ఆమెను అక్కడ పరిచయం చేయాలన్నదే నా కోరిక!
నటి నయనతారను బాలీవుడ్‌కు పరిచయం చేయాలన్నది తన కోరిక అని అన్నారు ప్రముఖ హిందీ నిర్మాత వాసు భగ్నాని. ఆయన తన భాగస్వామి దీప్‌షిఖా దేశ్‌ముఖ్‌తో కలిసి పూజా ఎంటర్‌టెయిన్‌మెంట్ అండ్ ఫిలింస్ లిమిటెడ్ పతాకంపై హిందీ, మరాఠి, పంజాబీ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. వాటిలో బిగ్‌బీ అమితాబ్, షారూఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ వంటి ప్రముఖ కథానాయకుల చిత్రాలు ఉన్నాయి. అలాంటి సంస్థ తాజాగా దక్షిణాదిలోనూ చిత్రాలు నిర్మించడానికి రెడీ అయ్యింది. తొలి ప్రయత్నంగా నయనతార కథానాయకిగా కొలైయుధీర్ కాలం అనే చిత్రాన్ని నిర్మిస్తోంది.
దీనికి ఇంతకు ముందు కమలహాసన్ హీరోగా ఎన్నైప్పోల్ ఒరువన్, అజిత్‌తో బిల్లా–2 చిత్రాలను తెరకెక్కించిన చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ సెంట్రిక్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యువన్‌శంకర్‌రాజా సంగీత బాణీలు కడుతున్నారు. ఇప్పటికే ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలై చాలా ఆతృతను రేకెత్తించిన కొలైయుధీర్ కాలం చిత్రం శుక్రవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా పూజా ఎంటర్‌టెయిన్‌మెంట్ అండ్ ఫిలింస్ లిమిటెడ్ సంస్థ అధినేతలలో ఒకరైన వాసు భగ్నానీ మాట్లాడుతూ తమిళ చిత్రాలంటే తనకు చాలా ఆసక్తి అన్నారు. తాను తాను హిందీలో తొలిసారిగా నిర్మించిన కూలీ–1 చిత్రం తమిళ చిత్రం చిన్న మాప్పిళ్‌లైకు రీమేక్ అని తెలిపారు.ఆ తరువాత సతీలీలావతి చిత్రాన్ని రీమేక్ చేసినట్లు చెప్పారు.అలా ఇప్పటికి పలు భాషల్లో 30 చిత్రాలు చేసిన తమ సంస్థలో నిర్మిస్తున్న 31వ చిత్రం ఈ కొలైయుధీర్ కాలం అని తెలిపారు. తాను చూసిన ఉత్తమ నటీమణుల్లో నయనతార ఒకరన్నారు. అలాంటి నటి హీరోయిన్‌గా దక్షిణాదిలో తొలి చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు.
నయనతారను బాలీవుడ్‌కు పరిచయం చేయాలన్నది తన కోరిక అని, అంత టాలెంట్ ఉన్న నటి నయనతార అని పేర్కొన్నారు. తాము దక్షిణాదిలో అభిషేక్ ఫిలింస్ సంస్థతో కలిసి చిత్ర నిర్మా ణం, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇకపై తమిళం, మలయాళం భాషల్లో వరుసగా చిత్రాలు నిర్మించాలని భావిస్తున్నట్లు చెప్పారు.ఈ కొలైయుధీర్ కాలం చిత్ర హిందీ వెర్షన్‌లో నయనతార పాత్రను మిల్కీబ్యూటీ తమన్నా పోషించనున్నారు.ఆయనతోపాటు నటుడు ప్రభుదేవా నటించనున్నారు.