‘జోక్ చేశారనుకున్నా, అసలు ఊహించలేదు’
చెన్నై : ‘శతమానం భవతి’ జాతీయస్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఎంపిక కావడంపై ఆ చిత్ర దర్శకుడు సతీష్ వేగ్నేశ సంతోషం వ్యక్తం చేశారు. 64వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ వేగ్నేశమాట్లాడుతూ... ’ఇది నాకు ప్లజెంట్ సర్‌ఫ్రైజ్. శతమానం భవతి చిత్రానికి అవార్డు వచ్చినట్లు మా ప్రొడక్షన్ టీమ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అయితే వాళ్లు జోక్ చేశారనుకున్నారు. ఈ సినిమాకు అవార్డు వస్తుందని అస్సలు ఊహించలేదు. అందుకే ఇది నిజంగా సర్‌ఫ్రైజే. ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాతకు థ్యాంక్స్ చెప్పాలి’. అని అన్నారు.
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన 'శతమానం భవతి' బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడమే కాకుండా మంచి వసూళ్లు రాబట్టింది. శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధలు ప్రధాన తారాగణంగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఫ్యామిలీ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చింది.