
చరిత్ర సృష్టించిన బాలయ్య సినిమా
నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా సరికొత్త రికార్డు నమోదు చేసింది. దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలో నాలుగు అంకెల రోజులు ప్రదర్శితమైన సినిమాగా చరిత్ర సృష్టించింది. సోమవారం నాటికి ఈ సినిమా 1005 రోజులు పూర్తి చేసుకుందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు తెలిపారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని అర్చన ధియేటర్ లో నిర్విరామంగా వెయ్యి రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుందని వెల్లడించారు. సౌత్ ఇండస్ట్రీలో ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా 'లెజండ్' నిలిచిందన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. తమ అభిమాన నటుడి సినిమా సక్సెస్ ఫుల్ గా వెయ్యి రోజులు పూర్తి చేసుకోవడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కేక్ కట్ చేసి, బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'లెజెండ్' సినిమా 2014, మార్చి 28న విడుదలైంది. జగపతిబాబు తొలిసారిగా ఈ సినిమాలో విలన్ గా నటించాడు. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్, వారాహి చలన చిత్రం సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు.