సోగ్గాడే.. చిన్ని నాయనా... | Nagarjuna to play a dual role in his next | Sakshi
Sakshi News home page

సోగ్గాడే.. చిన్ని నాయనా...

Published Tue, Sep 2 2014 10:54 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

సోగ్గాడే.. చిన్ని నాయనా... - Sakshi

సోగ్గాడే.. చిన్ని నాయనా...

 అక్కినేని ‘ఆస్తిపరులు’ చిత్రంలో ఆల్‌టైమ్ హిట్ సాంగ్... ‘సోగ్గాడే... చిన్ని నాయనా. ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు...’. పి.సుశీల పాడిన ఆ పాట ఆ రోజుల్లో యువతను ఓ ఊపు ఊపేసింది. అయితే ఆ పాటలో నటించింది అక్కినేని కాదు - జగ్గయ్య, వాణిశ్రీ. ఇప్పటికీ ఆ పాటకు అభిమానులున్నారంటే అది అతిశయోక్తి కాదు. అందుకేనేమో.. నాగార్జున నటించనున్న చిత్రానికి ఈ పాట పల్లవిలోని ‘సోగ్గాడే... చిన్ని నాయన’ అనే పదాన్ని టైటిల్‌గా ఖరారు చేసినట్టుగా సమాచారం. అష్టాచమ్మా, ఉయ్యాల-జంపాల చిత్రాల నిర్మాత రామ్మోహన్‌తో కలిసి నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. కల్యాణ్‌కృష్ణ ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు.
 
  కొత్త దర్శకుల్ని పరిచయం చేయడంలో నాగ్ ఎప్పుడూ ముందుంటారు. రామ్‌గోపాల్‌వర్మ, వైవీఎస్ చౌదరి, వీఆర్ ప్రతాప్, దశరథ్ తదితరులు నాగార్జున ద్వారానే దర్శకులైన విషయం తెలిసిందే. త్వరలో ఈ జాబితాలోకి కల్యాణ్‌కృష్ణ కూడా చేరతారని సినీ వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి. నిర్మాత రామ్మోహనే స్వయంగా కథ అందించిన ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఆయన సరసన రమ్యకృష్ణ ఓ కథానాయికగా నటించనుండగా, మరో కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. అక్టోబర్‌లో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి కెమెరా: పీఎస్ వినోద్, ఆర్ట్: రవీందర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement