తారక్ vs చైతూ
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పోటి లేకుండా సినిమా రిలీజ్ చేయటం కష్టంగా మారుతోంది. స్టార్ వారసుల తాకిడి పెరిగిపోవటంతో పాటు భారీ సంఖ్యలో సినిమాలు తెరకెక్కుతుండటంతో ఎలాంటి పోటి లేకుండా సోలోగా సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించటం లేదు. స్టార్ హీరోలు బరిలో ఉన్న సమయంలో చిన్న హీరోలు కాస్త సైడ్ ఇచ్చినా అప్పుడప్పుడు తలపడక తప్పటం లేదు.
అదే బాటలో యంగ్ హీరోస్ ఎన్టీఆర్, నాగచైతన్యలు ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నారు. పెద్దగా సినిమా సందడి కనిపించని ఆగస్టు నెలలో ఈ ఇద్దరి సినిమాలు బరిలో దిగుతున్నాయి. జనతా గ్యారేజ్ సినిమా మొదలు పెట్టినప్పుడే ఆగస్టు 12న రిలీజ్ అంటూ ప్రకటించేశాడు తారక్. అందుకు తగ్గట్టుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్పై భారీ అంచనాలు ఉన్నాయి.
అదే సమయంలో రిలీజ్కు రెడీ అవుతున్నాడు యంగ్ హీరో నాగచైతన్య. మళయాల సూపర్ హిట్ సినిమా ప్రేమమ్కు రీమేక్గా అదే పేరుతో తెరకెక్కుతున్న సినిమాను ఆగస్టు రెండో వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. చైతూ సరసన శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
అయితే ఈ రెండూ వేరు వేరు జానర్ల సినిమాలు కావటంతో ఒకేసారి రిలీజ్ అయినా పెద్దగా ఇబ్బంది ఉండదన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ఇతర హీరోల సినిమాలేవి లేకపోవటంతో థియేటర్ల సమస్య కూడా ఉండదన్న నమ్మకంతో ఉన్నారు యూనిట్ సభ్యులు.