జనరల్‌గా బస్తీ మే సవాల్ అంటుంటారు.. కానీ, నాని మాత్రం పాతబస్తీ మే సవాల్ అంటున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో నాని ఎవరితో సవాల్ చేశారనేగా మీ డౌట్. ఇంకెవరితో విలన్లతో. బరిలోకి దిగి వాళ్లను రఫ్పాడించేస్తున్నారట. ఇదంతా ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా కోసమే. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ ఫైట్‌ని పాతబస్తీలోని చార్మినార్ సమీపంలో తెరకెక్కిస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అక్కడే నాని విలన్ల భరతం పడుతున్నారు.
ఇటీవల ‘ఎంసీఏ’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ సక్సెస్‌ఫుల్ హీరో రెట్టించిన ఉత్సాహంతో ‘కృష్ణార్జున యుద్ధం’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో తొలిసారి నాని ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. అనుపమ పరమేశ్వరన్, రుఖ్సార్ మీర్ కథానాయికలు. వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 12న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని.
Comments
Please login to add a commentAdd a comment