700 ఏళ్ల కోటలో 'భాయ్' ఆట
700 ఏళ్ల కోటలో 'భాయ్' ఆట
Published Tue, Aug 6 2013 1:07 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
అది అందమైన కోట. ఆ కోటకు 700 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ కోటలో నాగార్జున హుషారుగా డాన్స్ చేశారు. ఈ కోటను, నాగ్ చేసిన డాన్స్‌ని ‘భాయ్’లో చూడొచ్చు. వీరభద్రం చౌదరి దర్శకత్వంలో నాగ్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఇటీవల ఈ పాటను చిత్రీకరించారు. స్లోవేనియాలోని ప్రెజామా కాజిల్‌లో చిత్రీకరించిన ఈ పాట కనువిందుగా ఉంటుందని, కోటలో షూటింగ్ చేయడం మర్చిపోలేని అనుభూతినిచ్చిందని నాగార్జున పేర్కొన్నారు.
వాస్తవానికి ఈ పాటను ఐస్‌ల్యాండ్‌లో చిత్రీకరించాలనుకున్నారట. కానీ పాట సీక్వెన్స్‌కి ఆ లొకేషన్ నప్పకపోవడంతో స్లోవేనియాలో చిత్రీకరించారు. త్వరలో ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ నటించిన ఈ చిత్రంలో కామ్న జెఠ్మ లానీ ప్రత్యేక పాత్ర చేశారు. అలాగే ఓ ఐటమ్ సాంగ్‌కి నథాలియా కౌర్ కాలు కదపగా, మరో ఐటమ్ సాంగ్‌కి హంసానందిని నర్తించారు.
నాగార్జున సోదరిగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రం ద్వారా పరిచయమైన జరా షా నటించారు. తమిళ నటుడు, స్నేహ భర్త ప్రసన్న ఈ సినిమా ద్వారా తెలుగుకి పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ పాటలు స్వరపరిచారు. నాగార్జున, ఇతర టీమ్ సభ్యులు అందించిన సహకారంతో ఈ సినిమాని అనుకున్నట్లుగా తీయగలిగానని, బాగా వచ్చిందని వీరభద్రం చౌదరి పేర్కొన్నారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటు న్నారట.
Advertisement