ఆనందంతో పాటు భయం కూడా... | Mythri movie makers press meet by savyasachi movie | Sakshi
Sakshi News home page

ఆనందంతో పాటు భయం కూడా...

Published Wed, Oct 31 2018 1:07 AM | Last Updated on Wed, Oct 31 2018 1:07 AM

Mythri movie makers press meet by savyasachi movie - Sakshi

‘‘చాలా తక్కువ టైమ్‌లో మంచి సక్సెస్‌ వచ్చిందన్న ఆనందంతో పాటు ఆ సక్సెస్‌ను నిలబెట్టుకోవాలనే భయం కూడా ఉంది’’ అన్నారు మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్‌. ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం’ సినిమాలతో వరుస హిట్స్‌ను సాధించి మంచి ఫామ్‌లో ఉన్నారు ఈ నిర్మాతలు. తాజాగా వీరి బ్యానర్‌లో నాగచైతన్య హీరోగా రూపొందిన సినిమా ‘సవ్యసాచి’. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ కథానాయిక. మాధవన్, భూమిక కీలక పాత్రలు చేసిన ఈ సినిమా నవంబర్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా నవీన్, మోహన్, రవిశంకర్‌ చెప్పిన విశేషాలు...

∙గతేడాది సెప్టెంబర్‌లో ‘సవ్యసాచి’ సినిమా గురించి చందూ మొండేటి చెప్పారు. నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లాం. నాగచైతన్య బాగా చేశారు. కామెడీ, డ్రామా, యాక్షన్‌ ఇలా అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయి. బడ్జెట్‌ పరంగా కంఫర్టబుల్‌గానే ఉన్నాం. మాధవన్‌గారికి కూడా ఈ సినిమా కథ బాగా నచ్చి నటించడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌కు ముందు తమన్నానే అనుకున్నాం. కానీ కథానుసారంగా సడన్‌గా తమన్నా వస్తే బాగుండదమో అని ఆలోచించాం. అందుకే కుదర్లేదు. ‘సవ్య సాచి’ సినిమాను తమిళంలో డబ్‌ చేయడం లేదు. కానీ తెలుగు వెర్షన్‌ను అక్కడ రిలీజ్‌ చేస్తున్నాం.

∙నాగచైతన్య ‘సవ్యసాచి’, రవితేజ ‘అమర్‌ అక్బర్‌ ఆంటొనీ’ సినిమాలను వెంట వెంటనే విడుదల చేస్తున్నాం అంటే సరైన డేట్స్‌ లేకనే. ఈ ఏడాది నవంబర్‌ 29న ‘2.ఓ’ చిత్రం ఉంది. డిసెంబర్‌ 7వ తేదీ తెలంగాణ ఎన్నికలు. ఒకవేళ 14 రిలీజ్‌ చేస్తే... డిసెంబర్‌ 21న  4సినిమాలు ఉన్నాయి. జనవరిలో పెద్ద సినిమాలు ఉన్నాయి. వేరే డేట్స్‌ లేకనే. ఇలా రిలీజ్‌ చేస్తున్నాం.

∙మంచి సినిమా తీయడమే కాదు.. మంచి డేట్‌కు రిలీజ్‌ చేసుకోవాలి. ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని 2015 జూలై 17న రిలీజ్‌ అనుకున్నాం. కానీ ఆగస్టు 7న చేశాం. ‘జనతా గ్యారేజ్‌’ సినిమాను 2016 ఆగస్టు 11న అనుకున్నాం. కానీ ఆ తేదీకి ఆడియో రిలీజ్‌ చేసి సినిమాను 2016 సెప్టెంబర్‌ 1కి రిలీజ్‌ చేశాం. ‘రంగస్థలం’ ఈ ఏడాది సంక్రాంతికి అనుకున్నాం. కానీ మార్చి 30కి రిలీజ్‌ చేశాం. డిలే సెంటిమెంట్‌ అని కాదు. అలా జరిగిందంతే. 

