రిపీట్ అవుతోన్న హిట్ కాంబినేషన్
నారా రోహిత్, శ్రీ విష్ణులది హిట్ కాంబినేషన్.. ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇటీవల ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అప్పట్లో ఒకడుండేవాడు అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకే మరోసారి ఈ హిట్ కాంబినేషన్ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాకు అసోసియేట్గా పనిచేసిన ఇంద్రసేనను దర్శకుడిగా పరిచయంచేస్తూ నారా రోహిత్, శ్రీవిష్ణు కాంబినేషన్లో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
బెల్లాన అప్పారావు నిర్మిస్తున్న ఈ సినిమాను మే రెండో వారంలో ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శ్రియ కీలక పాత్రలో కనిపించనుంది. మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్కు జ్యోతిలక్ష్మి ఫేం సత్యదేవ్ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం నారా రోహిత్, శ్రీ విష్ణులు చేస్తున్న ప్రాజెక్ట్స్తో పాటు ఈ సినిమాను కూడా ఒకసారి పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.