ఇమేజ్ చూడను కాబట్టే స్టార్‌డమ్ వచ్చింది
ఈ కార్యక్రమంలో నాగచైతన్య, అఖిల్ వివాహాల గురించి ప్రశ్నించగా.. త్వరలో ఓ శుభప్రదమైన రోజున పెళ్లి వివరాలు వెల్లడిస్తానని నాగార్జున పేర్కొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కుమారులతో నిర్మిస్తున్న చిత్రాల గురించి నాగ్ మాట్లాడుతూ - ‘‘కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించబోయే సినిమా ‘నిన్నే పెళ్లాడతా’ తరహాలో ఉంటుంది. కానీ, ఆ సినిమాకి రీమేక్ కాదు. ‘మనం’ చేస్తున్నప్పుడే దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ఓ కథ చెప్పాడు. ఆ తర్వాత తను బిజీ. ఆ కథ ఇప్పుడు చేయడానికి వీలు కుదిరింది. మొన్ననే తన పెళ్లయింది కదా. త్వరలో స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. నవంబర్‌లో షూటింగ్‌కు వెళ్తాం. వచ్చే ఏడాది ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్ ‘బంగార్రాజు’ చేస్తాను’’ అన్నారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటిస్తున్న ‘ఓం నమో వెంకటేశాయ’ను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నట్లు నాగార్జున చెప్పారు.
‘‘మంచి కథ ఎప్పుడూ ఆ కథకు కావల్సిన హీరో, ఆర్టిస్టులను వెతుక్కుంటూ వెళ్తుంది. ఈ కథ రోషన్‌ను వెతుక్కుంది. ఇందులో నేను ముఖ్య పాత్ర చేశాను. ఇమేజ్ గురించి పట్టించుకోకుండా ఇటువంటి పాత్రలు చేశాను కాబట్టే ఈ స్టార్‌డమ్‌కి వచ్చాను’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ నాగార్జున సమర్పణలో మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన చిత్రం ‘నిర్మలా కాన్వెంట్’. జి.నాగ కోటేశ్వరరావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రోషన్ సాలూరి స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 8న విడుదల చేయనున్నారు.
నాగార్జున మాట్లాడుతూ - ‘‘తెలుగులో ఇలాంటి చిత్రాలు వచ్చి చాలా రోజులైంది. ప్రేమ దేన్నైనా జయిస్తుందనే సందేశంతో తెరకెక్కింది. సెకండాఫ్ అంతా నా పాత్ర ఉంటుంది. రోషన్, శ్రేయాశర్మ జంట చూడముచ్చటగా ఉంది. రోషన్ నటన చూస్తే మొదటి సినిమాగా అనిపించలేదు. హీరోగా తొలి రోజుల్లో అందరూ నా గొంతు బాగోలేదనేవారు. సంగీత దర్శకుడు రోషన్ ‘మీ గొంతు బాగుంటుంది, మీరు ఈ పాట పాడితే ఇంకా బాగుంటుంది. పాడండి’ అని అడిగాడు. హ్యాపీగా పాడేశాను. ఈ నెల 16న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘నిర్మాతగా నా మొదటి చిత్రమిది.
లవ్ ఈజ్ ఇన్‌స్పిరేషన్, నాలెడ్జ్ ఈజ్ పవర్. ఈ రెండూ కలిసుంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పే చిత్రమిది. భవిష్యత్తులో భారీ చిత్రాలు నిర్మిస్తానో, లేదో చెప్పలేను. కానీ, చిన్న చిత్రాలు మాత్రం తీస్తాను. వ్యక్తిగా నాకు మంచి సంతృప్తినిచ్చిందీ చిత్రం’’ అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ - ‘‘చదువు పూర్తయిన తర్వాత రోషన్‌ని నటుడిగా పరిచయం చేయాలనేది మా ఫ్యామిలీలో అందరి అభిప్రాయం. చిన్న పాత్రే కదా, ఎక్స్‌పీరియన్స్ ఉంటుందని ‘రుద్రమదేవి’లో చేయమన్నాను. ఓరోజు దర్శకుడు వచ్చి ఈ కథ చెప్పారు.
వింటున్నంత సేపూ.. ‘ఇంత మంచి కథ నాకెందుకు చెప్తున్నాడు, ఇందులో నా క్యారెక్టర్ ఏంటి?’ అనేది అర్థం కాలేదు. కథ పూర్తయిన తర్వాత రోషన్ కోసం అన్నారు. నిర్మాతలు ఎవరు? అనడిగితే.. నాగార్జున, ప్రసాద్ గార్లని చెప్పారు. మంచి నిర్మాణ సంస్థ ద్వారా ఓ ఆర్టిస్ట్ పరిచయం కావాలంటే అదృష్టం ఉండాలి. నాగార్జున గారితో కలసి నేను నటించాను. ఆయన నటీనటులకు ఎంత విలువిస్తారో తెలుసు. దాంతో ఓకే చెప్పేశా. రోషన్‌కు, మాకు జీవితాంతం గుర్తుండిపోయే చిత్రం అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.