
ఇమేజ్ అంటూ ఎంత కాలం సినిమాలు చేస్తాను! - నాగార్జున
‘ఊపిరి’ సినిమాను నేను, అమల, అఖిల్, నాగచైతన్య కలిసి చూశాం. సినిమా అయ్యేంతవరకు అమల నా వైపు అలా చూస్తూ ఉండిపోయింది. ఇక సినిమా అయ్యాక మాత్రం అందరూ నన్ను రెండు నిమిషాల పాటు హత్తుకున్నారు. అంతకు మించిన ప్రశంస లేదనిపించింది’’ అని హీరో నాగార్జున అన్నారు. పీవీపి పతాకంపై నాగార్జున, కార్తీ, తమన్నా ముఖ్య తారలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన చిత్రం ‘ఊపిరి’. ఈ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. సినిమాకు ప్రశంసలు లభిస్తున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ-‘‘ఈ సినిమాలో మీకన్నా కార్తీ పాత్రకే స్పాన్ ఎక్కువ ఉందని చాలా మంది అన్నారు. అయినా అలా ఫీలవ్వడానికి కార్తీ ఎవరో కాదు. నా తమ్ముడే కదా. నిజంగా మా ఇద్దరి మధ్యా అలాంటి అనుబంధం ఉంది కాబట్టే సినిమాలో మా మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. ఎప్పుడూ ఇమేజ్‌ను నమ్ముకుంటే ఒకే రకమైన కథలే వస్తాయి. కొత్తవి పుట్టవు. రొటీన్ సినిమాల్లో నన్ను నేను చూసుకుంటే నాకే బోర్ కొట్టేస్తోంది. పైగా ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమాల కారణంగా చెంపదెబ్బలు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంతకాలం ఇమేజ్‌ను పట్టుకుని వేలాడతాం.
‘గీతాంజలి’, ‘శివ’ చిత్రాల జాబితాలో ‘ఊపిరి’ ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘మా వదిన (జ్యోతిక) ఇంతకు ముందే ఫోన్ చేసి, నన్ను అభినందించారు. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఆమె అన్నారు’’ అని కార్తీ చెప్పారు. ‘‘ఇప్పుడు నన్నందరూ బాలచందర్‌గారితో పోలుస్తున్నారు. ఆయనతో పోల్చుకునేంత అర్హత నాకైతే లేదు. మొదటి నుంచి ఈ సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం. ముందు ఈ కథ నాగార్జునగారితో చెప్పడానికి భయపడ్డాను.
కానీ తర్వాత ఆ భయం పోయింది’’ అని వంశీ పైడిపల్లి అన్నారు. ‘‘విజయా వాహిని సంస్థకు ‘మాయాబజార్’, జగపతి సంస్థకు ‘దసరా బుల్లోడు’ ఎలానో మీ సంస్థకు ‘ఊపిరి’ అలా అని ఒక వ్యక్తి నాకు మెసేజ్ చేశారు. అది మాకు దక్కిన గొప్ప ప్రశంసగా భావిస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల నుంచీ ‘సెన్సేషనల్ ఫిలిమ్’ అని రెస్పాన్స్ వస్తోంది. ఈ విషయాన్ని నాగార్జునగారు రెండేళ్ల క్రితమే చెప్పారు’’ అని నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి అన్నారు.