ముంబై : నేషనల్ ఫిల్మ్ అవార్డు, పద్మశ్రీలు వరించినా ఆయన బ్యాంక్ ఖాతాలో ఇప్పుడు చిల్లిగవ్వ లేదు. ఆర్ట్ చిత్రాలకు తన సుస్వర స్వరాలతో జీవం పోసిన ఆ దిగ్గజ కళాకారుడు ప్రస్తుతం దిక్కుతోచని స్ధితిలో పడిపోయారు. గోవింద్ నిహ్లాని తమస్ చిత్రానికి గాను మ్యూజిక్ కంపోజర్ వన్‌రాజ్ భాటియాకు 1988లో నేషనల్ ఫిల్మ్ అవార్డు లభించగా, 2012లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు అందివచ్చింది. వినూత్న స్వరాలతో 1970, 1980 ప్రాంతాల్లో కళాత్మక చిత్రాలకు ప్రాణం పోసిన వన్‌రాజ్ భాటియా ప్రస్తుతం 92 ఏళ్ల వయసులో రోజువారీ ఖర్చుల కోసం జేబు వెతుక్కునే స్థితిలో ఉన్నారు.
వృద్ధాప్యంలో వెంటాడే వ్యాధులతో చేతిలో చిల్లిగవ్వ లేకుండా నెట్టుకొస్తున్నానని ఆయన వాపోయారు. తాను జ్ఞాపకశక్తిని కోల్పోతున్నానని, మోకాళ్ల నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, ఇప్పుడు తన బ్యాంకు ఖాతాలో ఒక్క రూపాయి కూడా లేదని ముంబై మిర్రర్‌తో ఆయన చెప్పుకొచ్చారు. తాను కేవలం పనిమనిషి సేవలపై ఆధారపడి బతుకు వెళ్లతీస్తున్నానని, దైనందిన ఖర్చుల కోసం విదేశాల నుంచి తెప్పించుకున్న వంట సామాగ్రిని అమ్ముకునేందుకు సిద్ధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను దశాబ్ధాలుగా వైద్య సేవలను పొందలేదని, దీంతో కచ్చితంగా తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో వెల్లడించలేనని చెప్పారు. 1989లో సంగీత నాటక అకాడమీ అవార్డునూ సొంతం చేసుకున్న భాటియా లండన్ రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్‌లోనూ పాశ్చాత్య శాస్ర్తీయ సంగీతాన్ని అభ్యసించారు.
Comments
Please login to add a commentAdd a comment