అందుకే అఖిల్ విడుదల వాయిదా వేశాం!
‘‘మా రెండో అబ్బాయి అఖిల్‌ని హీరోగా ఎప్పుడెప్పుడు తెరపై చూసుకుందామా? అని ఆత్రంగా ఎదురు చూశా. నేను రషెస్ చూశా. ప్రేక్షకుల నుంచి కూడా ‘బాగుంది’ అనే మాట వినడం కోసం వెయిటింగ్. ఈ నెల 22న వింటాననుకున్నాను. కానీ, విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది’’ అని నాగార్జున అన్నారు. అఖిల్‌ని హీరోగా పరిచయం చేస్తూ వీవీ వినాయక్ దర్శకత్వంలో హీరో నితిన్ నిర్మించిన చిత్రం ‘అఖిల్’. విజయదశమి పర్వదినాన ఈ నెల 22న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. దీనికి కారణాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నాగార్జున చెబుతూ - ‘‘సినిమాలో అఖిల్ డ్యాన్సులు చూసి షాకయ్యాను. ఇంటికెళ్లాక ఐదు నిముషాలు అఖిల్‌నే చూస్తుండిపోయాను.
నా ఇంట్లో ఇంత మంచి డ్యాన్సర్ తిరుగుతున్నాడా? అనిపించింది. ఎప్పుడు నేర్చుకున్నావురా? అని అడిగాను. సినిమా మొత్తం బాగా వచ్చింది. కానీ, ఒక ఎపిసోడ్‌కు సంబంధించి గ్రాఫిక్స్ సరిగ్గా కుదరలేదు. ఆ ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, బాగా కుదిరాకే విడుదల చేద్దామనుకున్నాం. వాయిదా వేయడానికి కారణం ఇదే. గ్రాఫిక్స్ బాగా రావాలనే ఆకాంక్షతో రాజమౌళి ‘బాహుబలి’ కోసం ఏడాదిన్నర తీసుకున్నారు. ఆ చిత్రంలోని గ్రాఫిక్స్ మన తెలుగు సినిమా స్టాండర్డ్‌ను పెంచింది. ఆ స్టాండర్డ్ తగ్గకూడదనే సినిమా విడుదలను కూడా వాయిదా వేసుకున్నాం. అభిమానులకు బాధగానే ఉంటుంది.
నాకు కూడా చాలా బాధగానే ఉంది. కానీ, అన్నీ బాగుండాలి కదా. వాయిదా వేయాలనే విషయాన్ని అఖిల్‌కి నేనే స్వయంగా చెప్పాను. ‘మీ ఇష్టం నాన్నగారూ! మీకెలా అనిపిస్తే అలా’ అని చాలా ప్రశాంతంగా, పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు అభిమానులు నిరాశపడతారు కానీ, రేపు విడుదల తర్వాత సినిమా చూసి చాలా ఆనందపడతారు’’ అన్నారు. విజయదశమి వంటి మంచి రోజు నాడు విడుదల మిస్ కావడంపై మీ అభిప్రాయం ఏమిటనే ప్రశ్నకు - ‘‘ఏడాదిలో బోల్డన్ని మంచి రోజులుంటాయి. ఓ మంచి రోజు వెతుక్కుని రిలీజ్ చేస్తాం.
అయినా అఖిల్ సినిమా ఎప్పుడు విడుదలైతే అప్పుడే మంచి రోజు (నవ్వుతూ...). వాయిదా పడినంత మాత్రాన సినిమా క్రేజ్ పెరుగుతుందే తప్ప తరగదు’’ అన్నారు. ‘‘నాగార్జున గారి అభిమానులకు క్షమాపణలు. గ్రాఫిక్స్‌కి ఇంకాస్త టైమ్ ఇస్తే బాగుంటుందనే వాయిదా వేశాం. ఈ చిత్రంలో అఖిల్‌ని చూసి ఫ్యాన్స్ ఆనందపడతారు’’ అని వినాయక్ చెప్పారు. ‘‘ఎప్పుడు రిలీజైనా ఈ సినిమా సూపర్‌హిట్ అని ఘంటాపథంగా చెబుతున్నా’’ అని నిర్మాత సుధాకర్‌రెడ్డి అన్నారు.