసుకున్న పాపం. కొత్తవారికి దర్శకులు, నిర్మాతలు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో వారు మానసికంగా కుంగిపోతున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవడం చాలా తప్పు. తాము ఎంచుకున్న రంగంలో పైకి ఎదిగేవరకు పోరాడాలే తప్ప జీవితాన్ని మధ్యలోనే తుంచేసుకోకూడదు.    
 - పీసీ ఆదిత్య, సినీ దర్శకుడు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత
 
 శోక సంద్రంలో అభిమానులు

 బంజారాహిల్స్, న్యూస్‌లైన్: తమ అభిమాన హీరో ఇక లేరని తెలుసుకున్న ఉదయ్‌కిరణ్ అభిమానులు సోమవారం ఉదయం పెద్ద సంఖ్యలో అపోలో ఆస్పత్రి వద్దకు, శ్రీనగర్ కాలనీలోని ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అపోలో నుంచి మృతదేహాన్ని ఉస్మానియాకు శవపరీక్ష నిమిత్తం తరలిస్తుండగా అభిమానులు చూసేందుకు ఎగబడటంతో తోపులాట చోటుచేసుకుంది. ఉదయ్ మృతదేహాన్ని చూసి కొందరు విలపించారు. సినీరంగానికి చెందిన నటులు శ్రీకాంత్, శివాజీరాజా, శివకృష్ణ, వైజాగ్ ప్రసాద్, గొల్లపూడి మారుతీరావు, ఢిల్లీ రాజేశ్వరి, విజయ్‌చందర్ తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
 
 కొందరి గుప్పిట్లో చిత్ర పరిశ్రమ!

 బంజారాహిల్స్, నూస్య్‌లైన్: తెలుగు చిత్ర పరిశ్రమలో అండదండలు ఉన్నవారే అవకాశాలు దక్కించుకుంటున్నారని, ఏ అండాలేనివారు అవకాశాలకు దూరమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా హీరో ఉదయ్‌కిరణ్ ఉదంతం ఇందుకు అద్దం పడుతోంది. 19 చిత్రాల్లో నటించి ‘లవర్‌బాయ్’గా పేరుతెచ్చుకున్న ఉదయ్‌కిరణ్ మృతి ఫిల్మ్‌నగర్‌లో సంచలనం రేపింది. సోమవారం ఉదయం ఈ విషయం తెలియడంతో సినీ కార్యాలయాలు, సినీ స్టూడియోల్లోనూ ఉదయ్‌కిరణ్ ఆత్మహత్యపైన, అందుకు దారితీసిన కారణాలపైన చర్చించుకున్నారు. చిత్ర పరిశ్రమను తమ గుప్పిట్లో పెట్టుకున్న కొన్ని కుటుంబాలు ఉదయ్‌కిరణ్ కెరీర్‌ను పూర్తిగా నాశనం చేశాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వర్థమాన హీరోలు సైతం సినిమా అవకాశాలు లేకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని సినీ పెద్దలు పేర్కొంటున్నారు. కొందరు హీరోయిన్ల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదని, గడిచిన రెండు, మూడేళ్లు ఒక వెలుగు వెలిగిన హీరోలకు సినిమా ఛాన్సులు లేకుండాపోయాయని.. వారు పడుతున్న వేదన అంతాఇంతా కాదని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు.
 
 చెమ్మగిల్లిన కళ్లు ఉదయ్‌కిరణ్‌పై ట్వీట్స్
 
 ‘మెరిసేదంతా బంగారం కాదు. పెద్ద చిరునవ్వు వెనక ఎంతో బాధ దాగుంటుంది. ఉదయ్ విషయం నన్నెంతో కలిచి వేసింది. అతని ఆత్మకు శాంతి కలగాలి’
 - శ్రద్ధాదాస్
 
 యువ నటుడి మరణం చాలా బాధ కలిగించింది. ఒక్కోసారి ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం.  
 -  గుత్తా జ్వాల
 
 ఉదయ్‌కిరణ్ ఇకలేరు. చాలా బాధగా ఉంది.  
 - ఎస్‌ఎస్ రాజమౌళి
 
 ఉదయ్‌కిరణ్ మరణం దుర్వార్త. అందరికీ కష్టాలు ఉంటాయి. అందరూ పోరాడాల్సిందే. కొంత మంది పోరాటాన్ని వదిలేస్తారు. అలా చేయకపోతే బాగుండు.
 - చిన్మయి శ్రీపద
 
 మనం ఇలా జరగకుండా చూసి ఉండాల్సింది.  
 - జీవా
 
 పొద్దున్నే ఈ దుర్వార్త వినడానికి నిద్రలేచానా. నాకు తెలిసిన వాళ్లలో అత్యంత స్నేహపాత్రుడు ఉదయ్‌కిరణ్. నేను దుఃఖంలో మునిగి పోయాను.
 - ప్రియమణి
 
 చాలా దుర్వార్త. ఆర్‌ఐపీ ఉదయ్
  - గోపీచంద్
 
 వాట్ ది హెల్. ఉదయ్‌కిరణ్ వార్త నిజమా? ఇంకా నమ్మలేకుండా ఉన్నా.    
 - స్నేహా ఉల్లాల్
 
 ఎంతో మంచి వాడు. స్వీట్ పర్సన్. ఉదయ్ లేడంటే ఇప్పటికీ నమ్మసక్యం కాకుండా ఉంది.
 - వరుణ్‌సందేశ్
 
 నాకు అత్యంత దగ్గరి స్నేహితుడు. ఉదయ్ కిరణ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. వియ్ విల్ మిస్‌యూ.
 - మంచు మనోజ్
 
 నీ చిరునవ్వు వెనకున్న విషాదం మాకు తెలీదు. నీ ఆత్మ సంతోషాన్ని పొందాలని కోరుకుంటున్నా. ఉదయ్‌కిరణ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.
 - చార్మి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement