చైతూ ఏడ్చేశాడు...
అక్కినేని కుటుంబంలో అడుగుపెట్టనున్న పెద్ద కోడలిగా ఈ ఏడాది ఎక్కువగా వార్తల్లో నిలిచారు సమంత. చైతూతో ప్రేమ, పెళ్లి... ఈ సంవత్సరమంతా ఈ కబుర్లతోనే సమంత గడిపేశారా అంటే కాదు. ఐదు సినిమాలతో సందడి చేశారు. కొత్త ఏడాదిలో మరో ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఈ ఏడాది మంచి సంతోషాన్ని ఇచ్చిందంటున్న సమంత చెబుతున్న సంగతులు...
⇔ ‘ఏ మాయ చేసావే’ విడుదలై ఆరేళ్లు అవుతోంది. ఇటీవల ‘సమంత బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ఏది?’ అనే పోల్ పెడితే.. ‘ఏ మాయ చేసావే’లో జెస్సీ క్యారెక్టర్‌కి టాప్ ప్లేస్ వచ్చింది. ప్రేక్షకుల తీర్పుని ప్రశంసగా స్వీకరించాలో? అవమానంగా భావించాలో? నాకు అర్థం కాలేదు. ఎందుకంటే... మొదటి సినిమా తర్వాత మళ్లీ నేను అంత బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇవ్వలేదా? ఏంటి? అని ఆలోచించా. నేను చాలా డిస్ట్రబ్ అయ్యాను. జెస్సీని మర్చిపోయేలా కొత్త సినిమాల్లో మంచి నటన కనబరచాలని నిర్ణయించుకున్నా.
‘హాయ్... అక్కినేని సమంత’ – పలువురి పలకరింపు ఈ విధంగానే ఉంది. నేనింకా అక్కినేని సమంత కాలేదు. కానీ, వాళ్లందరికీ థ్యాంక్స్.
⇔ ‘తెరి’ (తెలుగులో ‘పోలీస్’), ‘24’, ‘బ్రహ్మోత్సవం’, ‘అ... ఆ’, ‘జనతా గ్యారేజ్’... ఈ ఏడాది చేసిన సినిమాలన్నీ సంతోషాన్ని అందించాయి. ముఖ్యంగా ‘తెరి’లో నేను మరణించే సన్నివేశం గురించి దర్శకుడు అట్లీ చెప్పగానే... అందర్నీ ఏడిపించేలా నటిస్తానని చెప్పా. ఒకవేళ ఆ సన్నివేశంలో నిజంగా నేను ఉంటే ఏం చేస్తానని ఆలోచించి నటించా. థియేటర్‌కి ఫ్రెండ్స్‌తో వెళ్లినప్పుడు ఆ సీన్ రాగానే... నేను అందర్నీ చూస్తున్నా. నా పక్కనే కూర్చున్న చైతూ కూడా ఏడ్చేశాడు. అది చూసి, నా కృషి ఫలించిందని సంతోషపడ్డా.
⇔ ప్రతి సినిమాలోనూ నేను అందంగా కనబడుతున్నానంటే కారణం మంచి మేకప్, సినిమాటోగ్రఫీనే. నిజమే.. ఇది మీరు నమ్మి తీరాల్సిందే.
⇔ నా అభిమాన దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఆయనతో ఛాన్స్ ఓసారి వచ్చినట్లే వచ్చి చేజారింది. మళ్లీ మణిరత్నం సినిమాలో అవకాశం ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నా. ప్రస్తుతం మణిరత్నం సినిమాలో నటించడమే నాకున్న డ్రీమ్. ఎక్కువగా ఫలానా దర్శకుడితో పని చేయాలని కలగంటాను. ఫలానా హీరోతో నటించాలనే డ్రీమ్స్ ఏవీ లేవు.
⇔ ‘హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో ఎప్పుడు నటిస్తారు?’ అనే ప్రశ్న ఈమధ్య ఎదురవుతోంది. థియేటర్‌లో నేను ఎలాంటి సినిమాలు చూడాలనుకుంటానో! అటువంటి మంచి కథలను ఎంపిక చేసుకుంటున్నా. అంతే గానీ.. హీరోయిన్ ఓరియెంటెడ్ కథల వెనుక పరుగులు తీయడం, ప్రయత్నించడం చేయను.
⇔ ఇప్పుడు ఐదు సినిమాలకు సంతకం చేశా. కొత్త ఏడాదిలో విడుద లయ్యే ఆ సినిమాలన్నీ మంచి కథలే. మంచి పాత్రల్లో కనిపిస్తా.
⇔ ‘సమంత’ సౌండింగ్ రొమాంటిక్‌గా ఉందంటూ ఓ అభిమాని చెప్పాడు. అంతకు ముందెన్నడూ నా పేరు రొమాంటిక్‌గా ఉందనే మాట నేను వినలేదు. ఈ విషయం అమ్మకు చెప్పాలి!