∙మేం ముగ్గురం విజయవాడ నుంచే వచ్చాం. మేం ఎప్పటినుంచో స్నేహితులం. ‘శ్రీమంతుడు’ ముందు నుంచే హీరోలకు మైత్రీవారు బాగా అడ్వాన్స్‌లు ఇస్తున్నారన్న టాక్‌ ఉంది. మేం డైరెక్టర్‌ను ఫాలో అవుతాం. మా సంస్థలో యాక్టర్స్, డైరెక్టర్స్‌ రిపీట్‌ అవుతున్నారంటే... వాళ్లకు కంఫర్ట్‌గా ఉంది. సేమ్‌ టైమ్‌ మాకూ కంఫర్ట్‌గా ఉంది. చందూ మొండేటితో మరో సినిమా ఉంది. కొరటాల శివగారు (శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌), సుకుమార్‌గారు (రంగస్థలం) చెప్పిన కథలు విన్నప్పుడు బాగా నచ్చాయి. 

∙తొలుత పెద్ద సినిమాలే తీద్దాం అనుకున్నాం. అయితే మార్కెట్‌ను గమనిస్తే మధ్య స్థాయి సినిమాలు కూడా మంచి కలెక్షన్స్‌ను రాబడుతున్నాయి. 2016లో మిడిల్‌ లెవల్‌ సినిమాలు కూడా చేద్దాం అనుకున్నాం. 2017లో ఎగ్జిక్యూట్‌ చేశాం. ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. 

∙అన్నదమ్ములు సాయిధరమ్‌ తేజ్, వైష్టవ్‌ తేజ్‌ సినిమాలను కావాలని ప్లాన్‌ చేయలేదు. ప్రస్తుతానికి మా బ్యానర్‌లో దాదాపు పది సినిమాలు ఉన్నప్పటికీ సెట్స్‌లో ఉన్నది రెండు, మూడు సినిమాలే. ఇక్కడ ఎక్కువ సినిమాలు చేస్తుండటం వల్ల ఓవర్‌సీస్‌లో డిస్ట్రిబ్యూషన్‌ను ఆపేశాం. 

∙‘చిత్రలహరి’ని నానితో అనుకున్నాం కానీ కుదర్లేదు. నాని మంచి ఆర్టిస్టు. భవిష్యత్‌లో ఆయనతో సినిమా ఉంటుంది. తమిళ ‘తేరి’ తెలుగు రీమేక్‌ను హీరో రవితేజ, దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌లతో చేయబోతున్నాం. ‘తేరి’లో చిన్న ప్లాట్‌ మాత్రమే తీసుకున్నాం. త్రివ్రికమ్‌–పవన్‌ కల్యాణ్‌గారి కాంబినేషన్‌లో ఓ సినిమా ఉండొచ్చు. 

∙చిన్న సినిమాల ఆలోచన కూడా ఉంది. కోటి రూపాయల బడ్జెట్‌లో రితేష్‌ అనే డైరెక్టర్‌తో ఓ సినిమా ప్లాన్‌ చేశాం. అతి త్వరలో స్టార్ట్‌ అవుతుంది. మా సక్సెస్‌లో దేవిశ్రీప్రసాద్‌ ఉన్నారు. నెక్ట్స్‌ ఇయర్‌ మా బ్యానర్‌లో రిలీజయ్యే ఓ 4 సినిమాలకు ఆయనే సంగీత దర్శకుడు. ప్రస్తుతానికి బాలీవుడ్‌ ఆలోచన లేదు. సొంత స్టూడియో అంటే పెద్ద పని. ఆ ఆలోచన కూడా లేదు. వెబ్‌ సిరీస్‌ కోసం అమేజాన్‌ వాళ్లు అడిగారు. చర్చలు జరుగుతున్నాయి. మళ్లీ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో సినిమాలు ఉంటాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement