
నాన్న ఇంకా యంగ్ అయిపోతున్నారనిపిస్తోంది!
-నాగ చైతన్య
'‘రెండేళ్ల క్రితం ‘ఊపిరి’ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నప్పుడు నాన్న సినిమా అంతా కూర్చొని ఉంటారని తెలియగానే ముందు వద్దనే చెప్పాం. కానీ ఈ ట్రైలర్ చూసి ఎమోషనల్ అయిపోయా. రెండేళ్ల కష్టం, శ్రమ ఈ ట్రైలర్‌లో కనిపించింది’’ అని హీరో అఖిల్ అన్నారు. నాగార్జున, కార్తీ, తమన్నా ముఖ్యతారలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను నాగ చైతన్య, అఖిల్ గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా ట్రైలర్ చూశాక నాన్నే మా ఊపిరి అనిపించింది. ఇలాంటి కాన్సెప్ట్ నాన్నతో చేసినందుకు పీవీపి, వంశీగార్లకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా జర్నీలో అందరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని తెలుసు.
ముఖ్యంగా నాన్నకు కార్తీ అంటే విపరీతమైన ప్రేమ ఏర్పడింది. యూనిట్ సభ్యులందరి మధ్య అనుబంధాలు అల్లుకుం టేనే ఇలాంటి మంచి సినిమాలు వస్తాయి’’ అని అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ, ‘‘మామూలుగా మా సినిమాకు సంబంధించి ట్రైలర్స్ నాన్నతో రిలీజ్ చేయిస్తాం. అలాంటిది నాన్న సినిమా ప్రచార చిత్రాన్ని కొత్తగా మాతో విడుదల చేయించి పీవీపి గారు కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. నాకిలాంటప్పుడే ‘నాన్న ముందు మనం ఓల్డ్ అయిపోయి, ఆయన రోజురోజుకీ యంగ్ అయిపోతున్నారా?’ అన్న సందేహం కలుగుతోంది.
ట్రైలర్ చూశాక మాటలు రాలేదు. చాలా బాగుంది. ఇంత మంచి సబ్జెక్ట్ ఎంచుకున్న వంశీ ఒకే జానర్‌కు ఫిక్స్ కాకుండా డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నారు’’ అని అన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, ‘‘నేను గతంలో చేసిన సినిమాల కన్నా ఇది విభిన్నంగా ఉంటుంది. నాగార్జున గారు, కార్తీగారు, పీవీపి గార్ల నమ్మకమే ఈ సినిమా. తన తమ్ముడు సినిమా తీస్తే ఎలా నిర్మిస్తారో అలా నన్ను ప్రోత్సహించారు. చాలా సినిమాలు చేస్తాం. కానీ ‘ఊపిరి’ జర్నీ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నాకు ఇది చాలా స్పెషల్. ముఖ్యంగా ప్యారిస్‌లో ఏ లొకేషన్‌నూ వదల్లేదు. 12 రోజుల పాటు అక్కడే చిత్రీకరించాం’’ అన్నారు. ‘‘సరిగ్గా 2014 మార్చి 14న ఈ చిత్రం స్టార్ట్ అయింది. రెండేళ్లపాటు కష్టపడి తీశాం. తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఈ చిత్రానికి 60 కోట్లు ఖర్చయింది’’ అని నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి (పి.వి.పి) తెలిపారు. ఈ వేడుకలో రచయితలు అబ్బూరి రవి, హరి పాల్గొన్నారు.