నాగచైతన్య సాహసం...
శుక్రవారం రాత్రి పొద్దుపోయే దాకా చెన్నైలో షూటింగ్ జరుపుకొన్న గౌతమ్ మీనన్, నాగ చైతన్య బృందం నిద్రయినా పోలేదు. శనివారం ఉదయాన్నే ఫ్లైట్ పట్టుకొని హైదరాబాద్‌కు వచ్చేసింది. దానికి చాలా కారణాలున్నాయి. శనివారం నాగార్జున పుట్టినరోజు... ఆ అకేషన్‌కి గౌతమ్- నాగ చైతన్యల కొత్త సినిమా టైటిల్ ప్రకటించాలి. అలాగే, ఆ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేయాలి. నిద్ర లేకుండా ప్రయాణం చేసి వచ్చినా, గౌతమ్ యూనిట్‌లో ఉత్సాహం తగ్గలేదు. శనివారం సాయంత్రం... హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో పత్రికలవారి ముందు ‘సాహసం శ్వాసగా సాగిపో’ టైటిల్ ప్రకటిస్తున్న సమయంలో వాళ్ళ ముఖంలో అలసట కన్నా ఆనందం కనిపించింది.
ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో, ‘ద్వారకా క్రియేషన్స్’ పతాకంపై నిర్మాత ఎం. రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. హీరో నాగచైతన్య, మంజిమ హీరో హీరోయిన్లయిన ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత - తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు డి. సురేశ్‌బాబు విడుదల చేశారు.
ఒక సినిమా... రెండు షేడ్స్... హిట్ కాంబినేషన్!
హీరో నాగచైతన్య స్పందిస్తూ, ‘‘స్కూల్, కాలేజీల్లో చదువుతున్న టైమ్‌లో గౌతమ్ సినిమాలు చూసి పెరిగా. ఆయన దర్శకత్వంలో 2009లో ‘ఏం మాయ చేశావె’ చేయడంతో నా కల ఫలించినట్లయింది. ఇప్పుడు మళ్ళీ ఆయనతో మంచి లవ్‌స్టోరీ విత్ యాక్షన్ చేస్తున్నా’’ అన్నారు. ‘‘లవ్‌స్టోరీల ద్వారా గౌతమ్ నాకు ఒక దిశ చూపించారు. ఇప్పుడీ ‘సాహసం శ్వాసగా సాగిపో’లో ఫస్టాఫ్ ‘ఏం మాయ చేశావె’ ఫీల్‌లో ఉంటుంది. సెకండాఫ్ యాక్షన్ ఫక్కీలో నడుస్తుంది. నటుడిగా ఒకే సినిమాలో రెండు కోణాలూ దొరకడం నా అదృష్టం. ఈ సినిమాతో నాకు మళ్ళీ కొత్త దోవ దొరుకుతుంది’’ అని నాగచైతన్య అన్నారు.
హీరోయిన్‌ను చూపించని... టీజర్
ఇదే కథను ఏకకాలంలో తమిళంలో శింబు హీరోగా రూపొందిస్తున్న గౌతమ్ మీనన్ మాట్లాడుతూ, ‘‘ఇప్పటికే షూటింగ్ 70 శాతం పూర్తయింది’’ అని చెప్పారు. ఏ.ఆర్. రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే 4 పాటల చిత్రీకరణ పూర్తయింది. ‘‘హీరోయిన్ మంజిమ పోషిస్తున్న లీల పాత్ర బాగుంటుంది. కావాలనే ఈ టీజర్‌లో ఆమె లుక్స్ చూపించడం లేదు’’ అని గౌతమ్ వివరించారు.
చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ, ‘‘ఒక కొత్త యాంగిల్ ట్రై చేశాం. రొటీన్ కమర్షియల్ మాస్ మసాలా, ఫార్ములా సినిమాలంటూ మా మీద విమర్శలొస్తుంటాయి. ఈ సినిమా దాన్ని బ్రేక్ చేస్తుంది’’ అని నమ్మకంగా చెప్పారు. అన్నట్లు, ఈ సినిమాలో చాలా సీన్లు గౌతమ్ నిజజీవితంలో జరిగిన వేనట! కోన వెంకటే ఆ మాట చెప్పారు. నిర్మాత ఎం.రవీందర్ రెడ్డి, సహ నిర్మాతలు రేష్మా ఘటాల, వెంకీ, సినిమాటోగ్రాఫర్ డాన్ మెక్ ఆర్థర్, సునీత తాటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సినిమా చిత్రీకరణ కొనసాగించడం కోసం కార్యక్రమం అవుతూనే రాత్రి ఫ్లైట్‌కు యూనిట్ సభ్యులు చెన్నై తిరుగుముఖం పట్టారు. ‘‘టీజర్ తర్వాత, నేననుకున్న కథ మొత్తం తెరపై ఎప్పుడెప్పుడు చూస్తానా అని నాకూ అనిపిస్తోంది’’ అని ప్రెస్‌మీట్ నుంచి ఉత్సాహంగా చెన్నైకి బయలుదేరుతూ గౌతమ్ నవ్వేశారు.