అదే ఆదికి వచ్చి ఉంటుంది : సూర్య
‘‘బాక్సింగ్‌లో కిందపడితే ఓడిపోయినట్లు కాదు. లేవలేనప్పుడే నిజంగా ఓడిపోయినట్లు. అలా లేచి నిలబడిన తర్వాత ఇచ్చే రఫ్ పంచ్ విజయానికి కారణం అవుతుంది. ఆ పంచ్‌లా ఈ ‘రఫ్’ సక్సెస్ కావాలి. ఫైట్ మాస్టర్ పాండ్యన్ దగ్గర ఆది, కార్తీ శిక్షణ తీసుకుంటున్నప్పుడు చూసేవాణ్ణి. చాలా కష్టపడి నేర్చుకునేవాడు. ఈ ప్రచార చిత్రాలు ఆదిలోని ఎనర్జీని, ప్రతిభను తెలియజేస్తున్నాయి. డైలాగ్స్ చెప్పడంలో సాయికుమార్‌గారు స్పెషలిస్ట్. అదే ఆదికి వచ్చి ఉంటుంది’’ అని హీరో సూర్య అన్నారు. ఆది, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఎమ్. సుదర్శనరావు మాధవరం సమర్పణలో అభిలాష్ మాధవరం నిర్మించిన చిత్రం ‘రఫ్’.
సీహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ పాటలు స్వరపరిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న సూర్య పాటల సీడీని ఆవిష్కరించి, దర్శకుడు వంశీ పైడిపల్లికి ఇచ్చారు. ప్రచార చిత్రాలను బోయపాటి శ్రీను ఆవిష్కరించారు. ఈ వేడుకలో అతిథులుగా పాల్గొన్న రానా, ‘అల్లరి’ నరేశ్, నితిన్, దశరథ్, సంపత్ నంది, వీరభద్రం, కేవీవీ సత్యనారాయణ తదితరులు చిత్రబృందానికి శుభాకాంక్షలందజేశారు. ఆది మాట్లాడుతూ -‘‘సూర్యగారు ఈ వేడుకకు రావడం, మణిశర్మగారు స్వరపరచిన పాటలకు డాన్స్ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు.
‘‘ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్’’ అని దర్శక, నిర్మాతలు చెప్పారు. సాయికుమార్ మాట్లాడుతూ - ‘గతంలో సూర్య తండ్రి శివకుమార్ చేసిన పాత్రలకు డబ్బింగ్ చెప్పేవాణ్ణి, నేను డబ్బింగ్ మానేసిన తర్వాత సూర్య హీరో అయ్యారు. లేకపోతే ఆయనక్కూడా చెప్పి ఉండేవాణ్ణి. ఈ చిత్రం ఆదికి కమర్షియల్ హీరోగా మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.