
‘సినిమాలు మానేసే ఆలోచన అస్సలు లేదు’... వీరేంద్రని పెళ్లాడినప్పుడు నమిత ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇది. గతేడాది నవంబర్‌లో నమిత పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మంచి కథల కోసం ఎదురు చూస్తున్నారు. ఫైనల్లీ తన ఆలోచనలకు తగ్గట్టుగా ఓ సినిమా కుదిరిందట. ప్రముఖ తమిళ దర్శకుడు–నటుడు టి. రాజేందర్ సినిమాలో ఆమె కథానాయికగా నటించనున్నారట. విశేషం ఏంటంటే దాదాపు 11 ఏళ్ల తర్వాత టి.రాజేందర్ దర్శకత్వం వహించనున్న చిత్రమిది. ఇటీవల నమితను కలసి కథ చెప్పారట.
ఇక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. నిజానికి తమిళంలో ఫేమస్ అయ్యే ముందు నమిత తెలుగులోనే స్టార్ హీరోయిన్ అయ్యారు. అందుకే తెలుగు ఇండస్ట్రీ అంటే అభిమానం. తెలుగులో మంచి ఆఫర్స్ వస్తే చేయాలనుందనీ, ముఖ్యంగా చాలెంజింగ్ రోల్స్ కోసం వెయిట్ చేస్తున్నానని నమిత పేర్కొన్నారు. అన్నట్లు.. నమిత సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి రెండేళ్లయింది. 2016లో చేసిన ‘పులి మురుగన్’ ఆమె చివరి సినిమా.