మనసు నిండిపోయింది...
‘‘మనల్ని మనం సరిదిద్దుకుంటే ప్రపంచం మొత్తం సరి అవుతుంది అనే మంచి కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది. నా కెరీర్లో ‘జెండాపై కపిరాజు’ ప్రత్యేకమైన సినిమా. ఇందులో తొలిసారి ద్విపాత్రాభినయం చేశాను’’ అని నాని అన్నారు. ఆయన కథానాయకునిగా పి.సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జెండాపై కపిరాజు’. మల్టీడైమన్షన్స్ పతాకంపై రజత్ పార్థసారధి, కేఎస్ శ్రీనివాసన్ నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్‌లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ -‘‘మూడ్రోజుల క్రితం సినిమా మొత్తం చూశాను. మనసు నిండిపోయింది. ఏదో మంచి పని చేసిన ఫీలింగ్. సామాజిక దృక్పథంతో సాగే ఇలాంటి సినిమాలో నటించినందుకు గర్వంగా ఉంది. సముద్రఖని అద్భుతంగా సినిమాను మలిచారు. ఈ సినిమాలో కీలక సన్నివేశంలో వచ్చే మూడు నిమిషాల ఫైట్ కోసం ఇరవై నాలుగు రోజులు కష్టపడ్డాం’’ అని చెప్పారు. అన్ని కార్యక్రమాలూ పూర్తయ్యాయని, త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని ‘మల్టీడైమన్షన్’ వాసు తెలిపారు.