
గ్రాఫిక్స్ హైలెట్
‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, ‘సాహస బాలుడు విచిత్ర కోతి’ చిత్రాల్లో బాలనటుడిగా అలరించిన నాగ అన్వేష్ ‘వినవయ్యా రామయ్యా’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. నటన, డ్యాన్స్, ఫైట్స్‌లో మంచి మార్కులు కొట్టేసిన అన్వేష్ తాజాగా ‘ఏంజెల్’ చిత్రంలో హీరోగా నటించారు. ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో భువన్ సాగర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
హెబ్బా పటేల్ కథానాయిక. భువన్ సాగర్ మాట్లాడుతూ– ‘‘సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. సినిమా షూటింగ్, రీ–రికార్డింగ్ పనులు ముగిశాయి. హాలీవుడ్ చిత్రాలకి గ్రాఫిక్స్ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుల సమక్షంలో ‘ఏంజెల్’ సీజీ వర్క్స్ జరుగుతున్నాయి. 40 నిమిషాలకి పైగా గ్రాఫిక్స్ సన్నివేశాలు ఉండటంతో జాగ్రత్తలు తీసుకొంటున్నాం. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: గుణ.